మునుగోడులో బీఎస్పీని ప్రజలు ఆదరిస్తుండ్రు: ఆర్ఎస్ ప్రవీణ్

నల్గొండ: మునుగోడులో బీఎస్పీని ప్రజలు ఆదరిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం మునుగోడు మండలంలో ఆయన బీఎస్పీ అభ్యర్థి శంకారాచారితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా V6 తో ఆయన మాట్లాడారు. మునుగోడులో ఓట్లు రాబట్టేందుకు ప్రధాన పార్టీల నేతలు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. విచ్చలవిడిగా డబ్బు, మద్యం, ఇతర వస్తువులు పంపిణీ చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసం తాము ఒక్క రూపాయి కూడా పంచబోమని, అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని చెప్పారు. డబ్బు, మద్యం పంపిణీలో తాము వెనుకబడ్డా.. ప్రజల మద్దతు కూడగట్టడంలో మాత్రం ముందున్నామని ఆర్ఎస్ ప్రవీణ్ తెలిపారు. 

మునుగోడులో ప్రధాన పార్టీలన్నీ అగ్రవర్ణాలకే టికెట్లు ఇచ్చాయన్నారు. ఒక్క బీఎస్పీ మాత్రమే బీసీకి చెందిన శంకరాచారికి టికెట్ ఇచ్చిందని పేర్కొన్నారు. సమాజంలో 70 శాతం ఉన్న బీసీలను రాజకీయా పార్టీలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఓట్ల కోసమే తాను వృద్ధులను ఏసీ కారులో తిప్పాననడంలో అర్థంలేదని... బీఎస్పీకి రాజ్యాధికారం వస్తే ఎలా ఉంటదో జస్ట్ శాంపిల్ చూపించానని స్పష్టం చేశారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా మునుగోడులో గెలిచేది బీఎస్పీ మాత్రమేనని ఆర్ఎస్ ప్రవీణ్ ధీమా వ్యక్తం చేశారు.