- రద్దు చేస్తూ సర్కార్ జీవో జారీ చేయాలని డిమాండ్
- కార్యాచరణకు సిద్ధమవుతున్న రైతులు
- 8 గ్రామాల్లో మీటింగ్ ల నిర్వహణకు ప్రతినిధుల చర్చ
కామారెడ్డి/సదాశివనగర్, వెలుగు: కామారెడ్డి మాస్టర్ప్లాన్రద్దు పోరాటానికి రైతులు మళ్లీ రెడీ అవుతున్నారు. ప్రభుత్వం నోటి మాటలుగా కాకుండా అధికారిక జీవో జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు 8 గ్రామాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అనంతరం తమ భవిష్యత్కార్యాచరణ ప్రకటించనున్నట్లు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆదివారం సదాశివనగర్మండలం అడ్లూర్ఎల్లారెడ్డిలో ఆయా గ్రామాల రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు, రైతులు సమావేశం అయ్యారు.
2022లో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా.. టౌన్‌కు అనుకొని ఉన్న 8 గ్రామాల పరిధిలోని వ్యవసాయ భూములను ఇండస్ర్టీయల్జోన్, గ్రీన్‌జోన్‌గా గుర్తించడంపై అప్పట్లో రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆందోళనలు కూడా జరిగాయి. అడ్లూర్ఎల్లారెడ్డి, అడ్లూర్, టెకిర్యాల్, దేవునిపల్లి, లింగాపూర్, పాతరాజంపేట, సరంపల్లి, ఇల్చిపూర్ గ్రామాల రైతులు ఐక్యకార్యాచరణ సమితిగా ఏర్పడి పెద్ద పోరాటమే చేశారు. ఇక్కడ చేపట్టిన ఉద్యమం అప్పట్లో రాష్ర్టవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల ముందు ప్రతిపాదిత మాస్టర్‌ప్లాన్ రద్దు చేస్తున్నట్లు మున్సిపాలిటీలోనూ తీర్మానం చేసినట్లు అధికారులు ప్రకటించారు.
గత ప్రభుత్వ హయాంలో..
గత సర్కార్ హయాంలో రైతులు ఉద్యమం చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. రైతుల భారీ ఆందోళనతో అప్పటి ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గింది. మున్సిపల్ ప్రత్యేక సమావేశం నిర్వహించి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల టైమ్ లో ఇక్కడ మాస్టర్ ప్లాన్ చర్చనీయాంశమైంది.
ప్రస్తుత ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నట్లు జీవో జారీ చేయాలని రైతులు కోరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పట్టించుకోవట్లేదని పేర్కొంటున్నారు. అసెంబ్లీ సమావేశా ల్లోనూ ఎమ్మెల్యేలు ప్రస్తావించలేదంటున్నారు. దీంతో మళ్లీ ఆందోళనకు దిగుతామని రైతులు చెబుతున్నారు.
అధికారిక జీవో ఇవ్వాలంటూ డిమాండ్
మాస్టర్‌ప్లాన్‌ను రద్దు చేస్తున్నట్లు వెంటనే ప్రభుత్వం అధికారికంగా జీవో ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఇందులో భాగంగా రోజురో గ్రామంలో సమావేశాలు నిర్వహించాలని ఇటీవల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు నిర్ణయించారు. ఇందులో భాగంగా అడ్లూర్ఎల్లారెడ్డిలో మాస్టర్ ప్లాన్అంశంపై సమావేశమై చర్చించారు. ఫస్ట్ గ్రామాల వారీగా రైతులతో మీటింగ్‌లు నిర్వహించాలని నిర్ణయించారు.
ఆ తర్వాత కామారెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారును కలిసి వినతిపత్రాలు అందజేసేందుకు చర్చించారు. పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తామన్నారు. అప్పటికీ కూడా స్పందన రాకపోతే అన్ని గ్రామాల రైతులతో సమావేశమై భవిష్యత్కార్యాచరణ ప్రకటిస్తామని ప్రతినిధులు తెలిపారు. గతంలో రైతులకు ఇచ్చిన హామీని నేరవేర్చాలని కోరారు. సోమవారం టెకిర్యాల్లో సమావేశం కానున్నట్లు పేర్కొన్నారు.