- 18 ఏండ్లు వచ్చేవరకు నెలకు రూ.4వేల సాయం
- కానీ స్కీంపై అవగాహన కరువు
- ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో అందుకుంటున్నది 38 మంది మాత్రమే
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో తల్లిదండ్రులను కోల్పోయి, సింగిల్ పెరెంట్స్గా ఉన్న పిల్లలతోపాటు ఇతర ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నావారు చాలా మంది ఉన్నారు. వారికి అండగా కేంద్ర ప్రభుత్వం ‘మిషన్ వాత్సల్య స్పాన్సర్ షిప్ స్కీం’ను అమలు చేస్తోంది. కానీ దానిపై చాలా మందికి అవగాహన లేకపోవడంతో ఆ ప్రోత్సాహకం వారు అందుకోలేకపోతున్నారు. జిల్లాలో మొత్తం 8 లక్షల జనాభా ఉంటే అందులో 18 ఏండ్లలోపు చిన్నారులు 2 లక్షల(25 శాతం) మంది ఉన్నారు. వీరిలో తల్లిదండ్రులను లేదా సింగిల్ పేరెంట్ను కోల్పోయిన చిన్నారులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నావారు, దివ్యాంగులు ఉన్నారు.
సాయంగా ‘మిషన్ వాత్సల్య’
ఇలాంటి చిన్నారుల కోసం కేంద్ర శిశు సంక్షేమ శాఖ ‘మిషన్వాత్సల్య స్పాన్సర్ షిప్ స్కీం’ అమలు చేస్తోంది. ఈ స్కీం ద్వారా అర్హులైన చిన్నారులకు 18 ఏండ్లు వచ్చేంతవరకూ ప్రతినెలా రూ. 4 వేలు సాయంగా అందిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఏటా రూ. 92 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 72 వేలు ఆదాయం కలిగిన వారే అర్హులు. 18 ఏండ్లు వచ్చేంత వరకూ స్కీంలో లబ్ధిదారులుగా ఉంటారు. ఆ తర్వాత ఆటోమెటిక్‌గా స్కీం నుంచి తొలగించేస్తారు. ఈ స్కీంలో అప్లయ్ చేసుకోవడానికి డెడ్‌లైన్ అంటూ ఏమీలేదు. నిరంతర ప్రక్రియ. లబ్ధిదారుల సంఖ్యలో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు ఉంటాయి.
కానీ అవగాహనే లేదు...
ఈ స్కీం 2011 నుంచి అమలవుతున్నా పెద్దగా ప్రాచుర్యంలోకి రాకపోవడంతో లబ్ధిదారులైన చిన్నారుల సంఖ్య తక్కువగా ఉంటోంది. ఈ స్కీంలో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 38 మంది మాత్రమే లబ్ధిదారులుగా ఉన్నారు. ఇటీవలే ఈ స్కీం గురించి ప్రచారం పెరుగుతుండటంతో అప్లికేషన్ల సంఖ్య పెరుగుతోంది. యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి నేతృత్వంలో ఐదుగురు మెంబర్లతో కూడిన స్పాన్షర్షిప్ కమిటీ దరఖాస్తులు చేసుకున్న వారిలో అర్హులను ఎంపిక చేస్తోంది. వారి జాబితాను స్టేట్ గవర్నమెంట్‌కు, అనంతరం సెంట్రల్ గవర్నమెంట్‌కు రిపోర్ట్ పంపిస్తోంది.
తల్లి సంరక్షణలోనే ఎక్కువ మంది
సింగిల్ పేరెంట్సంరక్షణలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారు. మొత్తం 1702 మంది సింగిల్ పేరెంట్ ఉన్న చిన్నారలుండగా, ఎక్కువ మందికి తల్లి మాత్రమే ఉంది. మగవారిలో మద్యానికి బానిసలై, అనారోగ్యానికి గురై చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇంటికి పెద్ద దిక్కు లేకపోవడంతో చిన్నారుల భవిష్యత్ కొంత ఆందోళనకరంగానే సాగుతోంది.
2600 దరఖాస్తులు..
యాదాద్రి జిల్లాలో ఇప్పటి వరకు మిషన్ వాత్సల్య స్పాన్సర్ షిప్ స్కీంకు 2600 మంది చిన్నారులు అప్లయ్ చేసుకున్నారు. వీరిలో ఇన్‌కం ఎక్కువగా ఉన్న కారణంగా 708 మంది చిన్నారులను అనర్హులుగా తేల్చారు.
మిగతా 1892 మంది గురించి ఐసీడీఎస్ ద్వారా ఎంక్వైరీ జరుగుతోంది. వీరిలో తల్లిదండ్రులు లేని అనాథలు 175 మంది ఉన్నారు. సింగిల్ పేరెంట్ ఉన్నవారు 1702 మంది చిన్నారులు ఉన్నారు. హెచ్ఐవీ బాధితులు 13 మంది,ఇద్దరు దివ్యాంగులు ఉన్నారు.
మిషన్ వాత్సల్య నిరంతరం సాగుతుంది
కేంద్రం అమలు చేస్తున్న మిషన్ వాత్సల్య స్పాన్షర్షిప్ స్కీం నిరంతరంగా సాగుతుంది. బాధిత చిన్నారులు ఎప్పటికప్పడు అప్లయ్ చేసుకోవచ్చు. అర్హులైన పిల్లలకు ఈస్కీంలో 18 ఏండ్లు వచ్చేంత వరకూ లబ్ధి పొందుతారు.
సైదులు, డీసీపీవో, యాదాద్రి జిల్లా