రిక్రూట్​మెంట్లలో మాది రికార్డ్​

  • ఏడాదిలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసినం: సీఎం రేవంత్​
  • నియామకాలపై కుట్రలు చేసినా నేను వెనక్కి తగ్గలే
  • పరీక్షలు వాయిదా పడ్తే నిరుద్యోగుల బాధ ఎట్లుంటదో నాకు తెలుసు
  • ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ తెచ్చుకుంటే గత సర్కార్​ పట్టించుకోలే
  • ప్రజా ప్రభుత్వం భర్తీ చేస్తుంటే అడ్డుకోవాలని కొందరు ప్రయత్నించిన్రు
  • రుణమాఫీతో రైతుల ఖాతాలు గల గల..  బీఆర్​ఎస్​ గుండెల్లో పిడుగులు
  • పదేండ్లు మనమే ఉంటం.. సన్న వడ్లు పండించండి.. బోనస్​ ఇస్తం
  • దేశంలోనే ఎక్కువ మంది డాక్టర్లు మన దగ్గర తయారు కావాలి
  • ఆరోగ్య ఉత్సవాల్లో ముఖ్యమంత్రి ప్రసంగం

హైదరాబాద్, వెలుగు: తమ ప్రజా ప్రభుత్వం విద్య, వైద్యానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నదని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. 75 ఏండ్ల స్వతంత్ర్య భారత చరిత్రలో ఏడాదిలో 50 వేల ఉద్యోగాలు ఏ రాష్ట్రమూ ఇయ్యలేదని, కానీ రాష్ట్రంలో తాము ఇచ్చామని చెప్పారు. ఏడాదిలో వైద్యారోగ్య శాఖలో 14 వేల మంది నియామకం కూడా ఒక రికార్డు అని పేర్కొన్నారు.  ‘‘ప్రభుత్వం నోటిఫికేషన్​ ఇచ్చిందంటే ఫలితాలు ప్రకటించి, నియామకపత్రాలు ఇస్తుందనే నమ్మకం నిరుద్యోగుల్లో ఉంటుంది. ఆ నమ్మకంతోనే పోటీ పరీక్షలకు ప్రిపేర్​ అవుతారు. కానీ, కొందరు పొలిటికల్​ కారణాలతో నియామకాలను అడ్డుకోవాలని చూశారు. డీఎస్సీ నోటిఫికేషన్​ ఇచ్చినప్పుడు వాయిదా వేయాలని ఆందోళన చేపట్టారు.  గ్రూప్​ 1 వాయిదా వేయాలని సుప్రీంకోర్టు దాకా పోయారు. కానీ, నేను వెనక్కి తగ్గలేదు. త్వరలో 563 మంది గ్రూప్​ 1 అధికారులు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారు’’ అని పేర్కొన్నారు.

నియామక పరీక్షలు వాయిదా పడితే నిరుద్యోగులు పడే బాధ ఎలాంటిదో తనకు తెలుసన్నారు. ‘‘ఏం పోయే కాలం ఈ సీఎంకు.. పరీక్షలు వాయిదా వేయాలంటే వేస్తలేరని ఎంతోమంది నన్ను తిట్టిన్రు. కానీ, ఒకటే నిర్ణయించుకున్న. వాయిదాలు వేస్తే లక్షలాది మంది నిరుద్యోగులు తల్లిదండ్రులకు భారం అయితరని, ఆ భారం మోయలేని పరిస్థితిలో తల్లిదండ్రులకు ముఖం చూపించలేక ప్రాణాలు తీసుకుంటారని తెలిసి.. పరీక్షలు వాయిదా వేయలేదు’’ అని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మన ఉద్యోగాలు మనకు వస్తలేవని.. నిరుద్యోగులు తెలంగాణ కోసం పోరాటం చేశారని, వారి ఆకాంక్షలు నెరవేరుస్తున్నామని తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సోమవారం  హైదరాబాద్​ ఎన్టీఆర్ మార్గ్‌‌లోని హెచ్‌‌ఎండీఏ గ్రౌండ్స్‌‌లో  నిర్వహించిన  ఆరోగ్య ఉత్సవాల్లో సీఎం రేవంత్​ మాట్లాడారు. 

