హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియెట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేశ్ కూమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.
ఆగస్ట్ 20న రాజీవ్ గాంధీ జయంతి రోజున సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో విగ్రహాన్ని ఆవిష్కరింపజేయాలని ప్రభుత్వం భావించింది. కానీ.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. సచివాలయానికి ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని బీఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఆ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని గత ప్రభుత్వం భావించింది. అయితే, తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సింది సెక్రటేరియెట్బయట కాదని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు.
ALSO READ | Good News : అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ
సచివాలయం లోపల ప్రధాన ద్వారం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు ఇటీవలి భూమి పూజ కూడా చేశారు. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ప్రకటించారు. ఒకవైపు దేశానికి ప్రధానులుగా పనిచేసిన ఇందిరా గాంధీ, పీవీ విగ్రహాలు వరుసగా ఉండటంతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అటు అమరవీరుల చిహ్నం, సెక్రటేరియెట్ మధ్యలో ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.