- సిట్టింగ్స్థానం నుంచి వేరొక నియోజకవర్గానికి చేంజ్
- ఇదే అంశంపై ఉమ్మడి నల్గొండ జిల్లాలో జోరుగా ప్రచారం
నల్గొండ, వెలుగు : ఈసారి ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మార్పు తప్పదనే ప్రచారం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అదే జరిగితే కనీసం ముగ్గురు ఎమ్మెల్యేల మార్పు ఖాయం అనే ప్రచారం జోరుగా సాగుతోంది. జిల్లాలో ఇటీవల జరిగిన మునుగోడు బైపోల్లో సర్వశక్తులు ఒడ్డితేగాని గెలువలేకపోయామని, ఈ పరిస్థితుల్లో ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉన్న అభ్యర్థులను మార్చడంపై ఇటీవల ప్రగతిభవన్‌లో పార్టీ హైకమాండ్ లోతుగా చర్చినట్లు సమాచారం. సిట్టింగ్‌లను మరోస్థానానికి మార్చే అంశంపైన కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఇటీవల మీటింగ్‌లో జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి మాత్రం ఈసారి సిట్టింగ్‌లకే సీట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు.
ఆ నియోజకవర్గాల పైనే ఫోకస్..
ఇప్పటికే నల్గొండ జిల్లాలో ఓ సిట్టింగ్ ఎమ్మెల్యేకు స్థానిక నేతలతో ఉన్న విభేదాల వల్ల బీఆర్ఎస్కు తీరని నష్టం వాటిల్లిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో అందరిని కలుపుకొని పోయే నాయకుడు, వాళ్ల వారసులను రంగంలోకి దింపితే ఎలా ఉంటుందనే దానిపై హైకమాండ్ కసరత్తు చేస్తోంది. అక్కడ ఉన్న ఎమ్మెల్యేను ఇటీవల ఉప ఎన్నిక జరిగిన నియోజకవర్గానికి మారిస్తే ఎట్లా ఉంటుందని హైకమాండ్ పరిశీలిస్తోందని చెప్తున్నారు.
సూర్యాపేట జిల్లాలో...
సూర్యాపేట జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో కూడా మార్పులు ఉండొచన్న ప్రచారం జరుగుతోంది. ఆంధ్రా సరిహద్దులోని నియోజకవర్గ ఎమ్మెల్యే వైఖరి వల్ల పార్టీలో గ్రూపు తగాదాలు రచ్చకెక్కాయి. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో గట్టెక్కిన ఆ ఎమ్మెల్యేకు ఈసారి గెలిచే అవకాశాలు తక్కువనేనని ఇంటిలిజెన్స్వర్గాల నుంచి హైకమాండ్‌కు రిపోర్ట్ వెళ్లినట్లు తెలిసింది. దీంతో కొత్త లీడర్‌కు చాన్స్ఇస్తే ఎట్లా ఉంటుంది? అనే కోణంలో ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ మార్పు వల్ల ఆ నియోజకవర్గంలో బీజేపీకి తామే అవకాశం ఇచ్చినట్లు అవుతుందనే అభిప్రాయాలు లేకపోలేదు. ఇదే జిల్లాలోని మరో నియోజకవర్గంలో గత రెండు ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందిన ఎమ్మెల్యేను కూడా మారుస్తారని ప్రచారంలో ఉంది. ఆయన కాంగ్రెస్‌లో నెలకొన్న గ్రూపు రాజకీయాల వల్లే గెలిచినట్టు భావిస్తోంది. పైగా ఇటీవల నియోజకవర్గంలో జరిగిన గొడవలు ఆ ఎమ్మెల్యేకు మరింత ప్రతికూలంగా మారాయి.
యాదాద్రిలో ఏదోఒక స్థానంలో మార్పు!
యాదాద్రి జిల్లాలోని రెండు సెగ్మెంట్లలో ఏదోఒక స్థానంలో మార్పు తప్పదని తెలుస్తోంది. ఈ జిల్లాలో బీసీలకు కచ్చితంగా అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. యాదవులు, గౌడ్స్ బలంగా ఉన్న ఈ జిల్లాలో ఎంపీ లేదంటే ఎమ్మెల్యే సీటు కేటాయించక తప్పదు. ఇదే ఈక్వేషన్‌తో గత రెండు ఎన్నికల్లో ఎంపీ సీటు గౌడ సామాజికవర్గానికి ఇచ్చారు. అయితే గత ఎన్నికల్లో ఓడిపోయిన బూర నర్సయ్యగౌడ్ బీజేపీలో చేరడంతో ఇక్కడ ఆ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంది. ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నిక టైంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌ డ్ పైనే అందరి దృష్టి ఉంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చాన్స్ ఇస్తా రని అంటున్నారు. ఎమ్మెల్సీ అవకాశం రాకుంటే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో ఏదో ఒకటి కచ్చితంగా ఇస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఖాళీ అయిన ఎమ్మెల్సీ కోటా ప్రకారం చూస్తే మాజీ మంత్రి మోత్కుప ల్లి నర్సింహులుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మోత్కుపల్లి కి ఎమ్మెల్సీ ఇస్తే, భిక్షమయ్యగౌడ్‌ను వచ్చే ఎన్నికల్లో ఏదోఒక సీట్లో భర్తీ చేస్తారని, దాంతో రెండు సామాజిక వర్గాల నుంచి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందొచ్చని ప్రగతి భవన్పెద్దలు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.