బీజేపీని ప్రతిపక్షాలు అడ్డుకోగలవా?

మమతాబెనర్జీ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో హ్యాట్రిక్ విజయం సాధించిన తర్వాత దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన ప్రత్యామ్నాయంను ఏర్పాటు చేసే దిశగా మమతా బెనర్జీ, శరద్​​పవార్, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అడుగులు వేస్తుండటంతో రాజకీయాలు మరింత వేడిని పుట్టిస్తున్నాయి. మోడీ నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేండ్లు అవుతోంది. అయినప్పటికీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకోకపోవటంలోనూ.. వాటి పైన నిర్దిష్ట ప్రణాళికతో పోరాటం చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవడం వల్ల.. మోడీ కేంద్రంలో బలమైన ప్రభుత్వాన్ని నడప గలుగుతున్నారని అధికార ప్రాంతీయ పార్టీల నేతలు నిర్ధారణకు వచ్చినట్టున్నారు. అందుకే వారంతా కలిసి బలమైన ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేయాలనే కంకణం కట్టుకున్నట్టుఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికలే కీలకం కాబోతున్నాయా అన్నట్టుగా దేశం మొత్తం మీద వేడివేడిగా చర్చ సాగుతోంది. 2024 లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా దేశంలో రాజకీయాలు వేగంగా మారుతున్న సంకేతాలు కూడా కనపడుతున్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఐదు రాష్ట్రాల శాసనసభలకు జరిగే ఎన్నికలు దేశ రాజకీయాలను మార్చబోతున్నాయన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికలు కీలకం కాబోతున్నాయి. ఒక్క పంజాబ్‌‌లో తప్ప మిగతా నాలుగు రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది. తాను అధికారంలో ఉన్న ఈ నాలుగు రాష్ట్రాలతో పాటు బీజేపీ పంజాబ్‌‌లో కూడా మిత్ర పక్షాలతో కలిసి పాగా వేయగలిగితే 2024 లోక్ సభ ఎన్నికలలో  మరింత బలపడే అవకాశం ఉంది. మోడీ ఆధ్వర్యంలో ఎన్‌‌డిఏ ప్రభుత్వం రాజకీయంగా బలహీన పడకపోవడానికి.. కాంగ్రెస్ బలహీన నాయకత్వ ఎత్తుగడలు అని భావిస్తున్న యూపీఏ యితర పగ్గాలు మోడీని ఎదుర్కోటానికి ఒక బలమైన ఇంటిని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ లేకుండా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దానిని ఓడించటానికి ఇతర పక్షాలు బలమైన ప్రతిపక్ష  ఫ్రంట్‌‌ని ఏర్పాటు చేయగలవా అనే సందేహం వ్యక్తమవుతోంది. అత్యధిక లోకసభ స్థానాలు (80) గల ఉత్తరప్రదేశ్‌‌లో మళ్ళీ బీజేపీ అధికారంలోకి రాకపోతే అక్కడ ప్రతికూల ఫలితాలు ఎదురైతే రాజకీయంగా బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్ వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ జయంత్ సింగ్ నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీతో పాటు ఇతర చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని ఉత్తరప్రదేశ్ ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్న టైమ్​లో గెలుపు కోసం బీజేపీ చెమటోడ్చచక తప్పని పరిస్థితి ఏర్పడింది. రద్దు చేసిన రైతు సాగు చట్టాలతో అటు పంజాబ్‌‌లోనూ ఇటు ఉత్తరప్రదేశ్ లోను బీజేపీ విజయావకాశాలను దెబ్బ తీయబోతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. అందువల్ల ఉత్తరప్రదేశ్​లో విజయం సాధించడం బీజేపీకి కీలకంగా మారొచ్చు. 

బీజేపీకి ప్రత్యామ్నాయం ఎవరు?

ఇప్పటికైతే  ఒంటరిగా కానీ మిత్ర పక్షాలతో కలిసి గానీ దేశవ్యాప్తంగా బీజేపీని మరొకసారి అధికారంలోకి రాకుండా నిలువరించే శక్తి కాంగ్రెస్‌‌కి లేదనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ బీజేపీతో ముఖాముఖీ తలపడే మధ్యప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్, చత్తీస్ గఢ్‌‌, హర్యానా, కర్ణాటకలలో కాంగ్రెస్ పార్టీ గణనీయమైన ఫలితాలు సాధించి 1,008 పైగా లోక్ సభ స్థానాలు గెలిచే పక్షంలో కాంగ్రెస్, యూపీఏ భాగస్వామ్య పక్షాలతో బలమైన ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ మారే అవకాశం ఉంది. కాని పంజాబ్ లాంటి ఆర్థికంగా బలమైన రాష్ట్రంలో తన గెలుపు అవకాశాలను తానే విచ్ఛిన్నం చేసుకోవడంతోపాటు అంతర్గత సమస్యలు నాయకత్వలేమితో వరుసగా రెండుసార్లు అధికారంలో లేని కాంగ్రెస్ మోడీ రూపంలో బలమైన నాయకత్వం ఉన్న కేంద్రానికి ఎలా ప్రత్యామ్నాయం కాగలుగుతుంది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2014లో అధికారం కోల్పోయిన తరువాత తాను బలపడటానికి కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు, ప్రజా సమస్యలపై నిర్దిష్టంగా పోరాడిన దాఖలాలు దాదాపు లేవనే చెప్పాలి. రైతు సాగు చట్టాల రూపంలో అందివచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ ఉపయోగించుకోలేక పోయింది. ప్రణబ్ ముఖర్జీ మొగల్ గార్డెన్​కి వెళ్ళిన తర్వాత, అహ్మద్ పటేల్ మరణించిన తర్వాత సంక్షోభాల నుంచి గట్టెక్కే వ్యూహాలు లేక జి 23 నాయకుల ధిక్కార స్వరంతో కాంగ్రెస్ బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయంగా నిలబడలేక పోతుంది. 1977, 1989,  1997లో అధికారం కోల్పోయిన.. మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆశించేవారు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బలహీనంగా ఉన్న కాంగ్రెస్ బలమైన మోడీ నాయకత్వంలోని బీజేపీని ఏ విధంగా ఎదుర్కొని అధికారంలోకి ఎలా వస్తుందో గమనించాల్సిన విషయం. 

