
‘ఒకే దేశం... ఒకే ఎన్నిక’.. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్.. అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పే నినాదాలు ఎంతో ఆకర్షణగా ఉంటాయి. అయితే ఆచరణలోకి వచ్చేసరికి రాష్ట్రాలకు ఆపన్న హస్తం అందించాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన హక్కులను పదకొండేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోంది. రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది.
దేశంలోని సమాఖ్య స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా తమకు న్యాయంగా రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కోరితే రాష్ట్ర బీజేపీ నేతలు చులకనగా మాట్లాడుతుండడం దురదృష్టకరం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రాజెక్టులు, నిధుల కోసం సంప్రదించడం భిక్ష కాదు. అది బాధ్యతాయుతమైన హక్కుగా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.
నిత్యం రాజకీయాలు, ఎన్నికల కోణంలోనే ఆలోచించే బీజేపీ నేతలు తమవంతు బాధ్యతగా రాష్ట్ర సంక్షేమంపై కూడా ప్రత్యేక దృష్టి పెడితే తెలంగాణ అభివృద్ధికి చేదోడుగా ఉంటుంది. రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక నిధులను ఇవ్వలేదు. రాష్ట్రంలోని ఏ ఒక్క నీటి ప్రాజెక్టుకూ జాతీయ హోదా దక్కలేదు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఊసే ఎత్తడం లేదు. లక్షలాది ఉద్యోగాల కల్పనకు దోహదపడే ఐటీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్, ఐఐఎం మర్చేపోయారు.
పందకొండేళ్ల బీజేపీ ప్రభుత్వ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రతిసారీ అన్యాయమే చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే రాజకీయాలు చేయడం తప్ప న్యాయం చేయరు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించడం లేదని రాష్ట్ర బీజేపీ నేతలంటారు. బాధ్యతాయుతంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించి న్యాయంగా దక్కాల్సిన హక్కులను కోరితే స్థానిక బీజేపీ నేతలు బురద జల్లుతారు.
ప్రధాన మంత్రిని కలవకపోతే ఒకటంటారు. కలిస్తే రెండంటారు. ఎన్నికలకే పరిమితం కావాల్సిన రాజకీయాలను రాష్ట్ర అభివృద్ధికి ముడిపెట్టి బీజేపీ నేతలు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు.తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ఆర్థిక వనరులను కేంద్ర ప్రభుత్వం కేటాయించడం లేదు. దేశ జీడీపీలో 5.1 శాతం తెలంగాణ వాటా ఉండగా, ఇందులో 2.10 శాతమే తిరిగి తెలంగాణకు వస్తోంది.
జీఎస్టీ, ఇతర పన్నుల రూపంలో రాష్ట్రం నుంచి సుమారు లక్ష కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కనీసం రూ.40 వేల కోట్లు కూడా తిరిగి ఇవ్వడం లేదు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన 2025–- 26 బడ్జెట్‌ను తెలంగాణపై కేంద్రానికి ఉన్న వివక్షకు నిదర్శనంగా చెప్పవచ్చు.
రైల్వే బడ్జెట్లో కూడా రాష్ట్రానికి అన్యాయం
రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు ప్రాజెక్టుల కోసం రూ.1.63 లక్షల కోట్లు అవసరమని, వీటికి ప్రస్తుత బడ్జెట్లో రూ.40 వేల కోట్లు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని, సంబంధిత కేంద్రమంత్రులను స్వయంగా కలిసి పలుమార్లు విజ్ఞప్తి చేస్తే కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.
వెనుకబడ్డ మహబూబ్‌నగర్ జిల్లాకు జీవనాడి అయిన పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు. ఐఐటీ, ఐఐఎం, నవోదయ, సైనిక్ పాఠశాలలు మంజూరు చేయాలని కోరినా ఇవ్వలేదు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి స్కీమ్‌లో భాగంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన రూ.1800 కోట్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. కేంద్రం నుంచి రాష్ట్రానికి అడుగడుగునా అన్యాయం జరుగుతున్నా తెలంగాణ బీజేపీ నేతలు పట్టనట్టే ఉండడం శోచనీయం. రైల్వే బడ్జెట్లో కూడా రాష్ట్రానికి అన్యాయమే జరుగుతోంది.
తెలంగాణలో కొత్త రైల్వే లైన్ల ప్రాజెక్టులు, రైళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇందుకు రూ.83,543 కోట్లు అవసరం అవుతాయి. అయితే కేంద్ర ప్రభుత్వం తిరోగమన దిశలో 2024-25లో రూ.5,336 కోట్లు కేటాయించి, ఇప్పుడు 2025–-26లో రూ.5,337 కోట్లు అంటే కేవలం ఒక కోటి మాత్రమే అదనంగా పెంచారంటే రాష్ట్రంపై కేంద్రం కక్షగట్టిందా అనే అనుమానాలు రాకమానవు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న యాదాద్రి ఎంఎంటీఎస్ ఇంకా పట్టాలెక్కలేదు. అంతేకాక, కేంద్రం ప్రభుత్వం ప్రకటించే ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల్లో కూడా తెలంగాణపై బీజేపీ వివక్ష చూపించింది.
