ముందు నికర జలాల లెక్క తేల్చండి : సీఎం రేవంత్ రెడ్డి

 ముందు నికర జలాల లెక్క తేల్చండి : సీఎం రేవంత్ రెడ్డి
  • ఆ తర్వాతే గోదావరి వరద జలాలపై మాట్లాడుదాం.. ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
  • సమ్మక్క-సారక్క, సీతారామ ప్రాజెక్ట్ లపై అభ్యంతరాలను ఉపసంహరించుకోవాలి
  • కృష్ణా నదిపై ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతో రాష్ట్రానికి అన్యాయం
  • గోదావరి విషయంలో రిపీట్ కానివ్వబోమని వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: గోదావరి వరద జలాలపై ఏపీ సర్కారు కట్టే ప్రాజెక్టులకు అనుమతి కావాలంటే.. ముందుగా నికర జలాల ప్రాజెక్టుల లెక్క తేల్చాల్సిందే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అది జరగకుండా గోదావరి వరద జలాల పేరుతో బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ద్వారా నీటిని కృష్ణాకు తరలించాలనే ఏపీ సర్కార్ తీరును అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. సముద్రంలో వృథాగా కలిసే వరద జలాలను కృష్ణా బేసిన్‌‌‌‌‌‌‌‌కు తరలిస్తామని ఏపీ చెబుతున్నదని, అలాంటప్పుడు నికర జలాలపై తెలంగాణ నిర్మిస్తున్న సమ్మక్క– సారక్క, సీతారామ తదితర ప్రాజెక్టులకు ఎందుకు అభ్యతరం చెబుతున్నారని ప్రశ్నించారు. 

సోమవారం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్ లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్​తో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గోదావరి జలాలను మూసీ నదికి అనుసంధించాలని తాజాగా ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలోని నీటి ప్రాజెక్టులు, ఇప్పుడున్న నీటి కేటాయింపులు, నీటి వినియోగం గురించే ప్రధానంగా కేంద్ర మంత్రితో  చర్చించినట్టు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులపైనే ప్రధానంగా చర్చ జరిగిందని తెలిపారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాల ని కోరామన్నారు. ఎస్ ఎల్ బీసీ టన్నెల్ లో  సహాయక చర్యలను వివరించినట్టు చెప్పారు. 

నష్టపోయేందుకు సిద్ధంగా లేం

 తెలంగాణకు కేటాయించిన నికర జలాలపై సమ్మక్క – సారక్క, సీతారామ తదితర ప్రాజెక్టులు కడుతున్నామని సీఎం రేవంత్​ తెలిపారు. వీటికి ఇంకా నికర జలాల్లో పంపకాలు జరగలేదని చెప్పారు. అలాగే, ఈ ప్రాజెక్టులకు సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) ఫైనల్ క్లియరెన్స్ ఇంకా రాలేదన్నారు. అయితే, తెలంగాణ కు చెందిన శాశ్వత కేటాయింపుల్లోని ప్రాజెక్టులపై ఏపీ ఎందుకు అభ్యంతరం చెబుతున్నదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ శాశ్వత ప్రాజెక్టులకు శాశ్వత కేటాయింపులు పూర్తయిన తర్వాతే వరద జలాల లెక్క తేలుతుందని అన్నారు.

 గోదావరి నదిపై నిర్మిస్తున్న తెలంగాణ ప్రాజెక్టుల నీటి కేటాయింపులు పూర్తయిన తర్వాతే  ఇతర ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలన్నారు. తెలంగాణ  ఆయకట్టును స్థిరీకరించకపోతే కేటాయింపులు ఎలా జరుగుతాయని నిలదీశారు. ఆయకట్టు  చివరి భూములకు స్థిరీకరణ జరిగితే ముందుగా వాటికే కేటాయింపులు జరుపుతారని వివరించారు. కృష్ణా జలాలపై కూడా అదే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆయకట్టు లెక్కల ప్రకారమే తెలంగాణకు తాత్కాలిక వాటా తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు. 

తప్పక అభ్యంతరం చెప్తం

గోదావరి నదిపై నిర్మిస్తున్న తెలంగాణ ప్రాజెక్టుల నీటి కేటాయింపులు ముందుగా పరిష్కారం కావాలని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తిగా జరిగిన తర్వాతనే ఎన్ని వరద జలాలు మిగులుతాయనే లెక్క తేలుతుందని చెప్పారు. అప్పుడు ఏపీ ప్రభుత్వం ఏం కట్టుకోవాలి అనుకుంటున్నదో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలన్నారు. గోదావరి రివర్ మేనేజ్​మెంట్​ బోర్డు(జీఆర్ఎంబీ)లో ఆయా ప్రాజెక్ట్ లపై చర్చించి.. అప్పుడు దానిపైన అభ్యంతరం ఉందా? లేదా? అనేది చర్చ చేపడుతామని అన్నారు. 

ప్రస్తుతం తెలంగాణ శాశ్వత నికరజలాల ప్రాజెక్టులపై అభ్యంతరాలు పెడుతున్న ఏపీ.. వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్డీయేలో కూటమిగా ఉన్న ఏపీ ప్రభుత్వం..  ముందుగా తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇప్పించేటట్టు సహకరించాలని హితవు పలికారు. కృష్ణా నదిలో తలెత్తిన పరిస్థితి గోదావరి విషయంలో జరగకూడదని తాము పోరాడుతున్నామని చెప్పారు.  రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు, ప్రాజెక్టులు, ఇతర అంశాల్లో తెలంగాణ ప్రభుత్వానికి చాలా క్లారిటీ ఉందని తెలిపారు.  తెలంగాణ ప్రాజెక్టుల భవిష్యత్తు గందరగోళం లో ఉన్నప్పుడు .. ఏపీ ప్రభుత్వం వరద జలాలపై ప్రాజెక్టులు కట్టుకుంటామంటే తాము కచ్చితంగా అభ్యంతరం చెప్తామని స్పష్టం చేశారు.