తీగల వంతెన పనులు స్పీడప్!.. 16 పిల్లర్లలో ఇప్పటికే 15 నిర్మాణం పూర్తి

తీగల వంతెన పనులు స్పీడప్!.. 16 పిల్లర్లలో ఇప్పటికే 15 నిర్మాణం పూర్తి
  • ఈనెల 25 నుంచి పిల్లర్లపై స్లాబ్​ సెగ్మెంట్స్ బిగింపు
  • ప్రీకాస్ట్ రూపంలో సిద్ధంగా ఉన్న స్లాబ్ సెగ్మెంట్స్
  • ఈ ఏడాది చివరి వరకు నిర్మాణం పూర్తి చేసే ప్లాన్​​
  • వర్షాకాలంలోపు పాత వంతెనకు రిపేర్లు పూర్తి

ఖమ్మం, వెలుగు:  ఖమ్మం నగరాన్ని ఆనుకొని మున్నేరు నదిపై తీగల వంతెన నిర్మాణ పనులు స్పీడందుకున్నాయి. గతేడాది మున్నేరుకు వచ్చిన భారీ వరదల కారణంగా పనులకు ఆటంకం కలిగినా, ఆ తర్వాత మళ్లీ కొనసాగుతున్నాయి. మొత్తం 16 పిల్లర్లకు గాను ఇప్పటికే 15 నిర్మాణం పూర్తికాగా, మరొక్కటి కూడా త్వరలోనే పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. పిల్లర్ల వర్క్​పూర్తయిన వెంటనే వాటిపై బిగించేందుకు అవసరమైన ప్రీకాస్ట్ స్లాబ్​ లను సిద్ధం చేస్తున్నారు.

ఖమ్మం రూరల్​ మండలంలోని గొల్లగూడెం ప్రాంతంలోని ప్లాంట్ లో ఇవి రెడీగా ఉండగా, ఈనెల 25 నుంచి వాటిని బ్రిడ్జి దగ్గరకు తరలించి పిల్లర్లపై బిగించనున్నట్టు ఆర్​ అండ్​ బీ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్​మెట్రో రైలు తరహాలోనే ఈ సెగ్మెంట్ల మధ్య తీగలను బిగించడం ద్వారా వాటిపై రోడ్డు రెడీ అవుతుంది. ఇలా ఈ బ్రిడ్జిలో మొత్తం 128 సెగ్మెంట్లను కలిపి 21 మీటర్ల వెడల్పులో ఫోర్​ లేన్​ రోడ్డును ఏర్పాటు చేయనున్నారు. మధ్యలో సెంట్రల్ డివైడర్, రెండు వైపులా ఫుట్ పాత్ కూడా ఉంటుంది. నిర్మాణం పూర్తయితే మున్నేరు నది మధ్యలో నాలుగు పిల్లర్ల మీద ఎత్తుగా హైదరాబాద్​ దుర్గం చెర్వు తీగల వంతెన లాగా డిజైన్​ ఉండనుంది. 

300 మీటర్ల తీగల వంతెన  

మున్నేరు మీద కాల్వొడ్డు నుంచి నాయుడుపేటకు వందేళ్ల కింద నిర్మించిన బ్రిడ్జిని ఆనుకొని కొత్తగా తీగల వంతెన నిర్మిస్తున్నారు. సూర్యాపేట నుంచి అశ్వారావుపేట వెళ్లే జాతీయ రహదారిపై కిలోమీటర్​ 57.150 నుంచి 58.400 కి.మీ.వరకు​ ఈ మొత్తం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. ఇందులో మున్నేరుపై తీగలతో నిర్మించే వంతెన 300 మీటర్లు ఉండనుంది. 390 మీటర్ల బాక్స్​ టైప్​ వయాడక్ట్ సూపర్ స్ట్రక్చర్​ నిర్మించనున్నారు. దీనితో పాటు మున్నేరుకు రెండు వైపులా అప్రోచ్​ రోడ్లను నిర్మిస్తారు. 

ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్​ మెంట్ అండ్​ కన్​ స్ట్రక్షన్​) పద్ధతిలో రూ.180 కోట్లతో దీని పనులు జరుగుతున్నాయి. బ్రిడ్జి, అప్రోచ్​ రోడ్ల కోసం భూసేకరణ చేయడంలో కొంత ఆలస్యం జరగడంతో పనులు డిలే అయ్యాయి. రోడ్డుకు పక్కన గుడిసెలు, రేకుల ఇండ్లు నిర్మించుకున్న వారిని ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీనిచ్చి అక్కడి నుంచి తరలించారు. అధికారులు చెబుతున్న ప్రకారం వచ్చే ఏడాది మార్చి వరకు బ్రిడ్జిని పూర్తి చేసేలా ఒప్పందం ఉన్నా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో ఈ ఏడాది చివరి నాటికే పనులు కంప్లీట్ చేసేలా ప్లాన్​ చేస్తున్నారు. 

పాత వంతెనకూ రిపేర్లు 

ప్రస్తుతం మున్నేరు పాత వంతెనకు మరోవైపు కాజ్ వేపై తాత్కాలిక రోడ్డును ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జూన్​ లో వర్షాలు వచ్చే సమయానికల్లా నదిలో పనులను పూర్తిగా చేయాలని భావిస్తున్నారు. పెద్ద స్థాయిలో వర్షాలు వస్తే ఇప్పటికే సిద్ధం చేసిన టెంపరరీ రోడ్డుపై రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది.. అందుకు అప్పటిలోగా పాత వంతెనకు కూడా మరమ్మతులు చేయనున్నారు.