నిల్వ ఉన్న పత్తిని సీసీఐ కొంటది : వివేక్ వెంకటస్వామి

నిల్వ ఉన్న పత్తిని సీసీఐ కొంటది : వివేక్ వెంకటస్వామి
  • రైతులు ఆందోళన చెందవద్దు: వివేక్ వెంకటస్వామి 
  • నేను, కలెక్టర్ ఐదు మిల్లులతో మాట్లాడినం  
  • 10 నుంచి కొనుగోళ్లు ప్రారంభమవుతాయని వెల్లడి 

కోల్‌‌‌‌‌‌‌‌బెల్ట్/చెన్నూరు, వెలుగు: చెన్నూరు రైతుల వద్ద నిల్వ ఉన్న పత్తిని ఈ నెల 10 నుంచి సీసీఐ ఆఫీసర్లు కొనుగోలు చేస్తారని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి భరోసా ఇచ్చారు. గురువారం రాత్రి మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది 4.25 లక్షల క్వింటాళ్ల పత్తిని కోనుగోలు చేయాలని సీసీఐ టార్గెట్ పెట్టుకుందని వివేక్ తెలిపారు. ‘‘పోయినేడాది 1.54 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది.

ఈ ఏడాది ఇప్పటి వరకు 3.56 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. రైతుల వద్ద ఇంకా 70 వేల క్వింటాళ్ల పత్తి ఉంది. దాన్ని కొనుగోలు చేసేందుకు సీసీఐ ఆఫీసర్లు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయంలో నేను, కలెక్టర్ ఐదు మిల్లుల యజమానులతో మాట్లాడాం. ఈ నెల 10 నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభిస్తారు. వారంలో పూర్తి చేస్తారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని భరోసా ఇచ్చారు. ఇంతకుముందు కూడా చెన్నూరులో పత్తి కొనుగోళ్లలో చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు.

 సీసీఐ కేంద్రాల్లో సాంకేతిక లోపం వల్ల సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్​సమస్యలు తలెత్తడం, రైతుల ఆధార్​నెంబర్​నమోదు చేస్తే ఓటీపీ రాకపోవడంతో పత్తి కొనుగోలు చేయలేదు. దీంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పందించి.. ఈ సమస్యను కేంద్రమంత్రి కిషన్​రెడ్డి, సీసీఐ ఎండీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా కృషి చేశారు. ఎంపీ చొరవతో పత్తి కొనుగోళ్లు సజావుగా చేపట్టారు. కలెక్టర్​కూడా మిల్లుల యజమానులతో మాట్లాడి కొనుగోలుకు సహకరించారు” అని పేర్కొన్నారు. సమావేశంలో కాంగ్రెస్​టౌన్ ప్రెసిడెంట్ చెన్న సూర్యనారాయణ, పీఏసీఎస్ చైర్మన్ చల్లా రామిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ లీడర్ అయిత హేమంత రెడ్డి, కోటపల్లి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుర్మా రాజమల్ల గౌడ్, చింతల శ్రీనివాస్, పాతర్ల నాగరాజు, మహేష్, శ్రీకాంత్, అన్వర్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

పెళ్లి వేడుకలకు హాజరు.. 

చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి గురువారం మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. మంచిర్యాల, మందమర్రి, క్యాతనపల్లి, జైపూర్, చెన్నూరులో జరిగిన పలు వివాహ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివేక్​ వెంకటస్వామి వెంట కాంగ్రెస్​ లీడర్లు, కార్యకర్తలు ఉన్నారు.