ఉద్యమకారులకు,కేసీఆర్​కు మధ్య వారధిలా పనిచేస్తా : కల్వకుంట్ల కవిత

ఉద్యమకారులకు,కేసీఆర్​కు మధ్య వారధిలా పనిచేస్తా : కల్వకుంట్ల కవిత
  • భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్​దే గెలుపు
  • ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత

భద్రాచలం, వెలుగు: తెలంగాణ ఉద్యమకారులకు, కేసీఆర్​కు మధ్య తాను వారధిలా పనిచేస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే కచ్చితంగా బీఆర్ఎస్​ గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. భద్రాద్రి జిల్లాలోని భద్రాచలంలో సోమవారం జరిగిన ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొని మాట్లాడారు. ‘‘ఉద్యమకారులను, కార్యకర్తలను కాపాడుకోవడం నా బాధ్యత. మీకు, కేసీఆర్​కు మధ్య ఇకపై నేను వారధిగా ఉంటా. ఏ చిన్న అవసరం వచ్చినా నన్ను సంప్రదించాలి’’ అని కవిత భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్​ నుంచి గెలిచి కాంగ్రెస్​లో చేరిన తెల్లం వెంకట్రావు ద్రోహి అని విమర్శించారు. ఇలాంటి ద్రోహులను, వారి కుట్రలను ఎన్నో చూశామని పేర్కొన్నారు. 

తెలంగాణకు బీఆర్ఎస్సే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులున్నా మూడు పైసల లాభం లేదని అన్నారు. అప్పులపై అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విపరీతమైన అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. రూ.1.60 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఎక్కడ ఖర్చు పెట్టారని అడిగితే కాంగ్రెస్​ సర్కారు వద్ద సమాధానం లేదన్నారు. రూ.40 వేల కోట్ల విలువ చేసే హెచ్​సీయూ భూములను కుదువపెట్టి రూ.10 వేల కోట్లు తెచ్చారని, వాటితో రైతు భరోసా, రుణమాఫీ చేశామని మంత్రులు చెప్తున్నారని, నిజానికి సగం మంది రైతులకు భరోసా సాయం అందలేదని అన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చి 16 నెలలైనా ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని చెప్పారు. కేసీఆర్​.. సీతారామ ప్రాజెక్టు కట్టి జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకు సాగునీరును అందించారని తెలిపారు. అంతకుముందు కవిత రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారామ చంద్రస్వామి నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం అందజేశారు.

ఆత్మీయ సమ్మేళనంలో గందరగోళం

కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో గందరగోళం ఏర్పడింది. భద్రాచలానికి చెందిన ఉద్యమకారుడు నూకపేయి రాజేంద్రవర్ధన్​ మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో కేసీఆర్, కవిత భద్రాచలం వచ్చినప్పుడు తన ఇంట్లోనే బస చేశారని.. కానీ ఇప్పుడు పార్టీ లీడర్లు తమను పట్టించుకోవడంలేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావును ఉద్దేశించి వ్యాఖ్యా నించారు. ఉద్యమంలో పనిచేసినందుకు తనపై రౌడీషీట్ ఓపెన్​ చేశారని, ఎన్నో పోగొట్టుకున్నామని తెలిపారు. 

ఇతర పార్టీలనుంచి వచ్చిన వారిని అందలమెక్కిస్తూ తనలాంటివారిని తొక్కేస్తున్నారని అన్నారు. అంతకు ముందు మాట్లాడిన దిండిగల రాజేందర్ తో సహా పలువురు ఉద్యమకారులు కూడా పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తమకు అన్యాయం జరిగిందని వాపోయారు. ఉద్యమకారులకు ఇంటిస్థలం, ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు, రూ.25 వేలు పింఛన్​ ఇస్తామంటూ హామీ ఇచ్చి కాంగ్రెస్​ కూడా మోసం చేసిందని ఆరోపించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు.