తెలంగాణలో భారత రాష్ట్ర సమితి భవిష్యత్తు అంధకారబందూరం కాబోతున్నదా?! ఇంతకా పార్టీ పయనమెటు? అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల దాకా వేచి ఉండే ధోరణితో ఉన్న పార్టీ క్యాడర్ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల సరళిని చూసి ఇక వేచి ఉండడం వృథా అనుకుంటున్నదా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి! నిజానికి అసెంబ్లీ ఎన్నికల అనంతరం తెలంగాణ భవన్ వేదికగా రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాల పరిధిలో గల పార్టీ ముఖ్యులు సమాలోచనలు జరిపితే అనేకానేక అంశాలు చర్చకొచ్చినయి. వాటిల్లో ప్రధానమైంది పార్టీ నిర్మాణం జరగాలని, పార్టీ నిర్వహణ తీరులో మార్పు రావాలని. పార్టీ, అధినాయకత్వం ఎక్కడ తప్పటడుగులు వేస్తోందో కూడా క్యాడర్ కడుపు చించుకుని మరీ ఆవేదన వెలిబుచ్చింది. అయితే, ఈ రెండింటిని పార్టీ అధినాయకత్వం చాలా సౌకర్యవంతంగా వదిలేసింది.
ఆపద వచ్చినప్పుడు ద్రవిడియన్ పార్టీల్లా ఉండాలని భీకర ప్రతిజ్ఞలు చేస్తూనే, అవసరం తీరాక ఆ విషయాన్నే విస్మరించడం పార్టీకి తీరని నష్టాన్ని తెచ్చి పెడుతోంది. ఈ క్రమంలో విధిగా ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ఆలోచించే స్థితిలో అన్ని స్థాయిల క్యాడర్ ఆలోచిస్తున్నది.
క్యాడర్ చెల్లాచెదురు
దిద్దుబాటు చర్యల మాట పక్కనపెడితే పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికలో అవలంబించిన వైఖరికి క్షేత్ర స్థాయి క్యాడర్ చేతులెత్తేసింది. నిజానికి కొన్ని జిల్లాల్లో పార్టీ అధ్యక్షులే ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. వరంగల్ లాంటి చోట అధ్యక్షుడు పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. ఇక పార్లమెంట్ ఎన్నికల టైంలోనే ఆరుగురు సిట్టింగ్ ఎంపీలు బీజేపీలోకి వెళ్లిపోయారు. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలూ కండువాలు మార్చుకుని సొంత పార్టీపైనే అభ్యర్థులుగా బరిలోకి దిగారు. 60లక్షల మంది సభ్యత్వం గల 24 ఏండ్ల పార్టీలో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తయారు చేయలేకపోయింది. అది వైఫల్యం కాదా అంటే తప్పకుండా పార్టీ తప్పిదమే. అయితే, బీఆర్ఎస్ అధినాయకత్వం ఇప్పుడే ఇలా చేసిందా. గతంలో ఎన్నడూ వ్యవహరించలేదా అంటే 2001 నుంచి ఇప్పటివరకూ దాదాపు ఇదే పరిస్థితి. నమ్మినవాళ్లు, నెత్తిన కూర్చుబెట్టుకున్నవాళ్లు, క్యాబినెట్ హోదాలు అనుభవించి అధికారం పోగానే ఇపుడు పార్టీ ఫిరాయింపులు మొదలుపెట్టారు. ఊరందరిది ఒక దారి ఉలిపిరి కట్టది మరో దారి అన్నట్టుగా బీఆర్ఎస్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అయినా ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోవడంలో బీఆర్ఎస్ మొదట్నుంచి ఒంటెత్తు పోకడలనే పోతున్నది. పార్లమెంట్ ఫలితాలెలా వస్తాయో పార్టీ అధినేత దగ్గర నుంచి గ్రామంలో ఉన్న కార్యకర్తకూ ఓ నిశ్చితమైన అభిప్రాయం ఉన్నది. పార్లమెంట్ ఫలితాల తర్వాత పార్టీ మిగులుతుందా.. స్థానిక సంస్థల్లోనైనా కనీసం బరిలో నిలవగలుగుతుందా అన్నదే ప్రస్తుతం చర్చ.
