
- లోక్‌సభలో కేంద్ర మంత్రి బఘేల్ వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: చట్టబద్ధంగా ఎన్నికైన స్థానిక సంస్థలు ఉంటేనే నిధులు విడుదల అవుతాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే 15వ ఆర్థిక సంఘం తెలంగాణలోని స్థానిక సంస్థలకు 2024–25కు కేటాయించిన గ్రాంట్ల విడుదల వాయిదా పడిందని వెల్లడించింది. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మంగళవారం లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర పంచాయతీ రాజ్ సహాయ మంత్రి ఎస్‌పీ సింగ్ బఘేల్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
కేంద్ర ఆర్థిక శాఖ గైడ్ లైన్స్ ప్రకారం 2021–22 నుంచి 2025–26 వరకు స్థానిక సంస్థలు చట్టబద్ధంగా ఏర్పడితే వాటిని గ్రాంట్లకు అర్హులుగా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. అయితే, 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం 2024–25 సంవత్సరంలో రాష్ట్రంలోని పంచాయతీలకు రూ.1514 కోట్లు కేటాయించామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికైన లోకల్ బాడీలు లేనందున ఆ నిధులు వాయిదా పడ్డాయని మంత్రి స్పష్టం చేశారు.