Also Read : అప్పుల కిస్తీలు, మిత్తీలకే 64,516 కోట్లు

టీజీపీఎస్సీని ప్రక్షాళించినం

టీజీపీఎస్సీ ప్రక్షాళన తమ పనితనానికి గీటురాయి అని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు.  ‘‘చిన్న ఆరోపణ లేకుండా పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ పనిచేస్తున్నది. ఇప్పుడు మహేందర్​ రెడ్డి స్థానంలో అతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన సీనియర్​ ఐఏఎస్​ బుర్రా వెంకటేశంను చైర్మన్​గా వేసినం. మేం పొలిటికల్​ రిహాబిలిటేషన్​ సెంటర్​గా టీజీపీఎస్సీని మార్చలేదు. అక్కడ పనిచేసే వాళ్లకు చిత్తశుద్ధి, అవగాహన ఉండాలి. గతంలో పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ మెంబర్లు​ ఎవరయ్యా అంటే.. ఆర్​ఎంపీ డాక్టర్​, డిప్యూటీ తహసీల్దార్​ లాంటోళ్లను వేశారు. కలెక్టర్​ను సెక్షన్​ ఆఫీసర్​ సెలెక్ట్​ చేయలేడు కదా?  రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిన్రు. భ్రష్టు పట్టించిన్రు. యూనివర్సిటీలకు సంవత్సరాల కొద్దీ వైస్​ చాన్స్​లర్లు లేకుండె.

 పది యూనివర్సిటీలకు వీసీలను నియమించినం. వర్సిటీల్లో ఉండే టీచింగ్​, నాన్​ టీచింగ్​ వేకెన్సీలను నింపాలని ఆదేశాలు ఇచ్చినం” అని వెల్లడించారు.  ‘‘లక్షలాది మంది నిరుద్యోగులు నినదిస్తే రాష్ట్రం సాధించుకున్నం. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాల్లో తెలంగాణ యువతకు అన్యాయం జరుగుతుందనే రోడ్డెక్కి తెలంగాణ తెచ్చుకున్నం. పదేండ్లు పాలించిన గత పాలకులు  ఖాళీలను భర్తీ చేయలేదు. నోటిఫికేషన్లు ఇస్తే ప్రశ్నాపత్రాలు జిరాక్స్​ సెంటర్లలో అమ్ముకునే పరిస్థితి. గ్రూప్​ 1,2,3,4  , టీచర్ల నియామకం, పోలీసు సిబ్బంది, పారా మెడికల్​ సిబ్బంది కావొచ్చు.. గత ప్రభుత్వం ఏనాడూ నింపాలని ఆలోచన చేయలేదు.  బీఆర్​ఎస్​కు చిత్తశుద్ధి లేదని,  ఖాళీలను భర్తీ చేయరని, వాళ్ల ఉద్యోగాలు ఊడగొడితే తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పిన. వాళ్లను రిమూవ్​ చేసినందుకు.. నేను మీకు అందరికీ నియామక పత్రాలు అందిస్తున్న” అని నియామక పత్రాలు అందుకున్నవాళ్లతో సీఎం అన్నారు.  

నిరుద్యోగులపై ఇదీ మా చిత్తశుద్ధి

దేశంలో ఒక్క ఏడాదిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 50 వేలకు పైగా నియామకాలు చేపట్టలేదని, తెలంగాణలో చేపట్టి చరిత్రను నెలకొల్పామని  సీఎం రేవంత్​ అన్నారు. ‘‘డీఎస్సీ నోటిఫికేషన్​ ఇచ్చినప్పుడు కొందరు వాయిదా వేయాలని రాజకీయ ప్రేరేపిత ఆందోళన చేపట్టారు.  గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేను.. ఎవరు ఏమి అనుకున్నా, ఎవరు రోడ్డు ఎక్కినా డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తా అని చెప్పిన. 65 రోజుల్లో నోటిఫికేషన్​ ఇచ్చి పరీక్షలు నిర్వహించి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు కూడా ఇచ్చిన. అదీ మా ప్రజా ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల ఉన్న చిత్తశుద్ధి. ఇప్పుడు 50 వేల ఉద్యోగాలు ఇచ్చినం అంటే.. ఈ తెలంగాణ సమాజమే మా కుటుంబం అనుకున్నం. మీకోసం సేవ చేయడం గొప్ప అవకాశం అనుకున్నం. 