పడిపోయిన ఓట్ల శాతం
2019 పార్లమెంట్ ఎన్నికల్లో 41.7 శాతం ఓట్లతో 9 స్థానాలు గెలుచుకున్న అప్పటి టీఆర్ఎస్ ఈ పార్ల మెంట్ ఎన్నికలు వచ్చేసరికి సగానికి పైగా ఆ ఓట్ల శాతం పడిపోనుంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 37.35 శాతంతో 39 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకున్న పార్టీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఆ ఓట్ల శాతం పెరగాలి, సీట్లూ పెరగాలి. అందుకు తగ్గట్టుగానే కరవు, కరెంటు సమస్య, వడ్ల కొనుగోళ్లు, కాంగ్రెస్ సర్కారు వంద రోజుల పాలన, కాంగ్రెస్ హామీలు వంటి అంశాలను కేసీఆర్ జనాల్లో చర్చకు పెట్టారు. ఈ పార్లమెంట్ ఎన్నిక్లలో తన అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా యాత్రకు రూపకల్పన చేశారు. బస్సు యాత్ర క్యాడర్లో బలాన్ని నైతిక స్థైర్యాన్ని పెంచేందుకు ప్రయత్నించారు. పదేండ్లు సామాన్యులను, క్యాడర్‌ను కలుసుకోలేని కేసీఆర్ చివరకు హోటళ్లల్లో బజ్జీలు తింటూ అందరితో ఫొటోలు దిగుతూ నేను మారానని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ, కేసీఆర్ చేతలకు, ఆయన నడవడికకు స్పష్టమైన తేడాను జనం
గమనించారు.
బీజేపీకి వరం కానుందా?
దక్షిణాన ముఖ్యంగా తెలంగాణ గడ్డపై బీజేపి వెంట పార్టీ క్యాడర్ ర్యాలీ అయ్యారంటే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ అవసరం తీరిపోయిందనే బలమైన సందేశం వెళుతుంది. నిన్నటిదాక కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ పార్టీగా టీఆర్ఎస్ ఉండేది. బీఆర్ఎస్గా మారాక ఇప్పుడా పార్టీ అవసరం తెలంగాణ రాజకీయాల్లో అనవసరమనే చర్చకు కొనసాగింపుగా బీజేపీకి పెరుగబోతున్న ఓట్లు, సీట్ల శాతమే తార్కాణం.
నిలబడగలడా.. కాలానికి వదిలేస్తాడా?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం, రాజకీయ పార్టీ అవతరణ కోసం టీఆర్ఎస్ వేదికగా అనేక పోరాటాలు జరిగాయి. పార్టీ ఉత్థాన పతనాలను చవి చూడడం కొత్తేమీ కాదు. కానీ, ఇప్పటి పరిస్థితి వేరు. రెండు జాతీయ పార్టీలు బలంగా వేళ్లూనుకుపోతున్నప్పుడు బీఆర్ఎస్ అవసరం ఉండకపోవచ్చన్నది ఓ వాదన. ఒకవేళ అదే పోరాట స్పూర్తితో బీఆర్ఎస్ ఉంటే 39 మంది ఎమ్మెల్యేల బలంతో రాష్ట్రంలో ప్రజల పక్షాన బలంగా పోరాడే అవకాశం ఉంది. కానీ, ఉన్న 39 మంది ఎమ్మెల్యేలలో ఎందరుంటారో పార్టీ నాయకత్వానికే ఓ క్లారిటీ లేదు. ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం పట్ల ఇప్పటికీ జనాల్లో ఓ రకమైన చర్చ నడుస్తున్నది. దానికి తోడు 14 ఏండ్ల ఉద్యమ పార్టీ, పదేండ్ల అధికార పార్టీ ఒక్కసారిగా అధికారానికి దూరం కావడం, కన్న కూతురు జైలు పాలవ్వడం, గత సర్కారు హయాంలోని తప్పిదాలపై విచారణలకు తోడు ఎన్నికలలో వరుస ఓటములతో లీడర్, క్యాడర్ ఓ ఐదేండ్లు వేచి చూసే ధోరణితో ఉంటారా? అనే చర్చా లేకపోలేదు. ఈ క్రమంలో ఈ వయసులో పార్టీకి కేసీఆర్ పెద్ద దిక్కుగా ఉండి ముందుకు నడిపిస్తారా, ముందుగా పార్టీ నిర్మాణం క్షేత్ర స్థాయి నుంచి చేపడతారా? కోటరీలను పక్కన పెట్టి కష్టపడే వారిని గుర్తించి పార్టీని బతికించుకుంటారా, లేక రాష్ట్రం సిద్ధించింది, పదేండ్లు అధికార వాంఛా తీరింది, ఇంకేం అవసరమని ఎవరిమానాన వాళ్లను వదిలేస్తారా అన్నది కాలమే సమాధానం చెప్పనుంది.
