
కొన్ని సంఘటనలు నిజమైనా నమ్మలేనంత ఆశ్చర్యంగా ఉంటాయి. ఇదీ అంతే.. దాదాపు వందేళ్ల వయసులో ఒక తాబేళ్ల జంట తల్లిదండ్రులయ్యాయి. అవును.. మీరు చదివింది నిజమే!
సాధారణంగా తాబేళ్లు వాటి జాతులు, ఉండే ఆవాసం, తినే ఫుడ్‌ని బట్టి ఒక దశలో అవి గుడ్లు పెడతాయి. అయితే వీటిలో అరుదైన రకం గాలాపాగోస్ తాబేళ్లు. ఇవి గాలాపాగోస్ ఐలాండ్స్‌లో కనిపిస్తాయి. ప్రస్తుతం ఇవి అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఫిలదెల్ఫియా జూలోని ఒక తాబేళ్ల జంట నాలుగు పిల్లలకు జన్మనిచ్చాయి.
ఆ జంటలో ఆడ తాబేలుకు 97 ఏళ్లు, బరువు127 కేజీలు. మగదాని వయసు 96 ఏళ్లు, బరువు185 కేజీలు ఉన్నాయి. ఆడ తాబేలు1932, ఏప్రిల్ నుంచి ఈ జూలో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 23న ఆ జూలో అడుగుపెట్టి 93 ఏండ్లు పూర్తికానుంది. మగ తాబేలును 2020, డిసెంబర్లో జూకి తీసుకొచ్చారు. ఈ వయసులో అవి గుడ్లు పెట్టడం ఒక అరుదైన విషయం అయితే, అందులోనూ150 ఏండ్ల చరిత్ర ఉన్న ఆ జూలో ఇలా జరగడం ఇదే మొదటిసారి అని జూ సిబ్బంది చెప్పింది.
అంతేకాదు.. గాలాపాగోస్ తాబేళ్లు దాదాపు 200 ఏండ్లు బతుకుతాయి. ఆ రకంగా చూస్తే ఇవి ప్రస్తుతం మధ్య వయసులో ఉన్నాయన్నమాట! మొదటిసారిగా ఫిబ్రవరి 27న ఒక గుడ్డు నుంచి పిల్ల బయటకు వచ్చింది. చివరిది మార్చి 6న పుట్టింది. మొత్తం నాలుగు పిల్ల తాబేళ్లు పుట్టాయని, వాటి బరువు 70 నుంచి 80 గ్రాములు ఉందని చెప్పారు. అంతేకాదు ఆ జూలో ఉన్న అరుదైన తాబేళ్లలో తల్లి తాబేలు ఒకటి. దాని జాతిలో ఈ వయసులో పిల్లలకు జన్మనిచ్చినవాటిలో మొదటిది.