
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 సాధించిన అద్భుతమైన విజయానికి ప్రతీకగా యానిమేటెడ్ గూగుల్ డూడుల్ నివాళులు అర్పించింది. విక్రమ్ ల్యాండర్ మొదటిసారిగా దక్షిణ ధృవంపై అడుగుపెట్టి అపూర్వమైన మైలురాయిని చేరుకోవడంతో.. ఈ మహత్తర సాఫల్యాన్ని భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వైజ్ఞానిక సమాజం అంతా ప్రశంసిస్తోంది.
గూగూల్ డూడుల్ చంద్రుడిని విచిత్రమైన చిత్రణతో ముందుకు వచ్చింది, ప్రారంభంలో దాని కళ్ళు మూసుకుని నిర్మలమైన నిద్రలో ఉన్నట్టు చిత్రించింది. ఈ యానిమేషన్ మొదలుకాగానే చంద్రుడు క్రమంగా కళ్ళు తెరిచి, తన భావాన్ని వెల్లడిస్తుంది. ఈ సమయంలోనే చంద్రయాన్-3 నుంచి రోవర్ బయటికి వచ్చి.. చంద్రునిపై తిరుగుతుంది. రోవర్ విజయవంతమైన ల్యాండింగ్‌కు సాక్ష్యంగా నిలిచే ఈ చారిత్రాత్మక విజయాన్ని సూచిస్తూ గూగుల్ ఈ యానిమేటెడ్ సీక్వెన్స్ ను రూపొందించింది.
జూలై 14, 2023న, చంద్రయాన్-3 అంతరిక్ష నౌక ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట రేంజ్‌లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆగష్టు 23, 2023న, ఇది చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంపై మనోహరంగా దిగి, విజయవంతమైన ల్యాండింగ్‌ను సాధించిన మొదటి క్రాఫ్ట్‌గా చరిత్రలో నిలిచిపోయింది. ఈ ఘనతకు ముందు, యునైటెడ్ స్టేట్స్, చైనా, మాజీ సోవియట్ యూనియన్ మాత్రమే చంద్రుని ఉపరితలంలోని ఇతర ప్రాంతాలపై సాఫ్ట్ ల్యాండింగ్‌లను సాధించాయి.