తప్పటడుగులు
అసెంబ్లీ ఎన్నిక్లలో పార్టీ ఓడితే బీఆర్ఎస్ను ఓడించి తప్పు చేశారని మాట్లాడడం, గ్రామీణ తెలంగాణ ఓటర్లకు తెలివి లేదని కేటీఆర్ వ్యాఖ్యానించడం వంటి వాటిని జనాలు పరిగణనలోకి తీసుకున్నారు. అయితే, ఇదే క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ తప్పటడుగులు వేసిండనే చెప్పాలి. బలహీనమైన అభ్యర్థులను బరిలోకి దింపి బలమైన రెండు జాతీయ పార్టీలతో కొట్లాడారు. అంటే గతంలో ఇదే పార్టీలతో కేసీఆర్ పోరాటం చేసినప్పటికీ ఈసారి ఎన్నికల్లో ఆ రెండు జాతీయ పార్టీలు ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో బలంగా ఉన్నాయనే సత్యాన్ని జనం గ్రహించి పార్లమెంట్ ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ రోల్ ఏందని చర్చ చేశారు. కొన్ని ప్రాంతాల్లో క్యాడర్ బలంగా కేసీఆర్ సభలకు హాజరైనా ఓటింగ్‌కు వచ్చేసరికి పార్టీని, అధినేతను ఈసారి అంతగా పట్టించుకోనట్లే కనపడింది.
భవిష్యత్తు ప్రశ్నార్థకం
తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో ఒక్క మెదక్ పార్లమెంట్ స్థానం మినహా ఎక్కడా పార్టీ కనీసం పోటీ ఇవ్వలేకపోవడం పార్టీ భవిష్యత్తును ప్రశ్నిస్తోంది. దాదాపు 10కి పైగా స్థానాల్లో పార్టీ మూడో స్థానంలో ఉంటుందని పలు సర్వే సంస్థలు అంచనాలు వేస్తున్నాయి. అంటే ఈసారి ఒకటి లేదా సున్నా సీట్లొస్తాయని, రమారమిగా 16 నుంచి 19 శాతం ఓట్లే ఆ పార్టీ సాధించ గలుగుతుందని కూడా లెక్కలు కడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఓట్లు సాధిస్తేనే పార్టీ బతుకుతుంది. తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి రానున్న రోజుల్లో మిగులుతుంది. కానీ, క్షేత్రంలో ఆ పరిస్థితి లేకపోవడంతో పార్టీ ముందున్న ప్రత్యామ్నాయం ఏంటన్నది ఇప్పుడు చర్చ జరుగుతున్నది. అధికారం కోల్పోతే భోగాలు, యోగాలు పూర్తిగా తగ్గిపోతాయని కూడా కేసీఆర్‌కు తెలుసు. కాకపోతే పార్టీ ఇంతలా నష్టపోతుందని, క్యాడర్ ఈ రకంగా దూరమవుతుందని ఊహించలేకపోయారు. అందుకే పార్టీకి 10 నుంచి 13 సీట్లొస్తాయని, కేంద్రంలో సంకీర్ణ సర్కారొస్తుందని, అవకాశమొస్తే ప్రధానినవుతానని కేసీఆర్ చెబితే జనం నవ్వుకుని తమదైన శైలిలో ఈ ఎన్నికల్లో తీర్పు చెప్పబోతున్నారనే వాస్తవాన్ని గ్రహించాలి.
- వెంకట్ గుంటిపల్లి,
తెలంగాణ జర్నలిస్టుల ఫోరం