పద్దు ప్రతిపాదనలు సరిగ్గాలేవ్ .. మార్పులు, చేర్పులు చెయ్యాలి

పద్దు ప్రతిపాదనలు సరిగ్గాలేవ్ .. మార్పులు, చేర్పులు చెయ్యాలి
  • అధికారులకు స్టాండింగ్ కమిటీ సూచన
  • వాస్తవాలకు దూరంగా గణాంకాలు
  • బడ్జెట్​ ఆమోదం వాయిదా
  • డిసెంబర్ 9 తర్వాత మరోసారి స్టాండింగ్ కమిటీ సమావేశం

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ హెడ్ ​ఆఫీస్​లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ఆమోదం కోసం శనివారం ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీ సమావేశం వాయిదా పడింది. రూ.8,340 కోట్లతో రెడీ చేసిన ముసాయిదా బడ్జెట్​లో మార్పులు, చేర్పులు చెయ్యాలని బీఆర్ఎస్, ఎంఐఎం కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. బడ్జెట్​లో పొందుపర్చిన పలు అంశాలపై అభ్యంతరం చెప్పారు. 

 ప్రతిపాదనలను అధికారులు సకాలంలో అందించకపోవడం మూలంగా స్టడీ చేయలేకపోయామన్నారు. రెవెన్యూ ఆదాయం చూపించలేదని,  ప్రాపర్టీ ట్యాక్స్, టౌన్ ప్లానింగ్ విషయంలో రెవెన్యూ పెంచాలని సూచించారు. ఈ రెండింటి నుంచి బల్దియాకు ఎక్కువ ఆదాయం వస్తుందని, అయినప్పటికీ గడిచిన రెండేండ్లతో పోలిస్తే ఈసారి ఆదాయం తక్కువగా చూపడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 

గ్రీనరీ కోసం రూ.412 కోట్లా?

గ్రీనరీ కోసం బడ్జెట్​లో రూ.412 కోట్లు కేటాయించి, ఎక్కడ ఖర్చు చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. స్ట్రోమ్ వాటర్ డ్రెయిన్ , నాలాల కోసం రూ.200 కోట్లు పెట్టడమేంటని, గ్రీనరీలోంచి  సగం నిధులను వాటికి కేటాయించి ఉంటే ప్రజలకు ఎంతో ఉపయోగపడేదని సూచించారు.  ఇంకుడు గుంతల కోసం రూ.74 కోట్లు పెట్టడంపై ప్రశ్నించారు. అసలు ఇంకుడు గుంతలు ఎక్కడ నిర్మిస్తున్నారన్నారు. 

లేక్స్ డెవలప్ కోసం రూ.150 కోట్లు పెట్టడమేంటని, అసలు ఎక్కడ పనులు చేస్తున్నారని నిలదీశారు. బడ్జెట్​లో ఫుట్ పాత్​లు, గ్రేవ్ యార్డ్స్ కోసం నిధులను అసలు పెట్టలేదన్నారు. ఇలా బడ్జెట్ అసంపూర్తిగా కాకుండా పూర్తి వివరాలతో అన్ని పనుల కోసం నిధులు కేటాయించాలని సూచించారు. వాస్తవాలకు దూరంగా బడ్జెట్ గణాంకాలు ఉన్నాయని  విమర్శించారు. 

దీంతో సభ్యుల సూచనలు పరిగణలోకి తీసుకొని బడ్జెట్ ప్రతిపాదనలో మార్పులు చేసి తిరిగి సమావేశం ఏర్పాటు చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశించారు.  వృథా ఖర్చులను తగ్గించి ఆదాయం పెంచేలా చూడాలన్నారు. సమావేశాన్ని తిరిగి డిసెంబర్ 9 తర్వాత నిర్వహించడం జరుగుతుందన్నారు. కమిషనర్ ఇలంబరితి, స్టాండింగ్ క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిటీ స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌భ్యులు పాల్గొన్నారు.