ప్యూన్​ నుంచి కోటీశ్వరుడు..బల్వంత్​ రాయ్ కళ్యాణ్‌‌జీ పరేఖ్

ప్యూన్​ నుంచి కోటీశ్వరుడు..బల్వంత్​ రాయ్ కళ్యాణ్‌‌జీ పరేఖ్

బల్వంత్​రాయ్ కళ్యాణ్‌‌జీ పరేఖ్ ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో కంపెనీలు పెట్టి సక్సెస్​ అయిన వాళ్లలో ఒకరు. స్వాతంత్ర్యం తర్వాత దేశ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి కష్టపడిన మొదటి తరం బిజినెస్​ మ్యాన్స్​ లిస్ట్​లో బల్వంత్​ పేరు ముందువరుసలో ఉంటుంది. ఆయన 1959లో స్థాపించిన కంపెనీ టర్నోవర్‌‌ ఇప్పుడు ఏటా బిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే ఈ పిడిలైట్ కంపెనీని ఏర్పాటుచేయడంలో, మార్కెట్​లో నెంబర్​వన్​గా నిలపడం వెనుక పరేఖ్ కష్టం ఎంతో ఉంది. 

లా చదివి.. 

గుజరాత్‌‌లోని భావ్‌‌నగర్ జిల్లాలోని మహువ అనే చిన్న పట్టణంలో బల్వంత్ పరేఖ్  పుట్టాడు. ఆయనకు చిన్నప్పటి నుంచే బిజినెస్​ మ్యాన్​ కావాలనే కోరిక ఉండేది. కానీ, అతని తల్లిదండ్రులు లా చదివించాలి అనుకున్నారు. తమ కొడుకుని పెద్ద లాయర్​ని చేయాలని కలలు కన్నారు. వాళ్ల ఒత్తిడి వల్లే  బల్వంత్ పరేఖ్ ముంబైలోని గవర్నమెంట్​ లా కాలేజీలో చేరాడు. 

క్విట్ ఇండియా ఉద్యమంలో..

బల్వంత్ పరేఖ్ లా చదువుతున్నప్పుడే దేశంలో క్విట్​ ఇండియా ఉద్యమం నడుస్తోంది. దేశం మొత్తం మహాత్మాగాంధీని ఫాలో అవుతున్న టైం అది. ముఖ్యంగా యంగ్ జనరేషన్​ నుంచి చాలామంది క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. దాంతో బల్వంత్ పరేఖ్ కూడా తన చదువును మధ్యలోనే వదిలేసి, ఉద్యమంలో చేరాడు. తర్వాత గుజరాత్‌‌ వెళ్లి సొంతూరిలో స్వాతంత్ర్యం కోసం పోరాడాడు. ఆ తర్వాత మళ్లీ ముంబైకి తిరిగి వెళ్ళి లా చదువు పూర్తి చేశాడు. 

ప్యూన్‌‌గా మొదలై.. 

బల్వంత్ పరేఖ్ లా చదివినా.. ఆ వృత్తిలో కొనసాగడానికి ఇష్టపడలేదు. కానీ.. తండ్రి మీద గౌరవంతో బార్ కౌన్సిల్ పరీక్షలు రాసి, పాస్​ అయ్యాడు. కానీ.. తన వృత్తిలో కొన్నిసార్లు అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది. కానీ.. అది అతనికి ఇష్టంలేదు. ఇక చేసేది ఏమీ లేక లా ప్రాక్టీస్​ మానేశాడు. తను చిన్నప్పటినుంచి కంటున్న బిజినెస్​ మ్యాన్​ అవ్వాలనే కల నెరవేర్చుకోవడానికి ముంబై బెస్ట్​ ప్లేస్​ అనుకున్నాడు. కానీ.. అప్పటివరకు అతనికి వ్యాపార అనుభవం లేదు. ఫ్యామిలీ సపోర్ట్​ అంతకన్నా లేదు. అయినా.. తన కలను సాకారం చేసుకోవాలనే బలమైన కోరికతో ముందడుగు వేశాడు. కానీ.. అప్పుడే బల్వంత్‌‌కు కాంతాబెన్‌‌తో పెండ్లి జరిగింది. దాంతో ఆర్థిక భారం పెరిగింది. 

అందువల్ల కొన్ని రోజులు బిజినెస్​ ఆలోచన పక్కన పెట్టి, ముంబైలో డైయింగ్, ప్రింటింగ్ ప్రెస్‌‌లో పనిచేశాడు. తర్వాత కలప వ్యాపారి ఆఫీస్​లో ప్యూన్‌‌గా చేరాడు. ఎవరి నుంచి సపోర్ట్​ లేదు. సొంతంగా లైఫ్​​ లీడ్​ చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఉండడానికి ఇల్లు కూడా లేదు. అందుకే భార్యతో కలసి తన ఫ్రెండ్​ గోదాంలో ఉన్నాడు. ప్యూన్​గా పనిచేస్తున్నా తన లక్ష్యాన్ని మర్చిపోలేదు. అందుకు కావాల్సిన అవకాశాల కోసం ఎదురు చూశాడు. తను పనిచేస్తున్న కంపెనీలో పరిచయాలు పెంచుకున్నాడు. ఆ పరిచయాల ద్వారా బల్వంత్ జర్మనీకి వెళ్ళే అవకాశం దక్కించుకున్నాడు. అక్కడికెళ్లి వ్యాపార చిట్కాలు, ఉపాయాలు నేర్చుకున్నాడు. 

