
- రిపబ్లిక్ టీవీ కాన్ క్లేవ్‌లో చంద్రబాబు
న్యూఢిల్లీ, వెలుగు: తాను భవిష్యత్తు కాలాన్ని ముందే ఊహిస్తానని, అందులో భాగంగానే హైదరాబాద్‌కు బలమైన పునాది వేశానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. భవిష్యత్తు తరాల కోసం ఆనాడు తాను తీసుకున్న నిర్ణయాల వల్లే ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ స్థాయిలోనే ఏపీ రాజధాని అమరావతిని నిర్మిస్తానని స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో ‘లిమిట్‌లెస్ ఇండియా’అనే అంశంపై రిపబ్లిక్ టీవీ నిర్వహించిన సమిట్‌లో చంద్రబాబు మాట్లాడారు.
‘‘25 ఏండ్ల క్రితమే ఐటీని ప్రోత్సహించాను. ఎన్నో ఇంజినీరింగ్ కాలేజీలను తీసుకొచ్చాను. తద్వారా ఐటీ ఇండస్ట్రీలోఉద్యోగాలు స్థానికులకే దక్కాయి. ఉద్యోగులు అందుబాటులో ఉండడంలో కంపెనీలు సైతం ఆసక్తి చూపాయి. ప్రస్తుతం దేశంలో ఎక్కడికి వెళ్లినా 35 శాతం మంది తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన వారే ఐటీ ఉద్యోగులుగా ఉన్నారు. పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన పాలసీలు రూపొందించాం. దేశంలోనే తొలిసారిగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ కట్టాం. కరోనా వంటి క్లిష్ట సమయంలో ప్రపంచ దేశాలు హైదరాబాద్ వైపు చూశాయి. బయో టెక్నాలజీని ముందే ఊహించి ఎంతో అభివృద్ధి చేశాం. భారత్ బయోటెక్ సుమారుగా వంద దేశాలకు వ్యాక్సిన్ అందించింది. జీనోమ్ వ్యాలీని ఎంతో ముందుచూపుతో ప్రోత్సహించాం”అని చంద్రబాబు తెలిపారు.