
- పూతను కాపాడేందుకు ప్రయత్నాలు
- రక్షణ చర్యలతో పెరుగుతున్న ఆర్థిక భారం
బెజ్జంకికి చెందిన రైతు బోయినపల్లి శ్రీనివాసరావు ఆరెకరాల్లో మామిడి సాగు చేస్తున్నాడు. ఈసారి వాతావరణ మార్పుల వల్ల యాభై శాతమే పూత వచ్చింది. అది కూడా చాలావరకు రాలిపోవడమే కాకుండా నల్లబడుతోంది. మిగిలిన ఆ కాస్త పూతను కాపాడేందుకు సస్య రక్షణ చర్యల కోసం దాదాపు లక్ష రూపాయలు ఖర్చు చేశాడు.
ఇలా ఒక్క శ్రీనివాస్ మాత్రమే కాదు సిద్దిపేట జిల్లాలోని మామిడి రైతులందరూ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆశించిన పూత రాకపోవడంతో దిగుబడి తగ్గి పెట్టుబడి డబ్బులు మీద పడుతాయేమోనని మామిడి రైతులు దిగాలు చెందుతున్నారు.
సిద్దిపేట, వెలుగు: జిల్లాలో దాదాపు 30 వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగుచేస్తున్నారు. కొన్నేళ్లుగా మామిడి రైతులను వాతావరణ పరిస్థితులు కలవర పెడుతున్నాయి. సాధారణంగా నవంబర్, డిసెంబర్ లో రావాల్సిన మామిడి పూత ఈ సీజన్ లో జనవరి నెలాఖరులో వచ్చింది.
అది కూడా రాలిపోతూ నల్లబడుతోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పటికీ పూతరాని మామిడి తోటలు ఉన్నాయి. జిల్లాలోని జగదేవ్ పూర్, నంగునూరు, ములుగు, చిన్నకోడూరు, సిద్దిపేట, చేర్యాల, మద్దూరు మండలాలతో పాటు బెజ్జంకి మండలం బేగంపేట్, వడ్లూరు, గుండారం,తోటపల్లి, చిలాపూర్, దేవక్కపల్లి, దాచారం, గాగిలాపూర్ గ్రామాల్లో ఐదు వందల ఎకరాల్లో మామిడి తోటలు సాగుచేస్తున్నారు. వీరందరూ పూత సమస్యతో ఆందోళన చెందుతున్నారు.
దిగుబడిపై ప్రభావం
జిల్లాలో సాగవుతున్న మామిడిలో ఎక్కువ శాతం ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుండగా కొంత మేర మాత్రమే జిల్లాలో అమ్ముతున్నారు. ఈ సీజన్లో పూత దక్కకపోవడంతో దిగుబడి తగ్గి పెట్టుబడి ఖర్చులు పెరగడంతో రైతులు నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు జిల్లా అవసరాలకు మామిడిని దిగుమతి చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో మధుర ఫలం మరింత ప్రియంగా మారే అవకాశాలు ఉన్నాయి.
ఇటీవల హార్టికల్చర్ అధికారులు నంగునూరు, కోహెడ, బెజ్జంకి మండలాల్లోని మామిడి తోటల్లో పర్యటించి సమస్యను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మామిడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వారి సూచన మేరకు చెట్లపై రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. దీనివల్ల రైతులపై మరింత ఆర్థిక భారం పడుతోంది.
వాతావరణ మార్పుల వల్ల ప్రస్తుత సీజన్ లో పూత రాలే పరిస్థితి ఏర్పడింది. క్షేత్రస్థాయిలో తోటలను పర్యటించి సమస్యను తెలుసుకొని మిగిలిన పూతను కాపాడే విధంగా సూచనలు అందిస్తున్నాం. పూత రాలిపోతుందని రైతులు దిగులు చెందక రక్షణ చర్యలు చేపడితే కొంతలో కొంత నష్టాన్ని నివారించవచ్చు.- మౌనిక, హార్టికల్చర్ ఆఫీసర్, సిద్దిపేట