కేంద్ర ఎన్నికల సంఘం హైదరాబాద్ కు చేరుకుంది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన కేంద్ర ఎన్నికల సంఘం టీం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరింది. కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు రాకతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. 20 వాహనాలతో భారీ కాన్వాయ్ ని ఏర్పాటు చేశారు రాష్ట్ర అధికారులు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో కేంద్ర ఎన్నికల సంఘాన్ని సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర రిసీవ్ చేసుకున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనుంది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన 10 రాజకీయ పార్టీలతో అక్టోబర్ 3న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం నలుగున్నర దాకా సమావేశం కానుంది. ఈసీ బృందం సమావేశం కానున్న పార్టీల జాబితాలో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, టీఎంసీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, బీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ ప్రధానంగా డబుల్ ఓట్లు, బోగస్ ఓట్లపైనే కంప్లయింట్ చేయనున్నాయి.
అక్టోబర్ 4న ఉదయం 6.30 గంటలకు కేబుల్ బ్రిడ్జిపై నిర్వహించే ఓటరు చైతన్య కార్యక్రమంలో ఈసీ బృందం పాల్గొంటుంది. తర్వాత ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 7 దాకా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలతో ఎన్నికల నిర్వహణపై చర్చించనుంది. ప్రతి జిల్లా ఎన్నికల అధికారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
అక్టోబర్ 5న గురువారం సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై.. ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల టీమ్ సమీక్షించనుంది. ప్రముఖులు, దివ్యాంగ ఓటర్లు, యువ ఓటర్లతోనూ కేంద్ర ఎన్నికల సంఘం బృందం సమావేశమవుతుంది. మధ్నాహ్నం ఈసీ బృందం మీడియా సమావేశం నిర్వహించనుంది.