మళ్లీ నిలిచిపోయిన చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులు!

మళ్లీ నిలిచిపోయిన  చిన్నోనిపల్లి రిజర్వాయర్  పనులు!
  • ఊరు ఖాళీ చేశాక పనులు చేయడం లేదంటున్న నిర్వాసితులు
  • ఆర్అండ్ఆర్  సెంటర్ లో సౌలతులు లేక తిప్పలు
  • ఖాళీ షెడ్​లోనే స్కూల్  నడుస్తున్నా పట్టించుకోని ఆఫీసర్లు


గద్వాల, వెలుగు: చిన్నోనిపల్లి రిజర్వాయర్  పనులు మళ్లీ నిలిచిపోయాయి. పనులు చేయాలనే ఉద్దేశంతో ఆర్అండ్ఆర్  సెంటర్ లో సౌలతులు లేకున్నా తమను బలవంతంగా ఖాళీ చేయించి ఇప్పుడు పనులు నిలిపేశారని నిర్వాసితులు వాపోతున్నారు. ఆయకట్టు లేకున్నా రిజర్వాయర్  ఎందుకు నిర్మిస్తున్నారని ప్రశ్నిస్తూ గ్రామస్తులు పోరాటం  చేశారు. ఎన్నికల ముందు రిజర్వాయర్  నిర్మాణం పేరుతో హడావుడి చేసి, ఆ తర్వాత ఊరుని ఖాళీ చేయించారు.

పెండింగ్  పనులతో తిప్పలు

నెట్టెంపాడు లిఫ్ట్​లో భాగంగా గట్టు మండలం చిన్నోనిపల్లి రిజర్వాయర్  నిర్మిస్తున్నారు. గత ప్రభుత్వం రిజర్వాయర్  పనులను నిర్లక్ష్యం చేసింది. కట్ట రివిట్ మెంట్  పనులతో పాటు తూము నిర్మాణం, కాలువల నిర్మాణం పెండింగ్ లోనే ఉన్నాయి.

నాలుగు నెలల కింద పనులు కంప్లీట్  చేస్తామని చెప్పిఆఫీసర్లు  గ్రామాన్ని  బలవంతంగా ఖాళీ చేయించారు. ఊరు ఖాళీ చేసే సమయంలో పనులు చేసిన కాంట్రాక్టర్, ఆ తరువాత పనులు నిలిపేశాడు. రిజర్వాయర్ లోని అసైన్డ్  భూమికి సంబంధించిన పరిహారం కొట్టేసేందుకు కొందరు లీడర్లు నీటిని నింపారని 
విమర్శలున్నాయి.

ఆర్అండ్ఆర్  సెంటర్ లో సౌలతుల్లేవ్..

చిన్నోనిపల్లి నిర్వాసితుల కోసం చేపట్టిన ఆర్అండ్ఆర్ సెంటర్ లో సౌలతులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేయలేదని, స్కూల్  బిల్డింగ్  కంప్లీట్ చేయలేదని నిర్వాసితులు వాపోతున్నారు. లైట్లు పెట్టి, ఊర్లో ఉన్న బోర్లకు కనెక్షన్  ఇచ్చేసి డబ్బులు దండుకున్నారని ఆరోపిస్తున్నారు. 

రెండు నెలల్లో స్కూల్  బిల్డింగ్  కంప్లీట్ చేస్తామని కలెక్టర్​ చెప్పారని, ఇప్పటివరకు కంప్లీట్  కాకపోవడంతో రేకుల షెడ్​ కింద స్కూల్  నడపాల్సిన పరిస్థితి ఉందన్నారు. గ్రామంలో సౌలతులు లేకపోవడంతో 250 ఫ్యామిలీలకు గాను.. 40 ఫ్యామిలీలు మాత్రమే ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. ఊరి చుట్టూ ఉన్న రోడ్లను కబ్జా చేశారని వాపోయారు.

షిఫ్టింగ్​ చార్జీలు ఇయ్యలే..

రిజర్వాయర్  నిర్మించే సమయంలో చిన్నోనిపల్లిలో 250 ఇండ్లు ఉన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. అన్ని ఇండ్లకు పరిహారం ఇవ్వాల్సి ఉండగా, 16 ఇండ్లకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 60 ఇండ్లకు షిఫ్టింగ్  చార్జీలు ఇవ్వలేదు. ఆర్అండ్ఆర్  సెంటర్ లో 360 ప్లాట్లు ఇవ్వాల్సి ఉండగా.. 250 మందికి మాత్రమే ప్లాట్లు ఇచ్చారు. 

ఇటీవల ఊరు ఖాళీ చేసే సమయంలో ఎమర్జెన్సీ ఫండ్  కింద కలెక్టర్  ఒక్కో ఫ్యామిలీకి రూ.16,500 చెల్లిస్తామని చెప్పారు. అయితే సగం మందికి మాత్రమే ఇచ్చారని గ్రామస్తులు తెలిపారు. ఒకవైపు పనులు చేయడం లేదని, ఆర్అండ్ఆర్  సెంటర్ లో సౌలతులు కల్పించలేదని, షిఫ్టింగ్​ చార్జెస్  ఇవ్వకుండా తమను నిండా ముంచారని నిర్వాసితులు వాపోతున్నారు.

పనులు కంప్లీట్ చేస్తాం..

చిన్నోనిపల్లి రిజర్వాయర్  పనులను కంప్లీట్  చేస్తాం. 60సి కింద వేరే కాంట్రాక్టర్ కు పనులు అప్పగించాం. ప్రస్తుతం రిజర్వాయర్  దగ్గర పొలాలు కోత దశలో ఉండడం వల్ల పనులకు కొంత ఆటంకం కలుగుతోంది. ఆర్అండ్ఆర్​ కాలనీలో సౌలతులు కల్పిస్తాం. రహీముద్దీన్, ఎన్సీ నెట్టెంపాడు ప్రాజెక్టు