- ఎమ్మెల్సీ కవిత
ఆసిఫాబాద్/జైనూర్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని, ఆయన రాజకీయం మాత్రమే చేస్తున్నాడని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. సోమవారం అసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఇంట్లో మీడియాతో మాట్లాడారు. వాంకిడి ఆశ్రమ పాఠశాల ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రభుత్వం పట్టింపు లేకుండా వ్యవహరిస్తోందన్నారు.
హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్‌తో చనిపోయిన పిల్లల ఫ్యామిలీలకు రూ. 50 లక్షల ఎక్సేగ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతకుముందు జైనూర్ మండలం దేవుగూడలో ఆటో డ్రైవర్ చేతిలో హత్యాయత్నానికి గురైన మెస్రం నీలాబాయిని పరామర్శించి రూ. 2 లక్షల ఆర్థికసాయం అందించారు. అనంతరం దేవుగూడలో ఆదివాసీ మహిళలతో ముచ్చటించి, వారితో కలిసి సంప్రదాయ నృత్యాలు చేశారు.
తర్వాత ఫుడ్ పాయిజన్‌తో చనిపోయిన వాంకిడి మండలం దాబా గ్రామానికి చెందిన స్టూడెంట్ చౌదరి శైలజ కుటుంబసభ్యులను పరామర్శించి రూ. 2 లక్షల సాయం చేశారు. ఆమె వెంట భోద్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, కుమ్రంభీం మనవడు కుమ్ర సోనేరావు, ఆదిలాబాద్ జడ్పీ మాజీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ ఉన్నారు.