సీఎం రేవంత్‌‌కు హైకోర్టులో ఊరట

సీఎం రేవంత్‌‌కు హైకోర్టులో ఊరట
  • బీజేపీ పెట్టిన కేసులో వ్యక్తిగత విచారణకు మినహాయింపు

హైదరాబాద్, వెలుగు: బీజేపీ పెట్టిన పరువు నష్టం కేసులో సీఎం రేవంత్‌‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో జరిగే విచారణ నుంచి రేవంత్‌‌రెడ్డికి వ్యక్తిగత విచారణ నుంచి మినహాయింపు ఇస్తూ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగూడెంలో జన జాతర సభలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను తొలగిస్తుందని రేవంత్ ఆరోపించారు. ఈ కామెంట్స్ వల్ల తమ పార్టీ పరువు దెబ్బతిందంటూ బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి ప్రత్యేక కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును కొట్టివేయాలని కోరుతూ రేవంత్‌‌ రెడ్డి ఇటీవల దాఖలు చేసిన పిటిషన్‌‌పై జస్టిస్‌‌ కె.లక్ష్మణ్‌‌ శుక్రవారం విచారణ చేపట్టారు. 

పిటిషనర్‌‌ తరఫు సీనియర్‌‌ న్యాయవాది టి.నిరంజన్‌‌రెడ్డి వాదిస్తూ..రాజకీయ ప్రసంగంతో బీజేపీకి ఏ రకంగా పరువు నష్టం కలిగిందనే విషయాన్ని ఫిర్యాదుదారు వివరించలేదన్నారు. పార్టీ తరఫున ఫిర్యాదు చేయడానికి అధీకృత అధికారి అనుమతి అవసరమన్నారు. ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కింది కోర్టు వాయిదాలకు రేవంత్‌‌రెడ్డి హాజరుకావడంలేదన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ..సీఎంగా ఉన్న వ్యక్తి రోజువారీ విచారణకు ఎలా హాజరవుతారని ప్రశ్నించారు. వ్యక్తిగతంగా సీఎం హాజరు మినహాయింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. కౌంటరు దాఖలు చేయాలంటూ పబ్లిక్‌‌ ప్రాసిక్యూటర్‌‌ పల్లె నాగేశ్వరరావును, ఫిర్యాదుదారు వెంకటేశ్వర్లును ఆదేశించారు. తదుపరి విచారణను జూన్‌‌ 13కు వాయిదా వేశారు.