
- ఇద్దరు అరెస్ట్
బూర్గంపహాడ్, వెలుగు : ఏపీ నుంచి తెలంగాణకు తరలిస్తున్న గంజాయిని బూర్గంపహాడ్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కేసు వివరాలను బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ లో పాల్వంచ డీఎస్పీ సతీశ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. శనివారం బూర్గంపహాడ్ ఎస్సై రాజేశ్ సిబ్బందితో కలిసి సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద వాహన తనిఖీలు చేస్తున్నారు. ఓ కారును చెక్ చేయగా రూ.60 లక్షల విలువైన 121 కిలోల గంజాయి పట్టుబడింది.
కారులోని సారపాకకు చెందిన వాంకుడోత్ సాయికుమార్, ఏపీలోని వైఎస్సార్ జిల్లా కూనవరం మండలంలోని పొలిపాక గ్రామానికి చెందిన వంశీని అదుపులోకి తీసుకొని విచారించగా, పాత గంజాయి కేసులో ఉన్న ఎస్ కే మున్వర్, రమేశ్, కత్వాల సురేశ్, జగదీశ్, స్వరూప్, వాంకుడోత్ సురేశ్‌తో కలిసి వారు గంజాయి వ్యాపారం చేయాలని భావించినట్లు తేలింది. ఇందులో భాగంగా సాయికుమార్ బాబాయి వాంకుడోత్ సురేశ్‌తో తీసుకొని గంజాయిని ఇల్లెందు క్రాస్ రోడ్ వద్ద ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకొని తెస్తూ వీరిద్దరూ పట్టుబడ్డారు. సమావేశంలో పాల్వంచ సీఐ కే.సతీశ్‌కుమార్, సీసీఎస్ ఎస్ఐలు ప్రవీణ్ కుమార్, రామారావు, ట్రైనీ ఎస్ఐ డేవ్సంగ్, సిబ్బంది పాల్గొన్నారు.