ఆర్గాన్​ డొనేషన్​ డొంక కదిలేనా?

ఆర్గాన్​ డొనేషన్​ డొంక కదిలేనా?
  • అలకనంద హాస్పిటల్​లో కిడ్నీ రాకెట్​తో మరోసారి తెరపైకి..
  • గత ఆగస్టులో మంచిర్యాలలో ఆర్గాన్ డొనేషన్​పై వివాదం 
  • అంబులెన్సు డ్రైవర్లు, డాక్టర్లు, హాస్పిటల్స్​ పాత్రపై ఆరోపణలు 
  • ఈ వ్యవహారంలో రూ.లక్షలు చేతులు మారాయని ఆరోపణలు 
  • సీఐడీ ఎంక్వైరీకి ఆదేశించిన హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ

మంచిర్యాల, వెలుగు: హైదరాబాద్​లోని అలకనంద హాస్పిటల్​లో బయటపడ్డ కిడ్నీ రాకెట్​తో పాటు గతంలో బ్రెయిన్​ డెత్​ కేసుల పేరిట వివిధ హాస్పిటళ్లలో జరిగిన ఆర్గాన్​ డొనేషన్​ దందాపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. దీంతో గత ఆగస్టులో మంచిర్యాలలో సంచలనం సృష్టించిన ఆర్గాన్​ డొనేషన్​ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. 

జైపూర్​ మండలం శెట్​పల్లి గ్రామానికి చెందిన రేవెల్లి శ్రీకాంత్​ కేసులో పోలీసులు తూతూమంత్రంగా విచారణ జరిపి చేతులు దులిపేసుకున్నారని, ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో పైసలు చేతులు మారాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశాన్ని రాష్ర్ట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఎంక్వైరీకి ఆదేశాలివ్వడం చర్చనీయాంశంగా మారింది. 

తప్పుదారి పట్టించిన అంబులెన్స్​ డ్రైవర్లు... 

శెట్​పల్లికి చెందిన రేవెల్లి శ్రీకాంత్​ (35) నిరుడు ఆగస్టు 6న గ్రామ పంచాయతీ ట్రాక్టర్​ ఢీకొనడంతో తల పగిలింది. కుటుంబసభ్యులు మంచిర్యాలలోని మయూరి హాస్పిటల్​కు తీసుకెళ్లగా కండిషన్​ సీరియస్​గా ఉండని డాక్టర్లు కరీంనగర్​లోని భద్రకాళి హాస్పిటల్​కు రెఫర్​ చేశారు. అతడిని అంబులెన్స్​లో ​తీసుకెళ్తుండగా కొంతమంది అంబులెన్స్​ డ్రైవర్లు మధ్యలో కలుగజేసుకొని వారితో పాటు వెళ్లారు.  శ్రీకాంత్​ భార్య స్వప్న, కుటుంబీకులను తప్పుదారి పట్టించి భద్రకాళికి కాకుండా కెల్విన్​ హాస్పిటల్​కు తీసుకెళ్లారు. 

 అక్కడి డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్​లోని యశోద హాస్పిటల్​కు వెళ్తుండగా మళ్లీ అంబులెన్స్​ డ్రైవర్లు కలుగజేసుకుని కామినేని హాస్పిటల్​కు తీసుకెళ్లారు. మార్గ మధ్యలో ఉండగానే యాదగిరి అనే వ్యక్తి స్వప్నకు ఫోన్​ చేసి కామినేని హాస్పిటల్​లో డిస్కౌంట్​ ఉంటుందని మాయమాటలు చెప్పాడు. 8న శ్రీకాంత్​ బ్రెయిన్​ డెత్​ అయినట్టు డాక్టర్లు నిర్ధారించి జీవన్​దాన్​ ట్రస్టు ద్వారా ఆర్గాన్​ డొనేషన్​ చేయాలని పేషెంట్​ కుటుంబీలను ఒప్పించి ఏడు అవయవాలు తీసుకున్నారు. ఇందుకుగాను వారికి రూ.3 లక్షలు ఇచ్చారు. 

తూతూమంత్రంగా విచారణ.... 

శ్రీకాంత్​ భార్య స్వప్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మంచిర్యాల టౌన్​ పోలీసులు ఆర్గాన్​ డొనేషన్​ వ్యవహారంపై విచారణ చేపట్టారు. అప్పటి సీఐ బన్సీలాల్​ కరీంనగర్​లోని కెల్విన్​ హాస్పిటల్​కు, హైదరాబాద్​లోని కామినేని హాస్పిటల్​కు వెళ్లి ఎంక్వైరీ చేశారు. చివరకు అంబులెన్స్​ డ్రైవర్లు కమీషన్ల కోసం శ్రీకాంత్​ కుటుంబీలకును తప్పుదారి పట్టించారని, ఆర్గాన్​ డొనేషన్​కు డబ్బులు తీసుకున్నారని తప్పుడు ప్రచారం చేశారని తేల్చి ఐదుగురిని అరెస్టు చేశారు. 

ఈ కేసులో సాంకేతిక ఆధారాలు, హైదరాబాద్​లో వీరికి సహకరించిన వ్యక్తుల గురించి ఎంక్వైరీ చేయాల్సి ఉంటుందని డీసీపీ భాస్కర్​ పేర్కొని నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఈ కేసు ఊసే లేకపోవడం గమనార్హం. కెల్విన్​ హాస్పిటల్​ నిర్వాహకులు పలుమార్లు మంచిర్యాలకు వచ్చి పోలీసులను కలవడం, ఆపై కేసు ముందుకు సాగకపోవడంపై ఆప్పట్లోనే పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆర్గాన్​ డొనేషన్​ తర్వాత హాస్పిటల్​ వాళ్లు తమకు రూ.3లక్షలు ఇచ్చారని, ఈ వ్యవహారంలో లక్షలు చేతులు మారాయని శ్రీకాంత్​ భార్య స్వప్న, అతడి బావమరిది బహిరంగంగా వెల్లడించినా ఆ దిశగా కేసు దర్యాప్తు జరగలేదు. ఈ నేపథ్యంలో సీబీఐ ఎంక్వైరీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.