నిరుద్యోగులకు అవకాశం ఇవ్వడం ద్వారా దేశ అభివృద్ధి కోసం ప్రయోజకులుగా మారాలని చిత్తశుద్ధితో పనిచేసినం” అని తెలిపారు.  గ్రూప్​ 1 పరీక్షలు వాయిదా వేయాలంటూ జీవోలలో కోడి గుడ్డు మీద ఈకలు పీకాలని సుప్రీంకోర్టు దాకా పోయారని విమర్శించారు. ఎక్కడా వారిని కోర్టులు సమర్థించలేవని తెలిపారు. ‘‘పరీక్షలు నిర్వహించాలని గత సర్కార్​లో  ధర్నాలు చేసినోళ్లు.. ఇప్పుడు  పరీక్షలు వద్దు అని ఒక రాజకీయ పార్టీ ప్రేరేపించి ధర్నా చేయిస్తే.. నథింగ్​ డూయింగ్​ అని గ్రూప్​ ప్రిలిమ్స్​, మెయిన్స్​ ఎగ్జామ్స్​ నిర్వహించాం” అని వివరించారు. 2011 తర్వాత గ్రూప్​ 1 నిర్వహించలేదని.. ఇప్పుడు పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ చైర్మన్​గా మహేందర్ రెడ్డి చాలా దీక్షతో ఈ పరీక్షలను నిర్వహించి..  మెయిన్​ ఎగ్జామ్స్​ను కూడా కంప్లీట్​ చేయించారని ఆయన తెలిపారు. 

బీఆర్​ఎస్​ నేతల గుండెలు దడ దడ

తమ ప్రభుత్వం చేసిన రుణమాఫీతో రైతుల ఖాతాలు గల గల అంటుంటే కొంతమంది గుండెల్లో పిడుగులు పడిన బాధ కలుగుతున్నదని బీఆర్​ఎస్​ నేతలను సీఎం రేవంత్​రెడ్డి విమర్శించారు. ‘‘రూ. 2లక్షల లోపు రుణం ఉన్న 25 లక్షల మంది రైతులకు 21వేల కోట్ల రూపాయలు వాళ్ల ఖాతాల్లో వేసినం. రైతుల ఖాతాలు గల గల మంటుంటే.. కొందరు ఫామ్​హౌస్​లో పడుకొని గుండెల్లో పిడుగు పడ్డట్టు బాధపడ్తున్నరు. ఎందుకయ్య వాళ్లకు బాధ? రుణమాఫీ చేసినందుకా? బోనస్​ ఇస్తున్నందుకా? ఆ బాధకు మందు లేదు. ఆ బాధ పోవాలంటే మా మంత్రి జూపల్లి కృష్ణారావు చూసే శాఖ మందు ఇయ్యాలె” అని వ్యాఖ్యానించారు. సంక్రాంతి పండుగ ముందు డూడూ బసవన్నలతో గంగిరెద్దుల వాళ్లు వస్తారని, అట్లనే ఇప్పుడు కొందరు జనం ముందుకు వస్తున్నారని బీఆర్​ఎస్, బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు.

 ‘‘వాళ్లు ఎన్ని సన్నాయిలు ఊదినా.. ఎన్ని గంగిరెద్దులు తెచ్చి ఎన్ని దండాలు పెట్టించినా వాళ్ల లక్ష్యమంతా వచ్చే సర్పంచ్​ ఎన్నికల్లో ఓట్లు తప్ప రైతుల కష్టాలు పట్టించుకోవాలనో, వారిని ఆదుకోవాలనో కాదు’’ అని అన్నారు.  ‘‘ఒకాయన ఢిల్లీలో మూడుసార్లు అధికారంలోకి వచ్చిండు. రైతుల ఆదాయం రెండింతలు చేస్తా అని నల్ల చట్టాలు తెచ్చిండు. 16 నెలలు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు యుద్ధం ప్రకటిస్తే, 750 మంది చనిపోతే ఆ చట్టాలు వెనక్కి తీసుకుని  క్షమాపణ చెప్పిండు. వరి ఏసుకుంటే ఉరి అని అన్న మరొకాయన, పాలన కాలమంతా  ఫామ్​హౌస్​​లో పడుకున్నడు’’ అని సీఎం విమర్శించారు. తాను పనిని పక్కనపెడ్తే అందరి పని పడ్తానని బీఆర్ఎస్​ నేతలను హెచ్చరించారు.  

అంబులెన్స్​లు, ట్రాన్స్​జెండర్లకు క్లీనిక్​లు ప్రారంభం 

108, 102 అత్యవసర సేవల వాహనాలను సీఎం రేవంత్​ రెడ్డి  పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.  108 సేవల కోసం 136 అంబులెన్సులు, 102 సేవల కోసం 77 అంబులెన్సులు అందుబాటులోకి తీసుకువచ్చారు.  28 పారామెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ కాలేజీలను వర్చువల్‌‌గా సీఎం  ప్రారంభించారు. అదే విధంగా 33 ట్రాన్స్‌‌జెండర్ల క్లీనిక్‌‌లను ప్రారంభించారు. ఈ  మైత్రి ట్రాన్స్ క్లీనిక్‌‌లు ప్రతి గురువారం సేవలు అందించనున్నాయి. కార్యక్రమంలో 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 24 మంది ఫుడ్ ఇన్‌‌స్పెక్టర్లు నియామక పత్రాలను అందుకున్నారు.  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్‌‌ తదితరులు పాల్గొన్నారు.  