ఎప్పుడైనా..ఎక్కడైనా చర్చకు సిద్ధమే
కేసీఆర్ స్వార్థ రాజకీయాలకు తోడు కేంద్రంలో పదకొండేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వివక్షతతో తెలంగాణకు అన్యాయమే జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయాలను ఎన్నికలకే పరిమితం చేయాలనే దృఢనిశ్చయంతో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రధాని మోదీని రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరించాలని ఇటీవల కలిసి కోరారు.
ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్‌లో మెట్రో రెండో దశ, రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం, రీజినల్ రింగ్ రైల్వే, హైదరాబాద్ డ్రైపోర్టు నుంచి బందర్ పోర్టుకు గ్రీన్ ఫీల్డ్ హైవే, దీనికి రైల్వే కనెక్టవిటీ, సబర్మతి, గంగా, యమున తరహాలో మూసీనది పునరుద్ధరణ, తెలంగాణకు సెమీ కండక్టర్ యూనిట్ కేటాయింపునకు తోడ్పాటు అందించాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్‌రెడ్డి కోరినా ప్రయోజనం శూన్యం. కాంగ్రెస్ మమ్మల్ని అడిగి హామీలిచ్చిందా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డా? నేనా? సీఎం బ్లాక్ మెయిల్ రాజకీయాలు అంటూ కిషన్ రెడ్డి మొదలుకొని రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శలు ప్రారంభించారు.
తెలంగాణ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కేంద్రాన్ని కోరిందే తప్ప భిక్ష అడగడం లేదు. నేను తెలంగాణ సీఎంను కాదు కాబట్టి నాకేమి బాధ్యత అన్నట్టు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. తెలంగాణ బిడ్డగా ఆయన బాధ్యతను కాంగ్రెస్ గుర్తు చేసింది.
గ్రేటర్లో ఒక ఎంపీగా ఉన్న ఆయన మెట్రో కోసం సహకరించాలని, నగర అభివృద్ధికి కృషి చేయాలని చెప్పడమే తప్ప ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవు. మోదీ పదకొండేళ్ల ప్రభుత్వంలో తెలంగాణకు దక్కాల్సిన ప్రాజెక్టులు వచ్చాయా? నిధులు అందాయా? అనే అంశాలపై బీజేపీ నేతలతో కాంగ్రెస్ ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధమే. ప్రజాస్వామ్య దేశంలో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య అందిపుచ్చుకునే ధోరణి సమాఖ్య స్ఫూర్తికి ఎంతో అవసరమని రాజ్యాంగం చెబుతోంది.
దీనికి అనుగుణంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై సవతితల్లి ప్రేమ చూపించకుండా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తున్నా.. రాష్ట్ర బీజేపీ నేతలు పట్టించుకోకుండా అన్యాయాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌పై విమర్శలు చేయడాన్ని ప్రజలు హర్షించరు.
స్వార్థ రాజకీయాలతో కేంద్ర బడ్జెట్
దేశ బడ్జెట్‌ను స్వార్థ రాజకీయాలతో బీజేపీ బుజ్జగింపుల బడ్జెట్‌గా, ఎన్నికల బడ్జెట్‌గా మార్చేసింది. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను, ఈ సంవత్సరం చివరిలో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోదీ ప్రభుత్వం 2025 బడ్జెట్లో ఆ రెండు రాష్ట్రాలకే ప్రాధాన్యతనిచ్చిందనేది బహిరంగ రహస్యమే.
ఇతర రాష్ట్రాలపై వివక్ష చూపుతూ బడ్జెట్ అంటే బీజేపీ చెబుతున్న ‘వికసిత్ భారత్’ కొన్ని రాష్ట్రాలకే పరిమితమా? 2025-26 కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణకు మరోసారి అన్ని రంగాల్లో అన్యాయం చేసినా మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రులు, వారితోపాటు మరో ఆరుగురు బీజేపీ ఎంపీలు ప్రశ్నించిన పాపాన పోలేదు. ఇదేం అన్యాయమని మేం ప్రశ్నిస్తే మమ్మల్ని తిట్టిపోయడంలో ముందుండే తెలంగాణ బీజేపీ నేతలు మోదీ ముందు మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు.
- బి.మహేశ్ కుమార్ గౌడ్,ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు-