
ఆదిలాబాద్, వెలుగు: పైలట్ ప్రాజెక్టు కింద ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఐఎఫ్‌సీ సెంటర్లలో ఈనెల 27 నుంచి నిర్వహిస్తున్న సీఎం ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన వస్తోందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ రూరల్ మండలంలో ఏర్పాటు చేసిన ఇన్ఫర్మేషన్ ఫెసిలిటీ సెంటర్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు.
మండల ప్రజావాణి కేంద్రాన్ని, గ్రామసభలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. అర్జీదారులు అందిస్తున్న దరఖాస్తుల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల స్టేటస్‌ను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ మహిళా శక్తి, చెక్ డ్యామ్, పొలం బాట రోడ్లకు సంబంధించి మంజూరైన పనులను రెండు నెలల్లోగా పూర్తిచేయాలన్నారు. ఈ నెల 21 నుండి 24 వరకు నిర్వహించిన గ్రామసభలో 1,038 అప్లికేషన్లు వచ్చాయని, వాటి డేటా ఎంట్రీ పూర్తిచేస్తున్నట్లు తెలిపారు.