
- ప్రైవేట్‌బస్సు అద్దాలు ధ్వంసం
- బైక్ తగలబెట్టిన ఆందోళనకారులు
- కోర్టులో కేసున్నా అమ్మకాలు
- వేరే వారికి అనుకూల తీర్పు
- స్వాధీనానికి రావడంతో లొల్లి
అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ పరిధి కమ్మగూడలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్వే నెంబర్ 240లో 10.09 ఎకరాల భూమి ఓ మహిళకు చెందినదని కోర్టు తీర్పు ఇవ్వడంతో వారు స్వాధీనం చేసుకునేందుకు రాగా ఆ భూములు కొన్నవారు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగి బస్సు అద్దాల పగలగొట్టడంతో పాటు ఓ బైక్‌ను కాలబెట్టే వరకూ వెళ్లింది.1983లో కమ్మగూడ సర్వే నంబర్240లోని పదెకరాల్లో ఉమ్మడి కుటుంబం వెంచర్వేసింది. తర్వాత ప్లాట్ల అమ్మకం మొదలుపెట్టింది. అయితే, కుటుంబ సభ్యుల మధ్య భూవివాదం తలెత్తడంతో 1984లో కోర్టుకు వెళ్లారు. కానీ, పది ఎకరాల్లో ప్లాట్ల క్రయ విక్రయాలు ఆగలేదు. సుమారు 300 మంది వరకు ప్లాట్లు కొన్నారు. చాలా మంది ఇండ్లు కూడా కట్టుకున్నారు. కోర్టులో కేసు నడుస్తున్న విషయం ఇండ్లు కట్టుకుని ఉంటున్న వారికి తెలియదు.
దీనికి సంబంధించిన తీర్పు 2024 సెప్టెంబర్‌లో వచ్చింది. వెంచర్ వేసి అమ్మినవారికి కాకుండా వేరే కుటుంబానికి అనుకూలంగా తీర్పు రావడంతో విషయం తెలియక స్థలాలు కొన్నవారు ఆందోళనలో ఉన్నారు. తీర్పు అనుకూలంగా వచ్చిన వారు10 రోజుల కింద వచ్చి కొన్ని ప్లాట్లలో కడీలు, హద్దులను తొలగించారు. బుధవారం తెల్లవారుజామున మరోసారి వచ్చి మరికొన్ని ప్లాట్ల కడీలు, ప్రీ కాస్ట్గోడలను కూల్చివేస్తుండగా, ఇండ్లు నిర్మించుకొని ఉంటున్న వారు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పలువురు గాయపడ్డారు. కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిన వారు ప్రైవేట్బస్సులో రాగా దాని అద్దాలను ధ్వంసం చేశారు. ఒక బైక్ కు నిప్పు పెట్టారు. మరో బైక్ ను ధ్వంసం చేశారు. జేసీబీ అద్దాలు పగలగొట్టారు. దీంతో పరిస్థితి అదుపు తప్పుతుండడం, స్థానికులు పెద్ద సంఖ్యలో గుమిగూడి తిరగబడడంతో కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిన వారు వెళ్లిపోయారు. గొడవ జరుగుతున్నప్పుడు నలుగురు కానిస్టేబుల్స్ఉన్నా కంట్రోల్చేయలేకపోయారు.
అధికారుల తప్పిదంతోనే...
భూమి విషయమై కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు క్రయ విక్రయాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపల్, రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులపై ఉంటుంది. రిజిస్ట్రేషన్లు అయితే అస్సలే చేయకూడదు. కానీ, 1984 నుంచి కేసు నడుస్తున్నా క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. అధికారులు రిజిస్ట్రేషన్లు కూడా చేస్తున్నారు. మున్సిపాలిటీ ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తోంది. ఇండ్లు కట్టుకోవడానికి పర్మిషన్లు కూడా ఇస్తోంది. పన్నులు వసూలు చేస్తోంది. దీంతో చాలామంది స్థలాలు కొనుక్కుని ఇండ్లు కట్టుకుంటున్నారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఎమ్మెల్యే దగ్గరకు చేరిన పంచాయితీ...
కాగా, గొడవ తర్వాత ఇరు వర్గాలు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే వద్దకు వెళ్లారు. అయితే, అక్కడ ఓ చెట్టుకు తేనె తెట్టే ఉండడంతో దానిపైకి ఎవరో కావాలనే రాయి విసిరారు. దీంతో తేనెటీగలు వెంటపడడంతో అక్కడున్న వారంతా తలోదిక్కుకు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో కొంతమంది గాయపడ్డారు.