ఫెవికాల్ స్థాపన

జర్మనీకి చెందిన హోక్​స్ట్‌‌ కంపెనీకి ఇండియాలో రీప్రెజెంట్​​గా ఉన్న ఒక సంస్థలో పనికిచేరాడు పరేఖ్‌‌. అక్కడ పనిచేస్తున్నప్పుడే 1954లో అప్పటివరకు కూడబెట్టుకున్న డబ్బుతో ముంబైలోని జాకబ్ సర్కిల్‌‌లో డైకెమ్ ఇండస్ట్రీస్‌‌ పేరుతో డై, కెమికల్ యూనిట్‌‌ పెట్టాడు. అందులో బల్వంత్ పరేఖ్ తన సోదరుడు సుశీల్ పరేఖ్‌‌తో కలిసి టెక్స్‌‌టైల్ ప్రింటింగ్ కోసం వాడే పిగ్మెంట్ ఎమల్షన్లను తయారు చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అందులో వచ్చిన లాభాలతో 1959లో పిడిలైట్ కంపెనీ పెట్టాడు. ఇందులో మొదట్లో ఇండస్ట్రియల్​ కెమికల్స్​ తయారుచేసేవాళ్లు. కానీ.. వాటిని బ్రాండ్​ నేమ్​ లేకుండానే అమ్మేవాళ్లు. అదే టైంలో బల్వంత్​ ఒక విషయం గమనించాడు. 

అదేంటంటే.. అప్పటివరకు ఇండియాలో జంతువుల కొవ్వుతో తయారైన గ్లూని తయారు చేసే కంపెనీలు మార్కెట్‌‌లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకున్న పరేఖ్​ సింథటిక్ రెసిన్‌‌తో తెల్లటి గ్లూ ‘ఫెవికాల్’ తయారు చేశాడు. అప్పట్లో జర్మనీలో ‘‘మోవికాల్” పేరుతో ఒక గ్లూ తయారయ్యేది. దాని పేరుని ఇన్​స్పిరేషన్​గా తీసుకుని దీనికి ఫెవికాల్ అని పేరు పెట్టాడు. ఇది మార్కెట్​లోకి వచ్చిన కొన్నేండ్లలో బాగా సక్సెస్​ అయ్యింది. ‘ఫెవికాల్’ గ్లూకి పర్యాయపదంగా మారిపోయింది. చాలామంది ఫెవికాల్​ అంటే అర్థం అతుక్కునేది అనుకున్నారు. ముఖ్యంగా ఇండియాలోని కార్పెంటర్లు దీన్ని ఎక్కువగా వాడారు. మొదట్లో ఒక చిన్న దుకాణంలో ఫెవికాల్​ ప్రొడక్షన్ చేసేవాళ్లు. కానీ.. కొన్ని రోజులకు పెద్ద కంపెనీగా ఎదిగింది.

ఫెవిక్విక్ 

ఫెవికాల్​ ఇచ్చిన సక్సెస్​తో పరేఖ్​ సంతోషంగానే ఉన్నాడు. కానీ.. ఒకే ప్రొడక్ట్​ మీద ఆధారపడడం మంచిదికాదు అనుకున్నాడు. గ్లూ బిజినెస్​లో నెంబర్​వన్​గా ఎదుగుతూనే పిడిలైట్ ఇండస్ట్రీస్ నుంచి మరి కొన్ని రకాల గ్లూ ప్రొడక్ట్స్​ని మార్కెట్​లోకి తీసుకొచ్చాడు. తర్వాత ఇదే కంపెనీ నుంచి మనం రెగ్యులర్​గా వాడుతున్న ఫెవిక్విక్, ఎం-సీల్‌‌ లాంటివి కూడా వచ్చాయి. ఈ రెండు బాగా సక్సెస్​ అయ్యాయి. ఒక్కొక్కటి 70 శాతం మార్కెట్ షేర్‌‌ ఆక్రమించాయి. ఇవి మార్కెట్​లోకి వచ్చాక, పిడిలైట్​ దేశంలో నెంబర్​వన్​ గ్లూ బ్రాండ్​గా మారింది. 

