జాతరలో చికెన్, మటన్, మందు అన్నీ పిరమే

  • యాట కోస్తే రూ.వెయ్యి, కాళ్లు, తలకాయ కాల్పిస్తే రూ.300
  • లైట్‍ బీర్‍ రూ.220.. స్ట్రాంగ్‍ రూ.250
  • కంట్రోల్ చేయని ఆఫీసర్లు..  పరేషాన్​లో భక్తులు

వరంగల్‍/మేడారం, వెలుగు: మరో రెండు రోజుల్లో సమ్మక్క, సారలమ్మల జాతర షురువైతది. కానీ మేడారంలో ఇప్పుడే అన్నిటి రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి. ఓ కొబ్బరికాయ కొట్టాలన్నా.. కోడి పిల్ల కోయాలన్నా.. రాత్రి పూట ఓ పెగ్‍ వేయాలన్నా రేట్లు చూసి భయపడాల్సిన పరిస్థితి. ఊదు పుల్ల నుంచి మొదలు పెడితే యాట పిల్ల వరకు రేట్లు ‘తగ్గేదేలె’ అంటున్నాయి. బయటి మార్కెట్​తో పోలిస్తే దాదాపు డబుల్ వసూలు చేస్తున్నారు. ఇచ్చే వస్తువుల్లో క్వాలిటీ ఉందా అంటే అదీ కనిపించడం లేదు. సెకండ్‍ గ్రేడ్‍ సరుకులు తీసి చేతిలో పెడితే అదే మహాభాగ్యం అని తీసుకుపోవాల్సి వస్తోంది. ఇప్పటికే పెరిగిన బస్సు చార్జీలకు తోడు జాతర ఖర్చు తడిసి మోపెడవుతోంది.  
 

వామ్మో.. ఇంత పిరమా? 
బయట రూ.15 నుంచి రూ.20 మధ్యలో దొరికే కొబ్బరికాయను జాతరలో రూ.30 నుంచి రూ.40 అమ్ముతున్నారు. కిలోన్నరకు అటుఇటుగా ఉండే కోడికి రూ.300 పెట్టాల్సిందే. పొతం చేయడానికి ఒక్కోదానికి రూ.60 తీసుకుంటున్నారు. నాటు కోడైతే రూ.450 నుంచి రూ.500 ఇవ్వాల్సిందే. యాట విషయానికి వస్తే కిలో రూ.900 నుంచి రూ.1000 ఉంది. ఇగ తలకాయ, కాళ్లు కాలిస్తే రూ.350 నుంచి రూ.400 తీసుకుంటున్నారు. గుండుకు రూ.100 నుంచి రూ.120, వాటర్‍ క్యాన్‍ రూ.60 నుంచి 70, పూల దండ రూ.100, రెండు లీటర్ల థమ్సప్, పెప్సీ బాటిల్‍ రూ.100 వసూలు చేస్తున్నారు. బయట రూ.30 నుంచి 40కి దొరికే చిన్న పిల్లల ఆట వస్తువులు రూ.100కు తక్కువ లేదు. శని, ఆదివారాల్లో రూంలు కిరాయికి తీసుకోవాలనుకునే వారు వాళ్లు చెప్పే రేటుకు వణికిపోవాల్సి వస్తోంది. అమ్మవారి గద్దెలకు ఉండే దూరం ఆధారంగా ఒక్కపూటకు రూ.1,000 నుంచి రూ.1,500 తీసుకుంటున్నరు. పాన్‍, సిగరెట్, చుట్ట, బీడీ లాంటివి కొనేటట్టు లేవు.  
 

లిక్కర్​ధర వింటే బెదరాల్సిందే
జాతరలో బీరు, విస్కీ, బ్రాండీ ధరలు భూమి మీద లేవు. లైట్‍ బీర్‍ బయట రూ.140 ఉండగా ఇక్కడ రూ.220, స్ట్రాంగ్‍ బీర్‍ బయట రూ.150 ఉండగా రూ.240 నుంచి రూ.250 వరకు అమ్ముతున్నారు. మామూలుగా వైన్స్​లో క్వార్టర్‍ రూ.200 నుంచి రూ.280 మధ్య దొరికేవి ఇక్కడ రూ.300 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారు. ఇవి చాలదన్నట్టుగా జీరో దందా చేస్తున్నారు. చాలాచోట్ల బ్రాండ్​మందుల్లో చీప్‍ లిక్కర్​మిక్స్​చేసి అంటగడుతున్నారు. జాతరలో వైన్‍ షాపులకు అఫిషియల్​గా పదుల సంఖ్యలో మాత్రమే పర్మిషన్‍ ఉండగా, అన్అఫిషియల్​గా వేలాది షాపులు నడుస్తున్నాయి. 
ఉప్పు, పప్పు..లిక్కర్‍ అన్నీ ఇంటి నుంచే జాతరలో ప్రతిసారి ఎక్కువ ధరలు వసూలు చేస్తుండడాన్ని గమనిస్తున్న చాలామంది భక్తులు ఉప్పు, పప్పు నుంచి మొదలుకుంటే కావాల్సినవన్నీ ఇంటి నుంచే తీసుకువెళ్తున్నారు. ఒకటో, రెండో ఫుల్‍ బాటిళ్లు కొనుక్కొని తీసుకువెళ్తున్నారు. సొంత వాహనాల్లో వెళ్లే వారైతే వాటర్‍ క్యాన్లు, గ్యాస్‍ పొయ్యిలు కూడా పట్టుకుపోతున్నారు.
 

ఏది కొందామన్న.. డబుల్‍ రేట్లు ఉన్నయ్‍ 
జాతరలో ఏది కొనాలన్నా డబుల్‍ రేటు పెట్టాల్సి వస్తోంది. బయట 200 దొరికే వస్తువులకు ఇక్కడ నాలుగు వందలు తీసుకుంటున్నారు. రూ.400 పెడితే తప్ప కిలో చికెన్‍ రావడం లేదు. ఇక జాతర ప్రాంతంలో లిక్కర్‍ కొనే పరిస్థితి అస్సలు కనిపించడం లేదు. 
                                                                                                                                                                                                              - ముప్పిడోజు పవన్‍, హనుమకొండ 
ఇంటి దగ్గర నుంచే పట్టుకొచ్చాం
మా చిన్నప్పటి నుంచి మేడారం జాతరకు వస్తున్నం. ఏ వస్తువు కొనాలన్నా రేట్లు మస్తు చెప్తుంటరు. అందుకే దాదాపు వంట సామాన్లు, లిక్కర్‍ ఇట్లా అన్నీ మా వెహికల్​లో పెట్టుకుని తీసుకువచ్చినం. ఇక్కడ డబుల్​రేట్లు పెట్టే కంటే ఇంటి దగ్గరి నుంచి తీసుకువస్తే వెహికల్​కిరాయి ఎల్లిపోతది.
                                                                                                                                                                                                                   – కందికొండ యాదగిరి, వరంగల్‍