పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

హుజూరాబాద్‌ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డికి  బిగ్ షాక్ తగిలింది.  ఆయనపై   కేసు నమోదైంది.  ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎంపీడీవో ఫిర్యాదుతో కమలాపూర్‌లోని పోలీసు స్టేషన్‌లో కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదైంది. మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయ్యింది. కౌశిక్‌రెడ్డి చేసిన కామెంట్స్ పై విచారణ జరిపి విచారణ నివేదక  పంపాలని రిటర్నింగ్ అధికారిని ఈసీ ఆదేశించింది. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ..  ‘‘మీరు ఓటేసి గెలిపిస్తారా? లేదంటే కమలాపూర్ బస్టాండ్‌‌లో మా కుటుంబమంతా ఉరేసుకోమంటరా? మీరు ఓటెయ్యకుంటే మా ముగ్గురి శవాలు చూడున్రి.. ఓటేసి దీవిస్తే జైత్రయాత్రకు వస్తా.. లేకుంటే 4వ తారీఖున మా శవయాత్రకు రండి” అని అన్నారు. ‘‘మీ దయ అంటున్న.. మీ దండం అంటున్న.. మీ గదవలు పట్టుకుంటున్న.. మీ కడుపులో తలకాయ వెడ్తున్న..’’ అంటూ ప్రాధేయపడ్డారు.