పిడిలైట్ విస్తరణ

ఫెవికాల్​ ఇచ్చిన సక్సెస్​తో 1989లో కంపెనీ ఫెవిక్రిల్ యాక్రిలిక్ కలర్స్ ట్రాన్స్‌‌ఫార్మ్ ఫ్యాబ్రిక్ అండ్​ మల్టీ- సర్ఫేస్ పెయింటింగ్ మార్కెట్‌‌లోకి అడుగుపెట్టింది. ఎఫ్​ఈ బ్రాండ్‌‌వాగన్ ఇయర్ బుక్–1997 ప్రకారం దేశంలోని టాప్​ 15 ఇండియన్​ బ్రాండ్స్​లో పిడిలైట్​ ఒకటిగా నిలిచింది. అంతేకాదు ఇప్పుడు ఫెవికాల్‌‌, ఎం-సీల్, ఫెవిక్విక్​తో పాటు పిడిలైట్​ కంపెనీ ఫెవిస్టిక్, డాక్టర్ ఫిక్సిట్​ లాంటి దాదాపు రెండు వందల ప్రొడక్ట్స్​ని తయారు చేస్తోంది. దేశవిదేశాల్లో కంపెనీ ప్రొడక్ట్స్​ అమ్ముతోంది. 2006 నుండి పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యునైటెడ్ స్టేట్స్, థాయ్‌‌లాండ్, దుబాయ్, ఈజిప్ట్, బంగ్లాదేశ్‌‌ల్లో ఫ్యాక్టరీలను స్థాపించింది. సింగపూర్‌‌లో పరిశోధనా కేంద్రం కూడా పెట్టింది. 

బిజినెస్​ స్ట్రాటజీలు 

బల్వంత్​, ఆయన తర్వాత కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌‌గా బాధ్యతలు తీసుకున్న అతని కొడుకు మధుకర్ బిజినెస్​ను పెంచుకోవడానికి రకరకాల ఎత్తులు వేశారు. దాదాపు అన్ని రకాల గ్లూస్​ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కొన్ని రకాల గ్లూ కంపెనీలను కొని పిడిలైట్​లో కలిపేశారు. మార్కెటింగ్​ కోసం అనేక కొత్త పద్ధతులు పాటించారు. ఇండియాలో ఫెవికాల్​ సేల్స్​ని నిర్ణయించేది కార్పెంటర్లే. దాదాపు 80 శాతం ఫెవికాల్​ మార్కెట్​ వాళ్ల చేతుల్లోనే ఉంది. అందుకే బల్వంత్​ డైరెక్ట్​ మార్కెటింగ్​ పద్ధతిని ఎంచుకున్నాడు. కంపెనీ సేల్స్​ మెన్స్ కార్పెంటర్ల దగ్గరికి వెళ్లి, ఫెవికాల్​ ఉపయోగాలు, క్వాలిటీ గురించి ఎక్స్​ప్లేన్​ చేసేవాళ్లు. దాంతో సేల్స్​ బాగా పెరిగాయి. 

డిఫరెంట్​ యాడ్స్​ 

ఫెవికాల్ మార్కెటింగ్​ కోసం చాలా క్రియేటివ్​గా ఉండే యాడ్స్​ని డిజైన్​ చేయించారు. 1970ల్లో మొదటిసారి దూరదర్శన్‌‌లో కొన్ని ఫెవికాల్​ యాడ్స్​ వేశారు. తర్వాత ​ 90వ దశకంలో టీవీ స్క్రీన్‌‌పై కనిపించిన యాడ్స్​ చాలా ఫన్నీగా గుర్తుండిపోయేలా ఉండేవి. యాడ్స్​లోని ‘‘యే ఫెవికాల్ కా మజ్బూత్​ జోడ్ హై టూటేగా నహీ” లాంటి డైలాగ్స్​ చాలా ఫేమస్​ అయ్యాయి. ఈ మధ్య వచ్చిన యాడ్స్​ కూడా కస్టమర్లను అక3ట్రాక్ట్​ చేసేవిధంగానే ఉంటున్నాయి. 

సర్వీస్​ 

బల్వంత్ పరేఖ్ డబ్బు సంపాదించడంతోపాటు అందులోని కొంత డబ్బుని సేవ చేయడానికి ఖర్చు చేసి మంచి పేరుని కూడా సంపాదించాడు. గుజరాత్‌‌లోని మహువాలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ పెట్టడానికి బల్వంత్ చాలా సాయం చేశాడు. భావ్‌‌నగర్​లోని సైన్స్ సిటీ ప్రాజెక్ట్ కోసం లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చాడు. గుజరాతీ సాహిత్య పరిషత్‌‌కు కూడా విరాళాలు ఇచ్చాడు. 2009లో బరోడాలో బల్వంత్ పరేఖ్ సెంటర్ ఫర్ జనరల్ సెమాంటిక్స్ అండ్ అదర్ హ్యూమన్ సైన్సెస్‌‌ని స్థాపించాడు.

ఆత్మవిశ్వాసం లేనివాళ్లు ఫెయిల్యూర్స్​కి తమ దురదృష్టమే కారణమని బాధపడుతుంటారు. కానీ.. ఆయన మాత్రం ఆ ఫెయిల్యూర్స్​కి కారణాలు తెలుసుకుని, వాటిని అధిగమించి సక్సెస్​ అయ్యాడు. ప్యూన్​ స్థాయి నుంచి ఆసియాలోనే అతిపెద్ద గ్లూ కంపెనీకి అధిపతి అయ్యాడు. నెల జీతం కోసం ఎదురు చూసే పరిస్థితి నుంచి వేల కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు ఇండియన్​ ఫెవికాల్ మ్యాన్​ బల్వంత్​ పరేఖ్​.