దేశంలోనే ఎక్కువ డాక్టర్లను మనం అందించాలి

దాదాపుగా ఒక సంవత్సరంలో వైద్యారోగ్య శాఖలో 14 వేల మంది నియామకం  ఎక్కడా జరగలేదని..కానీ తెలంగాణలో జరిగిందని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు.  ‘‘ఆరోగ్య శాఖ మంత్రి దామోదర
రాజనర్సింహ ఎడ్యుకేషన్​ ఇంజనీరింగ్​ కావొచ్చు.. కానీ బై నేచర్​ ఆయన డాక్టర్​ గా శాఖలో అన్నీ అనుమతులు సాధించుకున్నరు. ఆర్థిక శాఖ, సీఎం అనుమతులు తీసుకుని పనిచేసుకుంటూ పోతున్నరు” అని చెప్పారు. గత ప్రభుత్వం జీవోలతో 8 మెడికల్​ కాలేజీలు ఇచ్చిందని, ఎలాంటి వసతులు ఏర్పాటు చేయకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఎంబీబీఎస్​ అడ్మిషన్లు చేయడానికి అభ్యంతరం పెట్టిందని తెలిపారు. 

రాజనర్సింహ ప్రత్యేకంగా కేంద్రంతో మాట్లాడి ఆ కాలేజీలలో అడ్మిషన్లు సాధించారని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక డాక్టర్లను అందించే రాష్ట్రంగా తెలంగాణ ఉండాలని ఆకాంక్షించారు. ‘‘పదేండ్లయినా 30 పడకలు, వంద పడకలు, మెడికల్​ కాలేజీలు జీవోల్లో తప్ప బయట లేదు. అదీ గత సర్కార్​ తీరు. మేం రాజీవ్​ ఆరోగ్య శ్రీని రూ.10 లక్షలకు పెంచినం. సీఎంఆర్​ఎఫ్​ కింద రూ.830 కోట్లు ఏడాదిలోనే ఇచ్చినం. చేసింది సరిపోదు.. ఇంకా చేయాల్సింది ఉంది. మౌలిక వసతులు, ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ కల్పించాల్సి ఉంది” అని
ఆయన తెలిపారు.  

పదేండ్లు మనమే ఉంటం.. సన్నవడ్లు పండించండి

సన్నవడ్లకు బోనస్​తో కౌలు రైతులకు కూడా మేలు జరుగుతున్నదని  సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు.  ‘‘ఒక ఆడబిడ్డ కౌలుకు చేసేటమె చెప్పింది.. రైతుబంధు ఇస్తే భూమి ఉన్నాయనకు వెళ్తుంది.. కౌలుకు నేను చేస్తే అప్పులు మిగులుతున్నయని. ఈసారి రేవంత్​ సార్​ బోనస్​ ఇవ్వడంతో తనకు ఎకరాకు 30 క్వింటాళ్ల వడ్లు పండినయని తెలిపింది.  బోనస్​ ఇయ్యడంతో ఎకరాకు రూ.15 వేలు వచ్చిందని, సంవత్సరానికి 2 పంటలు తీస్తే ఒక ఎకరా కౌలుకు తీసుకుంటే వచ్చే దానికంటే అదనంగా రూ.30 వేలు వస్తున్నయని పేర్కొంది.

 దీంతో నా కడుపు నిండింది. మంచి బిర్యానీ తింటే  ఎట్లా ఉంటదో నాకు అంత సంతోషం వేసింది. ఈ వేదిక నుంచి రైతులకు మాట ఇస్తున్న.. పది సంవత్సరాలు మన ప్రజా ప్రభుత్వమే ఉంటది. ఎవరు అడ్డం పడుకున్నా.. నిలువు పడుకున్నా.. కాళ్లలో కట్టెలు పెట్టినా.. సన్నవడ్లు పండించండి. రూ.500 బోనస్​ మీ ఖాతాల్లో పడుతుందని మాట ఇస్తున్న” అని ఆయన స్పష్టం చేశారు.