
- పడ్డప్పుడల్లా 10 నిమిషాలు ట్రాఫిక్ జామ్
- ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
- చేగుంట వద్ద ఆర్‌వోబీ నిర్మించాలని డిమాండ్
మెదక్ (చేగుంట), వెలుగు :మెదక్–హైదరాబాద్ వెళ్లే దారిలో చేగుంట వద్ద ఉన్న రైల్వే గేట్ మాటిమాటికి పడుతుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రింబవళ్లు వెహికల్స్‌తో రద్దీగా ఉండే రూట్ కావడంతో గేట్ పడ్డప్పుడల్లా 10 నిమిషాలకుపైగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. మెదక్ నుంచి వ్యాపారులు, సాధారణ ప్రజలు వయా చేగుంట మీదుగానే హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. మెదక్‌లోని గవర్నమెంట్ఆఫీసుల్లో పనిచేసే ఎంప్లాయిస్, స్కూళ్లలో పనిచేసే టీచర్లు కూడా ఇదే మార్గంలో వచ్చిపోతుంటారు. మెదక్ ఆర్టీసీ డిపో నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్‌కు సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్‌లన్నీ ఈ రూట్లోనే నడుస్తున్నాయి. చిన్నశంకరంపేట మండలంలోని వివిధ కంపెనీలకు ముడిసరుకు తీసుకురావడంతో పాటు ఇక్కడ తయారయ్యే ప్రొడక్టులను ఇతర రాష్ట్రాలకు ట్రాన్స్పోర్ట్ చేసే ట్రక్కులు, ట్యాంకర్లు, కంటెయినర్లు కూడా ఈ మార్గంలోనే వెళ్తుంటాయి.
రోజుకు 40 సార్లు
సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి మహారాష్ట్రలోని ముత్కేడ్ మధ్య ఉన్న రైల్వే లైన్ చేగుంట పట్టణం మీదుగా వెళ్తోంది. ఈ రూట్‌లో ప్రతిరోజు ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్ కలిపి 30 రైళ్లు నడుస్తాయి. రైలు వచ్చిన ప్రతిసారి చేగుంటలోని రైల్వే క్రాసింగ్ వద్ద గేట్ వేస్తారు. అంతేగాక చేగుంట సమీపంలోని వడ్యారం రైల్వే స్టేషన్వద్ద పలు రైళ్లు క్రాసింగ్అవుతాయి. ఈ కారణంగా చేగుంట వద్ద ప్రతిరోజు దాదాపు 40 సార్లు గేటు పడుతోంది. ఇలా గేట్పడినప్పుడల్లా కనీసం 10 నిమిషాల పాటు ట్రాఫిక్ స్తంభిస్తోంది. అటు చేగుంట వైపు, ఇటు మెదక్ వైపు కిలో మీటర్ పొడుగునా వెహికిల్స్ నిలిచిపోతున్నాయి. దీనివల్ల ప్రయాణికులు, ఆఫీసులకు వెళ్లే ఎంప్లాయిస్‌కు ఇబ్బంది కలుగుతోంది. కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్ కోసం షెంట్లను సికింద్రాబాద్‌గాంధీ హాస్పిటల్, హైదరాబాద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లే అంబులెన్స్‌లు కూడా ఆగిపోవాల్సి వస్తోంది.
ఆర్‌వోబీతోనే సమస్య పరిష్కారం
గేట్ సమస్య తీరాలంటే చేగుంట రైల్వే క్రాసింగ్‌వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి ( ఆర్‌వోబీ) నిర్మించాలని ప్రయాణికులు ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పలుసార్లు నిరసనలు కూడా తెలిపారు. స్పందించిన సంబంధిత అధికారులు ఆర్‌వోబీ కోసం రూ.60 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. కాస్ట్ షేరింగ్పద్ధతిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలా 50 శాతం ఫండ్స్ శాంక్షన్ చేస్తే ఆర్‌వోబీ నిర్మించే అవకాశం ఉంటుంది. మెదక్ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని తమ సమస్య తీర్చాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు