
పార్కింగ్ కే వెయ్యికిపైగా ఎకరాల స్థలం
154 ఎకరాల్లో సభా వేదిక, ప్రాంగణానికి ఏర్పాట్లు
ఫాంహౌస్లో కేసీఆర్తో వరంగల్ జిల్లా నేతల చర్చలు
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను వరంగల్ లోని ఎల్కతుర్తిలో 1,213 ఎకరాల స్థలంలో నిర్వహిస్తామని పార్టీ వరంగల్ జిల్లా నాయకులు వెల్లడించారు. అందులో 50 వేల వాహనాలను నిలిపి ఉంచేందుకు వీలుగా 1,059 ఎకరాలు పార్కింగ్కోసమే కేటాయించామని చెప్పారు. మిగతా154 ఎకరాల్లో సభను నిర్వహిస్తామన్నారు. మంగళవారం ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్తో పార్టీ వరంగల్ జిల్లా నేతలు సమావేశమయ్యారు. ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ ఏర్పాట్లపై వారు చర్చించారు.
వరంగల్ సభను విజయవంతం చేస్తామని, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే కార్యకర్తలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పది లక్షల మజ్జిగ ప్యాకెట్లు, పది లక్షల నీళ్ల బాటిళ్లను సిద్ధం చేస్తామన్నారు. వరంగల్ ముద్దుబిడ్డలు కాళోజీ నారాయణరావు, ప్రొఫెసర్ జయశంకర్ అందించిన ఉద్యమ స్ఫూర్తితో భవిష్యత్ కార్యాచరణను అమలు చేస్తామన్నారు. రాష్ట్రానికి కేసీఆరే శ్రీరామరక్ష అని నిరూపితమైందని, తిరిగి కేసీఆర్ పాలనను అందించడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. కేటీఆర్, బండ ప్రకాశ్, మధుసూదనాచారి సీనియర్ నేతలు పాల్గొన్నారు.
సమావేశానికి హాజరుకాని హరీశ్
కేసీఆర్తో జరిగిన సమావేశానికి హరీశ్ రావు హాజరు కాలేదు. సభకు ఇన్చార్జిగా హరీశ్ రావును గతంలో కేసీఆర్ ప్రకటించారు. అయినా ఆయన ఈ సమావేశానికి హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. తొలుత హనుమకొండలో సభ నిర్వహిస్తామని కేసీఆర్ చెప్పారు. అక్కడ హరీశ్ రెండు మూడుసార్లు సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాత అనుకోకుండా సభా స్థలాన్ని ఎల్కతుర్తికి మార్చారు. ప్రస్తుతం ఆ సభ బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే సతీశ్ బాబు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో హరీశ్ఈ సమావేశానికి రాకపోవడం చర్చకు దారి తీసింది.