త్వరలో చెన్నూరులో 100 బెడ్ల ఆస్పత్రి : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

త్వరలో చెన్నూరులో 100 బెడ్ల ఆస్పత్రి : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
  • వచ్చే నెల 3 నుంచి ఫ్యామిలీ డిజిటల్ కార్డులు 
  • జనవరి నుంచి పేదలకు ఇందిరమ్మ ఇండ్లు 
  • ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నం
  • లబ్ధిదారులకు గ్యాస్ రాయితీ ధ్రువపత్రాలు, సీఎంఆర్ఎఫ్​చెక్కులు పంపిణీ

కోల్​బెల్ట్/జైపూర్/చెన్నూర్, వెలుగు: ప్రజలకు మరింత మెరుగైన ట్రీట్​మెంట్ అందించేందుకు చెన్నూరులో త్వరలో 100 బెడ్ల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఆస్పత్రికి అవసరమైన స్టాఫ్ ను ఇవ్వాలని సీఎం రేవంత్​రెడ్డిని కోరానని చెప్పారు. శనివారం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని జైపూర్, భీమారం మండల కేంద్రాలు, చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​లో లబ్ధిదారులకు గ్యాస్ రాయితీ ధ్రువపత్రాలు, సీఎం రిలీఫ్​ ఫండ్ చెక్కులను వివేక్ పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గ్యాస్​సబ్సిడీ డబ్బులు రావడం లేదని కొంతమంది నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయాన్ని సివిల్ సప్లయ్స్ మినిస్టర్ ఉత్తమ్​కుమార్​రెడ్డి దృష్టికి తీసుకెళ్లాను. ఆయన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిని కలిసి సమస్యను వివరించారు. త్వరలోనే రాష్ట్ర సర్కార్​సమస్యను పరిష్కరిస్తుంది” అని చెప్పారు. గత బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని మండిపడ్డారు. ‘‘కేసీఆర్ అవినీతికి పాల్పడి రూ.60 వేల కోట్ల అప్పులను రూ.7 లక్షల కోట్లకు పెంచారు. 

ఖజానా మొత్తం ఖాళీ చేశారు” అని ఫైర్ అయ్యారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా, తమ సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నదని చెప్పారు. ‘‘ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నది. అక్టోబర్​3 నుంచి ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అందజేస్తుంది. జనవరి నుంచి రేషన్ లో సన్నబియ్యం అందించనుంది. జనవరి నుంచి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తుంది. ఒక్కొక్క నియోజకవర్గానికి 3వేల ఇండ్లు మంజూరయ్యాయి” అని తెలిపారు. 

ఆఫీసర్లతో రివ్యూ.. 

నియోజకవర్గ అభివృద్ధికి అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని వివేక్ సూచించారు. శనివారం చెన్నూరు ఎంపీడీవో ఆఫీసులో జిల్లా కలెక్టర్ కుమార్​ దీపక్ అధ్యక్షతన వివిధ విభాగాల ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. ఇంటర్నల్ రోడ్ల ఏర్పాటుకు నివేదికలు రూపొందించాలని ఆదేశించారు.హెల్త్​ సిబ్బంది కొరత ఉంటే భర్తీకి చర్యలు తీసుకోవాలని, మున్సిపల్​పరిధిలో సమస్యలు పరిష్కారించాలని సూచించారు. 

పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమాల్లో క్యాతనపల్లి మున్సిపల్​చైర్​పర్సన్​ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్​రెడ్డి, డీఆర్​డీవో కిషన్, జైపూర్, చెన్నూరు తహసీల్దార్లు వనజారెడ్డి, మల్లికార్జున్, భీమారం మండల స్పెషల్​ఆఫీసర్​కల్పన, ఎంపీడీవోలు మధుసూదన్, మోహన్, చెన్నూరు మున్సిపల్​వైస్​చైర్మన్​నవాజ్ తదితరులు పాల్గొన్నారు. 

అమరవాదిలో మార్నింగ్ వాక్.. 

క్యాతనపల్లి మున్సిపాలిటీలోని అమరవాది గ్రామంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి శనివారం మార్నింగ్ వాక్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో రోడ్డు, డ్రైనేజీ, శ్మశానవాటిక నిర్మించాలని, బస్సు సౌకర్యం కల్పించాలని, స్కూల్​కు ప్రహరీ నిర్మించాలని, వెటర్నరీ ఆస్పత్రి భవనం పూర్తి చేయాలని గ్రామస్తులు కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వివేక్.. కొత్త రోడ్డు నిర్మాణానికి డీఎంఎఫ్​టీ ఫండ్స్​కేటాయిస్తానని, వెటర్నరీ ఆసుపత్రి భవనం అందుబాటులోకి తీసుకొస్తానని హామీ ఇచ్చారు.