
- వైసీపీ ఎమ్మెల్యే రోజా
తిరుపతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. తన రాజకీయ లబ్ది కోసం బాబు ఎంతకైనా దిగజారుతారని, కుప్పం మున్సిపాల్టీలో ఓడిపోవడంతో రాజకీయ భవిష్యత్ లేదని ప్రస్టేషన్ లో బాబు ఉన్నారని పేర్కొన్నారు. మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ టైమ్ లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రోజా.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో పరిస్థితి అందరూ చూశారని అన్నారు. తన రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు గతంలో ఎన్టీఆర్ దగ్గర నుంచి ప్రభుత్వాన్ని లాక్కుని.. మైక్ కూడా ఇవ్వకుండా పంపడం చూశాము.. అలాగే ఈరోజు జరగని విషయాన్ని జరిగినట్లు ప్రజలను మభ్యపెట్టే ఆలోచనలను అందరూ గమనిస్తున్నారని విమర్శించారు. కుప్పం మున్సిపాలిటీని పోగొట్టుకోవడంతో రాజకీయంగా భవిష్యత్తు లేదని.. దాన్నుంచి డైవర్ట్ చేయడం కోసం కొత్త రాజకీయాన్ని తీసుకొచ్చారన్నారు రోజా. అసెంబ్లీలో చంద్రబాబు చెప్పినట్లుగా ఏదీ జరగలేదని, రాష్ట్రంలో మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే గతంలో బిల్లు తీసుకొచ్చారని తెలిపారు. ‘హైదరాబాద్ లో అభివృద్ధి కేంద్రీకరిస్తే.. రాష్ట్రం విడిపోయాక ఎంత నష్టపోయామో కళ్లారా చూశాము.. లక్షలాది కోట్లు అమరావతిలో ఖర్చు చేసి అభివృద్ధి కేంద్రీకరిస్తే.. మళ్లీ భవిష్యత్తులో ఉద్యమాలు వస్తాయి.. అందుకే అలాంటివి జరగకుండా.. ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారి సమస్యలు తెలుసుకుని.. అందరితో సమగ్రంగా చర్చంచి మంచి నిర్ణయం తీసుకుని కొత్త బిల్లు తీసుకొస్తారు’ అని రోజా ఆశాభావం వ్యక్తం చేశారు.