- 161 ప్రాజెక్టులు ఆగిపోయినయ్
- ఆర్టీసీ బస్సులను ఈ -మోడల్‌లోకి మార్చేందుకు సహకరించండి
- కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
- కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్, కుమారస్వామి, శ్రీనివాసవర్మతో భేటీ
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ పర్యటనలో రెండో రోజు సీఎం రేవంత్‌రెడ్డి బిజీ బిజీగా గడిపారు. ఒకవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రోగ్రాంలో పాల్గొన్న ఆయన.. మరోవైపు రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్, కుమార స్వామి, భూపతిరాజు శ్రీనివాసవర్మతో వేర్వేరుగా సమావేశమయ్యారు. తొలుత కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కలిశారు.
తెలంగాణలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందిరా పర్యావరణ్ భవన్‌లో దాదాపు అరగంటకుపైగా ఈ సమావేశం జరిగింది. అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 161 ప్రాజెక్టులు నిలిచిపోయాయని, వాటికి అనుమతులు ఇవ్వాలని కోరారు. అందులో 38 ప్రాజెక్టులకు వన్యప్రాణి సంరక్షణ చట్టాలకు సంబంధించిన అనుమతులు కూడా మంజూరు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రాజెక్టుల్లో ఎక్కువగా మారుమూల ప్రాంతాలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. అనుమతులు రాకపోవడంతో జాతీయ రహదారులు, ఏజెన్సీ ప్రాంతాల్లో టవర్ల నిర్మాణం, పీఎంజీఎస్‌వై, పొరుగు రాష్ట్రాలను అనుసంధానించే రహదారుల నిర్మాణ పనులు నిలిచిపోయాయని భూపేందర్ యాదవ్‌కు రేవంత్‌రెడ్డి తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతుల విషయాన్నీ తీసుకెళ్లారు. కాగా, తమ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ సానుకూలంగా స్పందించారని సీఎంవో వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
హైదరాబాద్‌లో 100శాతంఆర్టీసీ బస్సులు ఈ –మోడల్‌లోకి.!
కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామితో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. కేంద్ర మంత్రిని ఆయన ఆఫీసులో కలిసి హైదరాబాద్‌లో వంద శాతం బస్సులను ఎలక్ట్రిక్ మోడల్‌లోకి మార్చేందుకు సహకరించాలన్నారు. పీఎం ఈ–-డ్రైవ్ పథకం కింద జీసీసీ పద్ధతిలో బస్సులు కేటాయించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులకు ఎలక్ట్రిక్ కిట్ అమర్చి రిట్రో ఫిట్మెంట్ పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌కు కేంద్ర ప్రభుత్వం కేటాయించే 2,800 బస్సులను జీసీసీతో పాటు రిట్రో ఫిట్మెంట్ మోడల్ కింద కేటాయించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.
అనంతరం కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మను సీఎం రేవంత్ రెడ్డి ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై ఆయనతో చర్చించారు. సీఎం వెంట రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, సీఎస్ శాంతికుమారి, సీఎం స్పెషల్ సెక్రటరీ వి.శేషాద్రి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (మౌలిక వసతులు) శ్రీనివాసరాజు, పీసీసీఎఫ్ డొబ్రియల్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు ఉన్నారు. కాగా, కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం ఢిల్లీ పర్యటన ముగించుకొని సింగపూర్ టూర్ కు సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లారు.