- పద్మశ్రీ అవార్డుకు ఆయన అన్ని విధాలా అర్హుడు: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
బషీర్ బాగ్, వెలుగు: పద్మశ్రీ అవార్డుకు ప్రజాకవి గద్దర్ అన్ని విధాలా అర్హుడని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఏ అర్హత ఉంటే ఆ అవార్డు వస్తుందో.. ఆ అర్హతలన్నీ గద్దర్ లో ఉన్నాయన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో భాషా సాంస్కృతిక శాఖ, గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దర్ (గుమ్మడి విఠల్రావు) 77 వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరై.. గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘మా నాన్న, గద్దర్ ఆలోచనా విధానాలు ఓకేలా ఉండేవి. అణచివేతకు గురైన వారి పక్షాన కొట్లాడే తత్వం వారిది. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర మరువలేనిది. అన్ని పార్టీల నాయకులను ఏకతాటిపైకి తెచ్చిన ఘనత ఆయనకు దక్కుతుంది. తన పాటలతో ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి, వారిలో పోరాట స్ఫూర్తిని పెంచారు. ఇన్ని సేవలు చేసిన గద్దర్ కు పద్మశ్రీ అవార్డు ఇచ్చే అంశంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలి”అని వివేక్ కోరారు.
కులగణనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు..
రాష్ట్రంలో జరుగుతున్న కులగణనను మాలలు వ్యతిరేకిస్తున్నారని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివేక్ వెంకటస్వామి విమర్శించారు. తాము మాలల ఆత్మగౌరవం కోసమే పోరాటం చేస్తున్నామన్నారు. వేరే కులాల వాళ్లు మీటింగ్ పెట్టుకుంటే ఎవరూ తప్పు పట్టడం లేదని.. కానీ, మాలలు మీటింగ్ పెట్టుకుంటే తప్పు పడుతున్నారని అన్నారు. కులగణనను ఎవరూ వ్యతిరేకించడం లేదన్నారు. మాలలు చేసే పోరాటాన్ని తప్పుపడుతున్నవారు ఒకసారి సుప్రీంకోర్టు తీర్పును తెలుసుకోవాలనిఆయన సూచించారు.