నల్గొండ, వెలుగు : కాంగ్రెస్ వచ్చిన నాలుగు నెలల్లోనే అరాచకాలు పెరిగిపోయాయని, ఓడిపోతామని తెలుసుకున్న కాంగ్రెస్ మంత్రులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలపై వందల అక్రమ కేసులు పెట్టిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం నల్గొండలో మీడియాతో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర ఇన్‌చార్జి క్రిశాంక్‌ను కిడ్నాప్ చేశారా...పోలీసులు అరెస్టు చేశారా అనేదానిపై డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటమి గ్రహించి బీఆర్‌ఎస్ కార్యకర్తలపై అడ్డగోలుగా కేసులు పెడుతున్నారని, కొందరు ఎస్‌ఐలు కాంగ్రెస్ కార్యకర్తల్లా పని చేస్తున్నారని, దీనిపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలన్నారు.
కేంద్రం ఒక్క నోటీసు పంపితే సీఎం రేవంత్‌రెడ్డి వణికిపోతున్నాడని, బడే బాయ్..చోటే బాయ్‌ల ఢిల్లీ నోటీసులు ఓ డ్రామా అని ఎద్దేవా చేశారు. జానారెడ్డి లాంటి పెద్ద మనిషి సూర్యాపేట, తుంగతుర్తిలో అభివృద్ధి జరగలేదని మాట్లాడటం సరికాదన్నారు. 17 ఏండ్లు ఆయన మంత్రిగా చేశారని, తాను పదేళ్లు ఉన్నానని..ఉమ్మడి జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎ
క్కడికి రమ్మంటే అక్కడికి వస్తానన్నారు. రైతు బంధు రాలేదని స్వయంగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చెప్పాడని, రైతు బంధు రాలేదన్న వారిని చెప్పుతో కొడతానన్న మంత్రి కోమటిరెడ్డి..ఆయనను కొడతాడా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, సీనియర్ లీడర్లు కటికం సత్తయ్యగౌడ్, పంకజ్ యాదవ్, రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, జమాల్‌ఖాద్రి, నిరంజన్ వలీ, మెరుగు గోపీనాథ్ పాల్గొన్నారు.