సర్టిఫికెట్లు ఇయ్యట్లే..సర్వర్​ పనిచేయట్లే..! రూ.లక్ష సాయానికి దరఖాస్తులెట్ల..?

  • దశాబ్ది వేడుకల్లో ఆఫీసర్లు బిజీ
  • తహసీల్​ ఆఫీసుల చుట్టూ జనం చెక్కర్లు 
  • ఇబ్బందులు పడుతున్న బీసీలు
  • దగ్గర పడుతున్న గడువు

ఖమ్మం/ఖమ్మం టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన బీసీలకు రూ.లక్ష సాయం పొందేందుకు దరఖాస్తుదారులు సవాలక్ష కష్టాలు పడుతున్నారు. కుల, ఆదాయ సర్టిఫికెట్లు పొందడం ప్రధాన సమస్యగా మారింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో ఆఫీసర్లు బిజీ తిరుగుతున్నారు. సర్టిఫికెట్ల కోసం దరఖాస్తుదారులు తహసీల్​ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఒక్కో మండలంలో వేలల్లో వస్తున్న అప్లికేషన్లను పరిశీలించి, వెంటనే వాటిని జారీ చేయడం ఎలా సాధ్యమని సిబ్బంది అంటున్నారు. ఈనెల 5న ఇన్ కమ్​సర్టిఫికెట్ కోసం అప్లై చేసుకున్న వాళ్లకు పది రోజులు అవుతున్నా, ఇప్పటి వరకు అందక ఇబ్బంది పడుతున్నారు. అప్లికేషన్లను బాక్సులో వేసి వెళ్లాలని, మీ సేవ ద్వారా సర్టిఫికెట్లను తీసుకోవాలని సిబ్బంది చెబుతున్నా, అప్లికేషన్ ఇచ్చి పక్కకు వెళ్తే వాటిని పట్టించుకోరేమోనని దరఖాస్తుదారులు భయపడుతున్నారు. మరోవైపు గడువు దగ్గర పడుతుండడంతో దరఖాస్తుదారులు టెన్షన్​పడుతున్నారు. 

సతాయిస్తున్న సర్వర్...

జనాల నుంచి వస్తున్న ఒత్తిడి దృష్ట్యా తహసీల్​ఆఫీసుల్లో దరఖాస్తులు తీసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆఫీసర్లు చెబుతున్నారు. మరోవైపు ప్రతి రోజూ వందల సంఖ్యలో అప్లికేషన్లు వస్తుండడంతో తమను అప్లికేషన్లు తీసుకోవద్దని ఆఫీసర్లు చెప్పారంటూ, కొన్ని మండలాల్లోనీ మీ సేవా సెంటర్ల నిర్వాహకులు జనాలను పంపించేస్తున్నారు. ఆన్ లైన్ లో రూ.లక్ష సాయం కోసం దరఖాస్తు కంటే ముందు సర్టిఫికెట్లను పొందడమే పెద్ద సమస్యగా మారిందని జనం వాపోతున్నారు. మరోవైపు ఈ సర్టిఫికెట్లు అందాక ఆన్ లైన్ చేయాల్సిన సైట్ కూడా సతాయిస్తోందని దరఖాస్తుదారులు చెబుతున్నారు. అన్ని వివరాలు నమోదు చేశాక చివరలో సర్వర్ ప్రాబ్లమ్​అంటూ చూపిస్తోందని, దీంతో మళ్లీ ప్రక్రియ మొదటికొస్తుందని అంటున్నారు. 

మిగితా బీసీలకు కూడా ఇవ్వాల్సిందే..

బీసీల్లోని కొన్ని కుల వృత్తులు చేసుకునేవారికి రూ.లక్ష సాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించాక ఈనెల మొదటి వారంలో విధివిధానాలను విడుదల చేసింది. నాయీ బ్రాహ్మణులు, రజకులు, సగర, ఉప్పర, కుమ్మరి, అవుసల, కంసాలి, కమ్మరి, కంచారి, వడ్ల/ వడ్రంగి/ శిల్పి, పూసల, మేదర, వడ్డెర, ఆరెకటిక, మేర, ఎంబీసీ వంటి కులాలున్న వారే అర్హులని ప్రభుత్వం తెలిపింది. మిగిలిన బీసీలు తమకు కూడా సాయం చేయాలన్న డిమాండ్లు వినిపిస్తుండగా, దరఖాస్తుల ఆన్ లైన్ ప్రక్రియలో వస్తున్న ఆటంకాలతో అర్హులైన వారు కూడా ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించే పరిస్థితి ఏర్పడింది. 

ఖమ్మం అర్బన్​ తహసీల్​ ఆఫీస్​కు గత రెండు వారాల్లో క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్ల కోసం 14వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిలో తమ సర్టిఫికెట్ ఎప్పుడు వస్తుందా, రూ.లక్ష సాయం కోసం ఎప్పుడు అప్లయ్​చేసు కోవాలా అని ఎదురుచూస్తున్నారు. ఇద్దరు ఆర్ఐలు ఉన్నా, గతంలో ఫీల్డ్ వెరిఫికేషన్​చేసి రిపోర్ట్ అందించిన వీఆర్వో వ్యవస్థ ఇప్పుడు లేక సమస్యగా మారింది. ఆర్ఐలు కొందరు ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని ఫీల్డ్ ఎంక్వైరీ చేయిస్తుండడంతో, వాళ్లకు పైసలిచ్చిన వాళ్లకే త్వరగా పనులు అవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

మీ సేవలో అప్లికేషన్స్ ఇస్తలేరు..

బీసీలకు రూ.లక్ష సాయం కోసం సర్టిఫికెట్స్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు మీసేవకు పోతే కనీసం అప్లికేషన్ కూడా ఇస్తలేరు. వేల సంఖ్యలో దరఖాస్తుదారులు మీసేవ సెంటర్లకు రావడంతో ఆఫీసర్ల ఆదేశాలతో అప్లికేషన్లను నిలిపివేశామని మీ సేవా సెంటర్ నిర్వాహకులు చెప్తున్నరు. గడువేమో దగ్గరపడుతోంది. సర్టిఫికెట్లు ఎప్పుడు తీసుకోవాలో ఆన్​లైన్ ఎప్పుడు చేయాలో అర్థం కావడంలేదు. - నరసింహారావు, వేం

సూరుపది రోజులైనా సర్టిఫికెట్ రాలే..

ఈనెల 5న ఇన్​కమ్​సర్టిఫికెట్ కోసం అప్లయ్​చేసిన. పది రోజులవుతున్నా సర్టిఫికెట్ రాలే. ఎమ్మార్వో ఆఫీస్​కు వెళ్లినా అక్కడ ఏదో ఒకటి చెబుతున్నారు. అంతే తప్పా సర్టిఫికెట్ మాత్రం చేతికి అందలేదు. 
- నరేశ్, కైకొండాయిగూడెం