చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్ మన్ దుమ్ము రేపారు. ఢిల్లీ బౌలర్లను చితక్కొడుతూ భారీ స్కోరు సాధించారు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 223 పరుగుల భారీ స్కోరు సాధించింది.
రూట్ మార్చి...
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన చెన్నైకి ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డివాన్ కాన్వే అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. సిక్సులు ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. ఎడాపెడా బౌలర్లను బాదారు. వీరిద్దరు పోటీ పడి పరుగులు సాధించడంతో..ఢిల్లీ బౌలర్లు చూస్తూ ఉండిపోయారు. ఇదే క్రమంలో తొలి వికెట్‌కి 141 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.
హాఫ్ సెంచరీలతో ..
ఇదే క్రమంలో గైక్వాడ్, కాన్వే ఇద్దరు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. గైక్వాడ్ 50 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 79 పరుగులు చేయగా..కాన్వే 52 బంతుల్లో 3 సిక్సర్లు, 11 ఫోర్లతో 87 పరుగులు సాధించారు. అయితే 141 పరుగుల వద్ద గైక్వాడ్ను సకారియా ఔట్ చేశాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన దుబే ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. కేవలం 9 బంతుల్లో 3 సిక్సర్లతో 22 పరుగులు చేశాడు. జోరుమీదున్న దుబేను ఖలీల్ అహ్మద్ పెవీలియన్ చేర్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కాన్వే (87)ను నోర్ట్జే ఖాతాలో వేసుకున్నాడు. చివర్లో జడేజా 7 బంతుల్లో 1 సిక్స్, 3 ఫోర్లు, ధోని (5) పరుగులు చేయడంతో చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి 223 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, నోర్ట్జే, సకారియా తలా ఓ వికెట్ పడగొట్టారు.