- మూడు సీజన్ల వడ్లు మిల్లుల్లోనే
- గడువు ముగిసినా సీఎంఆర్ ఇవ్వలే
- తాజాగా 2.08 లక్షల టన్నుల వడ్లు అప్పగింత
- మిల్లుల్లో 3.48 లక్షల టన్నుల ధాన్యం
- విలువ రూ.767 కోట్లు
యాదాద్రి, వెలుగు : సీఎంఆర్ కోసం మిల్లర్లకు సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ శాఖ వడ్లు ఇస్తూనే ఉంది. అయినా ఏ సీజన్ లో కూడా మిల్లర్లు బియ్యం కంప్లీట్ చేయడం లేదు. ఎప్పుడూ తమ వద్దే వడ్లు పెండింగ్‌లో పెట్టుకుంటున్నారు. దీంతో మూడు సీజన్ల వడ్లు మిల్లుల్లోనే పేరుకుపోయాయి. రైతుల వద్ద నుంచి ఏటా రెండుసార్లు యాసంగి, వానాకాలం సీజన్లలో ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేస్తోంది. ఈ వడ్లను మిల్లర్లకు అప్పగించి.. వారి నుంచి బియ్యం సేకరిస్తోంది. మిల్లర్లకు పైసా పెట్టుబడి లేకుండా కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) వడ్లను అప్పగిస్తోంది. అయినా బియ్యం అప్పగించడంలో మిల్లర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న వడ్లతోనే కొందరు మిల్లర్లు బిజినెస్ చేసుకుంటున్నారు. ఒక సీజన్ వడ్లను మరో సీజన్‌కు చూపిస్తూ కాలం గడుపుతున్నారు. దీంతో యాదాద్రి జిల్లాలోని మూడు సీజన్ల వడ్లు మిల్లుల్లోనే ఉండిపోయాయి.
గడువు ముగిసినా సీఎంఆర్ ఇవ్వలే..
2023–24 యాసంగి సీజన్లో 2,70,635 టన్నుల వడ్లను సీఎంఆర్ కోసం సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ మిల్లులకు అప్పగించింది. ఈ వడ్లను మరాడించి బియ్యం అప్పగించాల్సిన మిల్లర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 15తో సీఎంఆర్ గడువు ముగిసినా.. పూర్తి స్థాయిలో అప్పగించలేదు. ఈ సీజన్‌కు సంబంధించి రూ.151 కోట్ల విలువైన 72,114 టన్నుల వడ్లు మిల్లుల్లోనే ఉన్నాయి. ఏడాది కావస్తున్నా ఇప్పటివరకు 20 శాతం బియ్యం అప్పగించని మిల్లులు కూడా ఉన్నాయి.
ప్రస్తుత సీజన్లో 2.08 లక్షల టన్నులు..
ఇప్పటికే రెండు సీజన్లకు చెందిన 1,39,114 టన్నుల వడ్లు మిల్లుల్లో స్టాక్‌గా ఉన్నాయి. తాజాగా 2024 వానాకాలం సీజన్‌కు సంబంధించిన 2.08 లక్షల టన్నుల వడ్లను సివిల్ సప్లయ్ కొనుగోలు చేసింది. రూ.482 కోట్ల విలువైన వడ్లను జిల్లాలోని మిల్లులకు సీఎంఆర్ కోసం సరఫరా చేసింది.
మిల్లుల్లో రూ.767 కోట్ల విలువైన వడ్లు..
యాదాద్రి జిల్లాలోని మిల్లుల్లో వడ్లు పేరుకుపోయాయి. ఈ మూడు సీజన్లకు సంబంధించి రూ.767 కోట్ల విలువైన 3.47 టన్నుల వడ్లు మిల్లర్ల వద్దే ఉన్నాయి. మిల్లర్లలో ఇప్పటికే ఇద్దరు డిఫాల్టర్లుగా ఉన్నారు. వీరిద్దరూ కలిసి రూ.15.25 కోట్ల విలువైన వడ్లను అమ్మేసుకున్నారు. ఈ మిల్లులపై కేసులు నమోదయ్యాయి.
2022–23 యాసంగి వడ్లు 67 వేల టన్నులు..
2022–23 యాసంగి సీజన్‌కు చెందిన 4 లక్షల టన్నుల వడ్లను కొనుగోలు చేసిన సివిల్ సప్లయ్ శాఖ 40 మిల్లుకు అప్పగించింది. కాలం గడుస్తున్నా.. సీఎంఆర్ అప్పగించకపోవడంతో 1.86 లక్షల టన్నుల వడ్లకు ఈ– టెండర్ వేసి కేంద్రీయ బండార్ సంస్థకు అప్పగించింది. టెండర్ వేసి ఏడాది కావస్తున్నా.. ఇప్పటివరకు ఒకరిద్దరు మిల్లర్లు తప్ప మిగిలిన వారు క్లియర్ చేయలేదు. ఒక మిల్లర్ రూ.10 కోట్ల విలువైన వడ్లను అమ్ముకొని ఏకంగా జెండా ఎత్తేశాడు. ఈ సీజన్‌కు సంబంధించి మొత్తంగా రూ.134 కోట్ల విలువైన 67 వేల టన్నుల వడ్లు అప్పగించాల్సి ఉంది.