అప్పుడే ఎంపీ సీట్ల లొల్లి..బీసీ లకు ఇవ్వాలని సీఎం కు వినతులు

  • బలమైన లీడర్లు ను రంగంలో దింపాలని హైకమాండ్​ ప్లాన్

నల్గొండ, వెలుగు : ఉమ్మడి జిల్లా బీఆర్​ఎస్ లో ఎంపీ సీట్ల లొల్లి షురూ అయింది. అసెంబ్లీ సీట్లు సిట్టింగ్​లకే ఇవ్వడంతో ఇప్పుడు ఆశావహుల దృష్టంతా ఎంపీ సీట్ల పైన పడింది. సీఎం కేసీఆర్​ సిట్టింగ్​ ఎమ్మెల్యేలకే టికెట్టు ఇచ్చినట్టు ఎంపీలకు కూడా అలాగే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మేరకు పలువురు ఆశావహులు సీఎం మెప్పుపొందేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎమ్మెల్యే టికెట్​ పైన పెట్టుకున్న ఆశలు నెరవేరని ఇంకొంత మంది లీడర్లు ఎంపీ సీటు కోసం  ప్రయత్నిస్తున్నారు. ఈ జాబితాలో  భువనగిరి ఎంపీ  సెగ్మెంట్​ నేతలు ముందున్నారు.  

కాంగ్రెస్​   మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్​ కుమార్​ రెడ్డి బీఆర్​ఎస్​లో చేరడంతో ఆయనకు భువనగిరి ఎంపీ సీటు ఆఫర్​ చేశారు. తనకు ఎంపీ టికెట్ ఇస్తున్నట్టు  సీఎం చెప్పిన విషయాన్ని కూడా అనిల్​ ఇటీవల ప్రకటించారు. కానీ  బీఆర్​ఎస్​లో భువనగిరి పార్లమెంట్​ స్థానాన్ని బీసీలకు మాత్రమే కేటాయిస్తూ వస్తున్నారు.  2009 నుంచి 2019 ఎన్నికల వ రకు భువనగిరి సీటు పైన బీసీ క్యాండేంట్​ను నిలబెట్టారు. ఇప్పుడు మళ్లీ అదే స్థానానికి బీసీ, ఓసీ లీడర్లు పోటీ పడుతున్నారు. 

నల్గొండ ఎంపీ స్థానంతో పోలిస్తే భువనగిరి సెగ్మెంట్​ పరిధిలో గౌడ, యాదవ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ ఉండటంతో ఈ స్థానాన్ని అదే వర్గానికి చెందిన లీడర్లకు కేటాయించారు.  కానీ బీఆర్​ఎస్ జాతీయ పార్టీగా మారిన నేపథ్యంలో జాతీయ స్థాయి అవసరాల దృష్ట్యా ఆర్థికంగా, సామాజికంగా బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని  హైకమాండ్​ చూస్తోంది. కుంభం అనిల్​ రెడ్డి రాకతో భువనగిరి లో ఆ లోటు తీరిందని భావిస్తున్న తరుణంలో కొత్తగా బీసీ లీడర్లు పోటీ పడటం బీఆర్​ఎస్​లో కొత్త కుంపటి రాజేసింది.

బీసీలు వర్సెస్​ ఓసీలు..

సీఎం కేసీఆర్​ హామీతో మునుగోడు ఉప ఎన్నికల టైంలో బీజేపీ నుంచి బీఆర్​ఎస్​లో చేరిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్​ పరిస్థితి   అటుఇటుగా మారింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లేక పోతే ఏదైనా కార్పొరేషన్​ చైర్మన్​ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇవేమీ నెరవేరకపోవడంతో చివరగా భువనగిరి ఎంపీ సీటు లభిస్తుందని ఆశిస్తున్నారు. గౌడ సామాజిక వర్గానికి జిల్లాలో సరియైన ప్రాధాన్యం కల్పించలేదని బీఆర్ఎస్​ విమర్శలు ఎదుర్కొంటోంది. దీన్ని నుంచి బయట పడాలంటే ఆపార్టీకి భిక్షమయ్యగౌడ్​ తప్పా వేరొకరు లేరని  నేతలు చెబుతున్నారు. 

కానీ అదే కోవలో నకిరేకల్​ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర షీప్స్​అండ్​ గోట్స్​ డెవలప్మెంట్​ కార్పొరేషన్​ చైర్మన్​ డాక్టర్​ దూదిమెట్ల బాలరాజు యాదవ్​ కూడా ఎంపీ టికెట్​ కోసం ప్రయత్ని స్తున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్​ను కలిసిన ఆయన భువనగిరి సెగ్మెంట్​ పరిధిలో బీసీ ఓటర్ల లెక్కలను, తన బయోడేటాను సీఎంకు అందజేశారు. 

భువనగిరి ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలు ఐదు రెడ్లకు ఇవ్వగా, మరో రెండు ఎస్సీలకు రిజర్వు అయ్యాయి. కాబట్టి ఎంపీ టికెట్​ ఎట్టి పరిస్థితుల్లో బీసీలకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. పైగా రాష్ట్రంలో 1 7 ఎంపీ సీట్లలో ఈక్వేషన్స్​ ప్రకారం చూస్తే బీసీలకు ఇచ్చేందుకు జహీరా బాద్​, భువనగిరిలో మాత్రమే అవకాశం ఉందని ఆ పార్టీ లీడర్లు చెబుతు న్నారు. 

నల్గొండ సీటు రెడ్లకేనా..!

కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న నల్గొండ ఎంపీ స్థానాన్ని ఇప్పటి వరకు బీఆర్​ఎస్ గెలిచిన దాఖాల్లేవు. 2009 నుంచి 2019 వరకు బీఆర్​ఎస్​ చే సిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు 2014లో కాంగ్రెస్​ నుంచి గెలిచి న గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్​ఎస్​లో చేరినప్పటికీ 2019 ఎన్నికల్లో ఆపార్టీకి గెలుపు దక్కలేదు. దీంతో ఈసారి నల్గొండ సీటును ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలని చూస్తోంది. గత ఎన్నికల్లో  బలమైన అభ్యర్థులతో ప్రయోగం చేసినప్పటికీ సక్సెస్​ కాలేదు. 

బీఆర్​ఎస్ జాతీయ అవసరాలను దృష్టిలో పెట్టకుని అవసరమైతే నల్గొండ, భువనగి రి రెండు సీట్లను రెడ్లకే ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతానికి నల్గొండ స్థానానికి మండలి చైర్మన్​ గుత్తా కొడుకు అమిత్​ రెడ్డితో పాటు, మంత్రి జగదీష్​ రెడ్డి ప్రధాన అనుచరుడు  రియల్​ ఎస్టేట్​ దిగ్గజం సూర్యాపేటకు చెందిన మందడి నరేందర్​ రెడ్డి పేరు వినిపిస్తోంది. ఇటీవల మంత్రి జగదీశ్​ రెడ్డితో కలిసి నరేందర్​ రెడ్డి సీఎంను కలవడం ఈ చర్చకు దారితీసింది.