ప్రశాంత్ కిషోర్ పాత్ర ఏమిటి?

2024 లోక్​సభ ఎన్నికల నాటికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పోషించబోయే పాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2014 లోక్​సభ ఎన్నికలలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్ఏని అధికారంలోకి తీసుకురావటంలో కీలక పాత్ర పోషించి ఎన్నికల వ్యూహకర్తగా వెలుగులోకి వచ్చిన ప్రశాంత్ కిషోర్ తరువాత బెంగాల్‌‌లో మమతా బెనర్జీని ఆంధ్రప్రదేశ్‌‌లో జగన్మోహన్ రెడ్డిని పంజాబ్‌‌లో అమరేందర్ సింగ్‌‌ని అధికారంలోకి తీసుకురావటంతో ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ స్థాయి పెరిగింది. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే వదంతులు వచ్చినప్పటికీ ఎందుకోగానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. భవిష్యత్తులో ఏర్పడబోతోందని భావిస్తున్న తృతీయ ఫ్రంట్​కి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తే భారత దేశ రాజకీయ చిత్రపటంపై మరొకసారి ఒక బలమైన మూడవ పక్షం ఆవిష్కరించే అవకాశం లేకపోలేదు. మోడీ నాయకత్వంలోని ఎన్‌‌డీఏ ప్రభుత్వం అద్భుత విజయాలు సాధించలేక పోయినా.. దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కార మార్గం చూపించలేక పోయినా.. జాతీయస్థాయిలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ బలపడకపోవడం బలమైన జాతీయవాద హిందుత్వ ఎజెండాతో ముందుకు వెళ్తున్న బీజేపీ మోడీని 2024 లోక్ సభ ఎన్నికలలో ప్రతిపక్షాలు నిలువరించ గలుగుతాయా అనే సందేహాలు ఇప్పటికైతే బలంగా వ్యక్తమవుతున్నాయి.

నేషనల్ ఫ్రంట్ టు పెడరల్ ఫ్రంట్ 

అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఎన్‌‌టి రామారావు చైర్మన్‌‌గా, వి.పిి. సింగ్ కన్వీనర్‌‌గా నేషనల్ ఫ్రంట్‌‌ని ఏర్పాటు చేశారు. 1989 నుండి 1991 వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న నేషనల్ ఫ్రంట్ రెండేండ్ల కాలంలోనే వి.పి.సింగ్, దేవగౌడ, ఐకే గుజ్రాల్​ను ప్రధానులుగా మార్చడంతో నేషనల్ ఫ్రంట్‌‌కు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోలేకపోగా అది కాంగ్రెస్‌‌కి ప్రత్యామ్నాయంగా నిలబడలేకపోయింది. మళ్ళీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఒక ఫ్రంట్ ఏర్పాటు చేయాలని మమతా బెనర్జీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి. 2019 లోక్ సభ ఎన్నికలకు ముందే రెండోసారి తెలంగాణలో అధికారం చేపట్టిన కేసీఆర్ బీజేపీకి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్‌‌ని ఏర్పాటు చేయాలని మమతా బెనర్జీ, దేవగౌడ, శరద్ పవర్ లాంటి వాళ్లను కలిసి మంతనాలు చేసినా ఫెడరల్ ఫ్రంట్ కార్యరూపంలోకి రాలేదు. ప్రస్తుతం మళ్లీ కేసీఆర్‌‌‌‌, బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలు పెట్టారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఒక వైపు మమతాబెనర్జీ మరొక వైపు కేసిఆర్ బీజేపీని మూడవ దఫా అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టడంతో తృతీయ ఫ్రంట్ లేదా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

- డాక్టర్‌‌‌‌ తిరునాహరి శేషు, అసిస్టెంట్‌‌ ప్రొఫెసర్‌‌‌‌, కాకతీయ యూనివర్సిటీ