చెన్నైలో జరిగేది దొంగల ముఠా సమావేశం : కేంద్ర మంత్రి బండి సంచలన కామెంట్స్

చెన్నైలో జరిగేది దొంగల ముఠా సమావేశం : కేంద్ర మంత్రి బండి సంచలన కామెంట్స్

చెన్నై సిటీలో డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న డీలిమిటేషన్.. రాష్ట్రాల హక్కులకు సంబంధించిన సమావేశంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. 2025, మార్చి 22వ తేదీన.. కరీంనగర్ చామన్ పల్లిలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఆయన.. చెన్నైలో ఆల్ పార్టీ మీటింగ్ పై  తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డీఎంకే ప్రభుత్వం వెయ్యి కోట్ల లిక్కర్ స్కాం చేసిందని.. అవినీతి కుంభకోణాలను పక్కదారి పట్టించేందుకే డీలిమిటేషన్ పేరుతో డ్రామాలు ఆడుతుందన్నారు కేంద్ర మంత్రి బండి.

చెన్నై వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే అని తేలిపోయిందని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని.. లిక్కర్ దొంగలు అంతా ఒక్కటయ్యారంటూ చెప్పుకొచ్చారాయన. దోచుకున్నది దాచుకోవటానికి.. అవినీతి స్కాంల నుంచి బయటపడేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశారంటూ దుయ్యబట్టారు కేంద్ర మంత్రి బండి. ఆరు గ్యారంటీలపై పోరాటం చేయకుండా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వం లోపాయికారీ ఒప్పందం చేసుకుందన్నారాయన. 

Also Read : డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదు

దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉందని.. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని.. కేసీఆర్ చక్రం తిప్పే రోజులు పోయాయి అన్నారు బండి సంజయ్. 
బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరు అనేది విషయంపైనా స్పందించారు. నేను రేసులో లేను.. నాకు కేంద్ర మంత్రి పదవి బాధ్యతలు అప్పగించారు.. పార్టీ ఏ పదవి ఇచ్చినా.. క్రమ శిక్షణ ఉన్న కార్యకర్తగా పని చేస్తానంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్.