25న మెదక్​కు సీఎం రేవంత్ రెడ్డి రాక..

 25న మెదక్​కు సీఎం రేవంత్ రెడ్డి రాక..
  • మెదక్ చర్చి, ఏడుపాయల సందర్శన
  • ఏర్పాట్లపై కలెక్టర్ దృష్టి

మెదక్, పాపన్నపేట, వెలుగు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 25 న మెదక్ జిల్లాలో పర్యటించనున్నట్టు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మెదక్ చర్చి వందేళ్ల వేడుకలో సీఎం పాల్గొంటారని తెలిపారు. అనంతరం ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ఏడుపాయల వన దుర్గా భవాని మాతా ఆలయాన్ని సందర్శిస్తారని వెల్లడించారు. 

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. శుక్రవారం సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ ఏడుపాయలలో  పర్యటించారు. వన దుర్గా మాత ఆలయ ప్రాంగణం,  పార్కింగ్ ప్రదేశాలు, హెలీప్యాడ్ ప్రదేశాలను పరిశీలించి ఏర్పాట్లపై సూచనలు చేశారు. అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. 

దివ్యాంగులు అవకాశాలను అందిపుచ్చుకోవాలి

మెదక్​ టౌన్​, వెలుగు: దివ్యాంగులు అందరితో సమానంగా అవకాశాలను అందిపుచ్చుకోవాలని మెదక్​ కలెక్టర్​ రాహుల్​రాజ్​ అన్నారు. శుక్రవారం జిల్లా ఆసుపత్రిలో  నిర్వహించిన  దివ్యాంగ వైద్య శిబిరంలో కలెక్టర్​ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  దివ్యాంగులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు.  

అనారోగ్యంలో ఉన్నవారికి ఉచిత నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.  దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల రెండో మంగళవారం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్​వో  శ్రీరామ్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్​శివదయాల్, వైద్యులు,  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.