కరీంనగర్లో రాత్రుళ్లు ఈ రూట్లో గానీ వెళ్తున్నారా..? అయితే.. చీకట్లో ప్రయాణం చేయాల్సిందే..

కరీంనగర్లో రాత్రుళ్లు ఈ రూట్లో గానీ వెళ్తున్నారా..? అయితే.. చీకట్లో ప్రయాణం చేయాల్సిందే..
  •  వెలగని సెంట్రల్ లైట్లు 
  •  పట్టించుకొని మున్సిపల్ అధికారులు..

తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్ గ్రామం నుంచి మండలంలోని మహాత్మా నగర్ వరకు రాజీవ్ రహదారి సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ అధ్వాన్నంగా తయారైంది. అటు మున్సిపాలిటీ నిర్లక్ష్యం.. ఇటు హెచ్​కేఆర్​కు సంబంధమే లేకపోవడంతో చీకట్లో ప్రయాణం వాహనదారులకు పరిపాటిగా మారింది.  సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను మున్సిపల్​శాఖ పట్టించుకోకవడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు స్తంభాలకు ఢీ కొట్టగా వాటిని తొలగించి రోడ్డు డివైడర్​ మధ్యలోనో లేక రోడ్డు పక్కకు పడేస్తున్నారు.

పాడైపోయిన లైట్లను సైతం మార్చకుండా చోద్యం చూస్తున్నారు. రాజీవ్​ రహదారి పర్యవేక్షిస్తున్న హెచ్​కేఆర్ సంస్థ కొన్నిచోట్ల సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను నిర్వహిస్తోంది.  అలుగునూర్ నుంచి మహాత్మా నగర్ వరకున్న లైటింగ్​కు మాత్రం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి ఏర్పాటు చేసింది.

వాటి నిర్వహణను కరీంనగర్​ మున్సిపాలిటీకి అప్పగించింది. అప్పటి నుంచి హెచ్​కేఆర్​ సంస్థ నిర్వహణను విడిచిపెట్టగా, ప్రస్తుతం మున్సిపల్​శాఖ సైతం మరమ్మతులను గాలికొదిలేసింది. అయితే రాత్రుళ్లు ప్రయాణం చేస్తున్న వాహనదారులు మాత్రం ఇప్పటికైనా అధికారులు స్పందించి సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను సక్రమంగా నిర్వహించాలని కోరుతున్నారు.