
వివాదాలు.. విమర్శలు.. అసలు జరుగుతుందో లేదో అన్న అనిశ్చితిని దాటుకొని ఎనిమిదేండ్ల విరామం తర్వాత చాంపియన్స్ ట్రోఫీ మళ్లీ సందడి చేయనుంది. ఎందులోనూ తగ్గేదే లేదంటూ గ్రౌండ్‌లో వన్డే వార్ చేసేందుకు మేటి ఎనిమిది జట్లు సిద్ధమయ్యాయి. దాదాపు మూడు దశాబ్దాల విరామం తర్వాత ఓ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ గడ్డపై చాంపియన్ల ఆట మరికొన్ని గంటల్లో మొదలవనుంది. తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడనున్న టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
ఎనిమిది జట్లు.. రెండు గ్రూపులు.. మూడు వారాల పోటీ. అన్నింటి లక్ష్యం ఒక్కటే. చాంపియన్ల ఆటలో తామే అసలైన చాంపియన్ అని నిరూపించుకోవడమే. బుధవారం మొదలవుతున్న ఈ టోర్నీలో ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ గ్రూప్–ఎలో బరిలో నిలవగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, అఫ్గానిస్తాన్ గ్రూప్–బిలో పోటీ పడనున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య కరాచీ నేషనల్ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌తో మెగా టోర్నీకి తెరలేవనుంది. ప్రతి గ్రూప్‌లో టాప్– 2లో నిలిచే జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
టీ20లకు విపరీతమైన క్రేజ్ పెరిగి వన్డే క్రికెట్ ఉనికిపై ప్రశ్నలు వస్తున్న సమయంలో జరుగుతున్న మెగా ఈవెంట్ ఈ ఫార్మాట్‌కు అత్యంత కీలకం కానుంది. అలాగే, 1996 వరల్డ్ కప్ తర్వాత పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న తొలి ఐసీసీ ఈవెంట్ ఇదే కావడం మరింత ప్రత్యేకత సంతరించుకుంది. భద్రతా కారణాల రీత్యా పాక్ వెళ్లేందుకు నిరాకరించిన టీమిండియా తమ మ్యాచ్‌లన్నింటినీ దుబాయ్ వేదికగా ఆడనుంది. ఈ నెల 23న చిరకాల ప్రత్యర్థులైన ఇండియా–పాకిస్తాన్ మధ్య మెగా మ్యాచ్‌తో ఈ టోర్నీకి అసలైన ఊపు రానుంది.
ఇండియానే ఫేవరెట్..
ఇటీవల వన్డేల్లో సూపర్ ఫెర్ఫామెన్స్ చేస్తున్న టీమిండియానే ఈ టోర్నీలో హాట్ ఫేవరెట్. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో పేస్ బౌలింగ్ కాస్త సమస్యగా మారే అవకాశం ఉన్నా.. మిగతా అన్ని విభాగాల్లో మన జట్టు దుర్బేధ్యంగా ఉంది. కానీ, గతేడాది వన్డే వరల్డ్ కప్‌ను తుది మెట్టుపై కోల్పోయిన నేపథ్యంలో రోహిత్‌సేన ఏ చిన్న తప్పిదానికి కూడా ఆస్కారం లేకుండా చూసుకోవాలి.
రెండుసార్లు చాంపియన్ అయిన ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్, మార్కస్ స్టోయినిస్ లేకుండా బరిలోకి దిగుతోంది. ఈ మధ్య శ్రీలంక చేతిలో రెండు వన్డేల్లో ఓడిన ఆ జట్టు ఒత్తిడిలో ఉంది. కొన్నేండ్ల కిందట వన్డేల్లో ఓ ఊపు ఊపిన ఇంగ్లండ్ హవా క్రమంగా తగ్గిపోయింది.
