చెన్నూరు, వెలుగు: ఓవైపు పోడు పట్టాలు పంపిణీ చేస్తూనే మరోవైపు పోడు రైతులను పోలీసులు నిర్బంధించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో సోమవారం ఈ ఘటన జరిగింది. పట్టణంలోని సంతోషి మాత ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే బాల్క సుమన్ పోడుభూమి పట్టాలు చేస్తుండగా.. తమకూ పట్టాలివ్వాలని కోరేందుకు వచ్చిన పలువురు పోడు రైతులను పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. కోటపెల్లి మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో 769.26 ఎకరాల భూమికి 439 మంది రైతులకు పోడు పట్టాలు పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తమకూ పోడు పట్టాలు ఇవ్వాలని ఎమ్మెల్యే సుమన్ ను కోరేందుకు అక్కిపెల్లికి చెందిన కొందరు పోడు రైతులు అక్కడకు చేరుకున్నారు.
గమనించిన పోలీసులు.. ఎమ్మెల్యేను రైతులు అడ్డుకుంటారనే భయంతో ఈ విషయాన్ని ఎమ్మెల్యేకి తెలియజేశారు. వారిని వెంటనే క్యాంపు ఆఫీసుకు తీసుకెళ్లాలని పోలీసులకు ఎమ్మెల్యే చెప్పినట్లు సమాచారం. దీంతో మీటింగ్ హాల్లో కూర్చున్న అక్కిపెల్లి రైతులను రోడ్డు పక్కనే చెట్ల కింద గంటల తరబడి ఎమ్మెల్యే బాల్క సుమన్ వచ్చే వరకు ఉంచారు. ఎమ్మెల్యే వచ్చాక పోలీసుల నిర్బంధం మధ్య రైతులను అక్కడి నుంచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు తీసుకెళ్లి భోజనం పెట్టారు. మీటింగ్ అయ్యేంత వరకు వారిని క్యాంప్ ఆఫీసులోనే 4 గంటల వరకు పోలీసులు నిర్బంధించారు. తర్వాత క్యాంపు ఆఫీసుకు వచ్చిన ఎమ్మెల్యే బాల్క సుమన్ వారితో మాట్లాడారు. ‘‘మీకు పొడు పట్టాలు ఎందుకు రాలేదో విచారణ జరిపిస్తాను. పట్టాలు వచ్చేలా చూస్తాను’’ అని రెండు ముక్కలు చెప్పి ఎమ్మెల్యే వెళ్లిపోయారని అక్కిపెల్లి రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు.