- సీఎం ఇంటి పక్కన అత్యాచారం జరిగితే పట్టించుకోలేదు
- లేని దిశ చట్టానికి యాప్, వాహనాలు, పోలీసు స్టేషన్ల వల్ల ఉపయోగం ఏమిటన్న చంద్రబాబు
అమరావతి: తాడేపల్లి గ్యాంగ్ రేప్ ఘటనపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. పార్టీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాధన దీక్ష చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్న చట్టాలను అమలు చేసే సత్తా సీఎం జగన్‌కు ఉంటే ఆ చట్టాలే సరిపోతాయని అన్నారు. లేని దిశ చట్టానికి యాప్, వాహనాలు, పోలీస్ స్టేషన్‌ల వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నించారు.
సీఎం జగన్ ఇంటి పక్కన అత్యాచారం జరిగితే పట్టించుకోకుండా సాధన దీక్ష దృష్టి మళ్లించేందుకే దిశ కార్యక్రమం పెట్టారని విమర్శించారు. కరోనాకు ప్రపంచ దేశాలన్నీ భయపడితే జగన్ రెడ్డి తేలిగ్గా తీసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. బాధ్యత గల ప్రతిపక్షంగా కరోనా కట్టడి, ముందు జాగ్రత్తలపై ప్రభుత్వాన్ని హెచ్చరిoచినా ఏమాత్రం పట్టించుకోకపోగా ఎగతాళి చేశారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ఆరోగ్యం గురించి ఆలోచించమంటే తప్పుడు కేసులు పెట్టి కక్ష సాధింపులకు దిగారని దుయ్యబట్టారు.
టెన్త్, ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థుల పట్ల కూడా వితండవాదం చేశారని, కరోనా పరిస్థితుల్లో 16.53 లక్షల మంది విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుకుందామని చూశారని చంద్రబాబు పేర్కొన్నారు. కరోనాపై.. పరీక్షల గురించి తప్పుడు సమాచారంతో సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించాలనుకున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టు ఘాటుగా హెచ్చరించడంతో సీఎం జగన్ తోక జాడించారని చంద్రబాబు పేర్కొన్నారు.