
యాదగిరిగుట్ట, వెలుగు : ప్రజా ప్రభుత్వమంటే ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టడమా..? అని యాదగిరిగుట్ట మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య ప్రశ్నించారు. మంగళవారం యాదగిరిగుట్టలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యాదగిరిగుట్టలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు మితిమీరిపోయాయని, ఏ వ్యాపారం చేయాలన్నా ముడుపులు చెల్లించాల్సి వస్తోందన్నారు.
యాదగిరిగుట్టలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ బంక్ ఓనర్ ను కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్లు ముక్కెర్ల మల్లేశ్ యాదవ్, గుండ్లపల్లి భరత్ గౌడ్ రూ.5 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించిన బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ పై పోలీసులతో కేసు పెట్టించారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులపై వస్తున్న ఆరోపణలపై స్పష్టత ఇచ్చి నిజాయితీ నిరూపించుకోకుండా.. ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఇకనైనా కాంగ్రెస్ నాయకులు తమ ఆగడాలను బంద్ చేయాలని, లేకపోతే రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.