ఇండియా చేతిలో వైట్‌వాష్‌కు గురై ఈ టోర్నీలో ఆడుగు పెట్టిన ఆ జట్టును ముందుకు తీసుకెళ్లే బాధ్యత బట్లర్, జో రూట్, లివింగ్‌స్టోన్ వంటి సీనియర్లపై ఎక్కువగా ఉంది. ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ లాంటి కీలక ఆటగాళ్లు లేకుండా వచ్చిన న్యూజిలాండ్ తమ వెటరన్ క్రికెటర్ కేన్ విలియమ్సన్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. గత టీ20 వరల్డ్ కప్‌ను కొద్దిలో చేజార్చుకున్న సౌతాఫ్రికా టెంబా బవూమ కెప్టెన్సీలో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
ఇండియాతో పాటు ఆతిథ్య పాకిస్తాన్‌పైనా భారీ అంచనాలు ఉన్నాయి. ఆ జట్టు పేస్ బలం అత్యంత పదునుగా ఉండగా.. బాబర్ ఆజమ్, కెప్టెన్ రిజ్వాన్‌కు తోడు ఫఖర్ జమాన్, సల్మాన్ అలీ అఘా రూపంలో మంచి బ్యాటర్లు అందుబాటులో ఉన్నారు. ట్రోఫీ నెగ్గే సత్తా లేకపోయినా ఆసియా టీమ్స్ అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్.. ఇతర జట్ల అవకాశాలను దెబ్బతీసి సంచలనాలు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఇదీ చరిత్ర
టెస్టులు ఆడని దేశాల్లో క్రికెట్ అభివృద్ధి కోసం నిధులు సేకరించేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 1998లో ఈ టోర్నీని ప్రారంభించింది. ఐసీసీ నాకౌట్ ట్రోఫీ పేరిట తొలి రెండు ఎడిషన్లను బంగ్లాదేశ్, కెన్యా (2000)లో నిర్వహించింది. 2002 నుంచి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీగా పేరు మార్చింది. 2006 వరకు రెండేండ్లకు ఓసారి జరిగిన ఈ టోర్నీని 2009 నుంచి నాలుగేండ్లకు ఓసారి నిర్వహిస్తోంది.
వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్–8 ర్యాంకుల్లో నిలిచే జట్లు ఈ టోర్నీకి అర్హత సాధిస్తున్నాయి. అయితే, 2017 తర్వాత ఒక ఫార్మాట్‌కు ఒకే ఐసీసీ ఈవెంట్ ఉండాలని దీన్ని రద్దు చేసింది. కానీ, మెన్స్ క్రికెట్ 2024–2031 సైకిల్‌లో భాగంగా 2025 నుంచి చాంపియన్స్ ట్రోఫీని పునరుద్ధరించాలని ఐసీసీ నిర్ణయించింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, ఇండియా అత్యధికంగా చెరో రెండుసార్లు విజేతలుగా నిలిచాయి.
ట్రోఫీతో ముగిస్తారా..?
ఈ మెగా టోర్నీలో టీమిండియా సూపర్ స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై అందరి ఫోకస్ ఉంది. గత రెండు దశాబ్దాలుగా తమ బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులు కొల్లగొట్టి.. అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన రోకో కెరీర్ చరమాంకంలో ఉన్నారు. ఈ టోర్నీ తర్వాత ఈ ఇద్దరినీ ఇండియా వన్డే టీమ్‌లో చూసే అవకాశం కనిపించడం లేదు. తమకు చివరిది కాబోయే ఈ ఐసీసీ ఈవెంట్‌లో సత్తా చాటి కప్పు అందుకోవాలని ఇద్దరూ కృతనిశ్చయంతో ఉన్నారు. చాంపియన్స్ ట్రోఫీలో ఫలితం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భవితవ్యానికి కూడా కీలకం కానుంది.
న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిల్లో టెస్టు సిరీస్‌ల ఓటమి తర్వాత అతని కోచింగ్‌పై అనేక ప్రశ్నలు వచ్చాయి. ఇటీవల సొంతగడ్డపై ఇంగ్లండ్‌పై మన జట్టు మెరుగ్గా ఆడటంతో గౌతీకి కొంత ఉపశమనం లభించినా.. ఐసీసీ ఈవెంట్‌లో గెలిస్తే రాబోయే వన్డే వరల్డ్ కప్ వరకూ అతని ప్లేస్‌కు ఢోకా ఉండకపోవచ్చు. జట్టు విషయానికి వస్తే 2013లో ధోనీ కెప్టెన్సీలో ఇదే టోర్నీలో విజేతగా నిలిచిన ఇండియా వన్డే ఫార్మాట్‌లో మరో ఐసీసీ ట్రోఫీ నెగ్గలేకపోయింది. ఈ నేపథ్యంలో ఇండియా చాంపియన్స్ ట్రోఫీ అందుకుంటే లెజెండరీ క్రికెటర్లు రోహిత్, విరాట్‌కు పర్ఫెక్ట్ ఫేర్‌వెల్ ఇవ్వొచ్చు.
గత విజేతలు
- 1998 సౌతాఫ్రికా (నాకౌట్ ట్రోఫీ)
- 2000 న్యూజిలాండ్ (నాకౌట్ ట్రోఫీ)
- 2002 ఇండియా, శ్రీలంక (జాయింట్ విన్నర్స్)
- 2004 వెస్టిండీస్ 2006 ఆస్ట్రేలియా
- 2009 ఆస్ట్రేలియా 2013 ఇండియా
- 2017 పాకిస్తాన్ 2025 ..?