బార్బడోస్: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. లీగ్ దశ వరుస విజయాలను సూపర్–8లోనూ కంటిన్యూ చేస్తోంది. బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ (28 బాల్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53), హార్దిక్ పాండ్యా (24 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) మెరుపులు మెరిపించగా, బౌలింగ్‌లో బుమ్రా (3/7), అర్ష్‌దీప్ (3/36) చెలరేగడంతో.. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా 47 రన్స్ తేడాతో అఫ్గానిస్తాన్‌కు చెక్ పెట్టింది. టాస్ నెగ్గిన ఇండియా 20 ఓవర్లలో 181/8 స్కోరు చేసింది. తర్వాత అఫ్గాన్ 20 ఓవర్లలో 134 రన్స్‌కే ఆలౌటైంది. అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (26) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. సూర్యకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
నిలబెట్టిన సూర్య, హార్దిక్..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇండియాను కట్టడి చేయడంలో అఫ్గాన్ బౌలర్లు రషీద్ ఖాన్ (3/26), ఫారూఖీ (3/33) సక్సెస్ అయ్యారు. ఈ ఇద్దరు టాప్ ఆర్డర్‌ను దెబ్బతీసినా, సూర్యకుమార్, హార్దిక్ కీలక భాగస్వామ్యంతో టీమిండియా మంచి టార్గెట్‌నే నిర్దేశించింది. ఫోర్‌తో ఖాతా తెరిచిన రోహిత్ (8)ను మూడో ఓవర్‌లోనే ఫారూఖీ ఔట్ చేయగా, కోహ్లీ (24), రిషబ్ పంత్ (20) కాసేపు నిలబడ్డారు. ఐదో ఓవర్‌లో కోహ్లీ సిక్స్‌తో టచ్‌లోకి వస్తే, బౌండ్రీతో ఆట మొదలుపెట్టిన పంత్ ఆరో ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్స్ బాదాడు. దీంతో పవర్‌ప్లేలో ఇండియా 47/1 స్కోరు చేసింది. ఈ టైమ్‌లో బౌలింగ్‌కు వచ్చిన రషీద్ డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. తన వరుస ఓవర్ల (7, 9)లో పంత్, కోహ్లీని పెవిలియన్‌కు పంపి ఊహించని షాకిచ్చాడు. ఫలితంగా రెండో వికెట్‌కు 43 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగియడంతో ఇండియా 67/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో సూర్య ఫోర్‌తో, శివమ్ దూబే (10) సిక్స్‌తో బ్యాట్లు ఝుళిపించడంతో ఫస్ట్ టెన్‌లో 79/3 స్కోరుకు చేరింది. కానీ11వ ఓవర్‌లో రషీద్ మళ్లీ ఝలక్ ఇచ్చాడు. ఈ ఓవర్‌లో సూర్య 4, 6 బాదితే ఐదో బాల్‌కు దూబే వికెట్ పడగొట్టాడు. నాలుగో వికెట్‌కు 28 రన్స్ జతయ్యాయి. 90/4 వద్ద వచ్చిన హార్దిక్ నిలకడగా ఆడి సూర్యకు అండగా నిలిచాడు. 13వ ఓవర్ నుంచి ఈ ఇద్దరు క్రమం తప్పకుండా ఫోర్లు, సిక్స్‌లు కొట్టి ఇన్నింగ్స్‌లో ఊపు తెచ్చారు. ఈ క్రమంలో 27 బాల్స్‌లో ఫిఫ్టీ కొట్టిన సూర్య అదే జోరులో ఫారూఖీ వేసిన 17వ ఓవర్‌లో భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. దీంతో ఐదో వికెట్‌కు 60 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. తర్వాతి ఓవర్‌లో సిక్స్ కొట్టి హార్దిక్ కూడా వెనుదిరిగాడు. 19వ ఓవర్‌లో ఫోర్ కొట్టి జడేజా (7) వికెట్ ఇచ్చుకోగా, లాస్ట్ ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టి అక్షర్ పటేల్ (12) రనౌటయ్యాడు. నవీన్ ఒక వికెట్ తీశాడు.
బుమ్రా, అర్ష్‌దీప్ అదుర్స్
ఛేజింగ్‌లో అఫ్గానిస్తాన్‌ను ఇండియా బౌలర్లు సమష్టిగా కట్టడి చేశారు. బుమ్రా అదిరిపోయే ఆరంభాన్నిస్తే.. అర్ష్‌దీప్ సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడు. బుమ్రా 2, 5వ ఓవర్లలో వరుసగా రెహమానుల్లా గుర్బాజ్ (11), హజ్రతుల్లా జజాయ్ (2)ను పెవిలియన్‌కు పంపాడు. పేస్ వేరియేషన్‌తో పాటు లెంగ్త్‌ను మార్చి ఈ ఇద్దర్ని బోల్తా కొట్టించాడు. మధ్యలో నాలుగో ఓవర్‌లో అక్షర్ పటేల్ (1/15).. ఇబ్రహీం జద్రాన్ (8)ను ఔట్ చేశాడు. లెగ్ సైడ్ బాల్‌కు భారీ షాట్ కొట్టబోయి జద్రాన్ ఎక్స్‌ట్రా కవర్స్‌లో రోహిత్‌కు చిక్కాడు. దీంతో అఫ్గాన్ 23/3తో ఎదురీత మొదలుపెట్టింది. గుల్బాదిన్ నైబ్ (17), అజ్మతుల్లా ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. 35/3తో పవర్‌ప్లేను ముగించిన ఈ ఇద్దరు సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేశారు. మధ్యలో ఫోర్, సిక్స్ బాదినా ఇండియా బౌలింగ్ ముందు సక్సెస్ కాలేకపోయారు. 10 ఓవర్లలో 66/3 స్కోరు చేసిన అఫ్గాన్‌కు కుల్దీప్ (2/32), జడేజా (1/20) ఝలక్ ఇచ్చారు. 11వ ఓవర్‌లో నైబ్‌ను ఔట్ చేయడంతో నాలుగో వికెట్‌కు 44 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. తర్వాతి ఓవర్‌లో జడ్డూ.. అజ్మతుల్లాను పెవిలియన్‌కు పంపాడు. ఈ దశలో నజీబుల్లా జద్రాన్ (19), మహ్మద్ నబీ (14) పోరాటం మొదలుపెట్టారు. 16వ ఓవర్‌లో నజీబుల్లాను ఔట్ చేసి బుమ్రా దెబ్బ కొట్టాడు. దీంతో ఆరో వికెట్‌కు 31 రన్స్ జతయ్యాయి. 17వ ఓవర్‌లో కుల్దీప్.. నబీని వెనక్కి పంపాడు. 18వ ఓవర్‌లో అర్ష్‌దీప్ వరుస బాల్స్‌లో రషీద్ ఖాన్ (2), నవీన్ ఉల్ హక్ (0) వికెట్లు తీశాడు. దీంతో లక్ష్యం పెద్దదిగా ఉండటంతో నూర్ అహ్మద్ (12), ఫారూఖీ (4 నాటౌట్) ఛేదించలేకపోయారు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 20 ఓవర్లలో 181/3 (సూర్య 53, పాండ్యా 32, రషీద్ 3/26, ఫారూఖీ 3/33). అఫ్గానిస్తాన్: 20 ఓవర్లలో 134 ఆలౌట్ (అజ్మతుల్లా 26, బుమ్రా 3/7, అర్ష్‌దీప్ 3/36).