గ్రాడ్యుయేట్లకు సర్కార్​ అండగా ఉంటది : వివేక్​ వెంకటస్వామి

గ్రాడ్యుయేట్లకు సర్కార్​ అండగా ఉంటది : వివేక్​ వెంకటస్వామి
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్​రెడ్డిని గెలిపించాలి: వివేక్​ వెంకటస్వామి
  • చెన్నూరులో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం
  • ఎమ్మెల్యేతో పాటు హాజరైనఎంపీ గడ్డం వంశీకృష్ణ

కోల్ బెల్ట్, వెలుగు: కాంగ్రెస్ సర్కారు ​గ్రాడ్యుయేట్లకు అండగా ఉంటుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్​రెడ్డిని భారీ మోజారిటీతో గెలిపించాలని కోరారు. శుక్రవారం రాత్రి మంచిర్యాల జిల్లా చెన్నూరులో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని కొట్లాడి తెచ్చుకున్నామని.. కానీ, గత పదేండ్లలో ఎవరికీ ఉద్యోగాలు రాలేదని ఎమ్మెల్యే వివేక్​అన్నారు.

 కాంగ్రెస్​ సర్కారు వచ్చిన 16 నెలల్లోనే 57 వేల ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. 2లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాటకు కట్టుబడి కాంగ్రెస్ సర్కార్​ చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్​రెడ్డికి ఈ ప్రాంతంలో ఉన్న వారందరి సమస్యలు తెలుసని, 44 విద్యా సంస్థలు ఏర్పాటు చేసి వేలాది మందికి విద్యను అందిస్తున్నారన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో 7,581 మంది పట్టభద్రులు ఉన్నారని, అందరం కలిసి నరేందర్​రెడ్డికి ఓటు వేసి గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. నరేందర్​రెడ్డిని గెలిపించుకొని విద్యాభివృద్ధికి మరింత సహకారం తీసుకుందామన్నారు. 

తెలంగాణ ఉద్యమంలో కాకా కుటుంబం కీలక పాత్ర

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాకా కుటుంబం ఎంతో కృషి చేసిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. తన తండ్రి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి చేసిన కృషి ఎంతో గొప్పదన్నారు. కాంగ్రెస్​తోనే  తెలంగాణ రాష్ట్రం సాధించేలా ఆయన చొరవచూపారన్నారు. నేషనల్​హైవే 63లోని జోడు వాగుల వద్ద ఫోర్​లేన్​  రోడ్డు పనులు వెంటనే జరిగేలా కృషి చేస్తామన్నారు. కేంద్ర మంత్రులతో మాట్లాడి సీసీఐ కొనుగోళ్లు ప్రారంభమయ్యేలా చూశామని తెలిపారు. పత్తి కొనుగోళ్లు సజావుగా జరుగుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎంపీ పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్​రెడ్డికి ఓటు వేసి భారీ మోజారిటీతో గెలిపించాలని ఎంపీ కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామిని ఎంపీ గడ్డం వంశీకృష్ణ సన్మానించారు. 

సీటు రావడానికి ఎమ్మెల్యే వివేక్​ కృషి

తనకు సీటు రావడానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ఎంతో కృషి చేశారని గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్​రెడ్డి అన్నారు. చెన్నూరులో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. పలుమార్లు పట్టభద్రులతో మాట్లాడి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, సర్వేలన్నీ అనుకూలంగా ఉన్నాయని సీఎం తనకు ఈ అవకాశం ఇచ్చారన్నారు. తనను ఆదరిస్తే ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారికి హెల్త్ కార్డులు, పట్టభద్రులకు రూ.3 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తానని హామీ ఇచ్చారు.